ఆ ఇల్లు.. ఆహార పంటల పొదరిల్లు

10 Apr, 2018 04:57 IST|Sakshi

ఇంటి పంట

ఆ ఇంటి మిద్దెపైకి వెళ్తే ఆకు కూరల పచ్చదనం స్వాగతం పలుకుతుంది. కాయగూరల మొక్కలు బోలెడు కబుర్లు చెబుతుంటాయి. రంగురంగుల పూలు పరిమళాలు వెదజల్లుతాయి. వెరసి ఆ ఇల్లు సేంద్రియ వనంగా, ఆహార పంటల పొదరిల్లుగా మారిపోయింది. ఆ సామ్రాజ్యానికి రారాణి.. తాడికొండ అనుపమ! విశాఖ నగరంలో శంకరమఠం ప్రాంత నివాసి అయిన అనుపమ తొలుత తన వంటగది సమీపంలో 10 కుండీల్లో ఆకుకూరలు పెంచారు. ఆ తర్వాత రెండేళ్ల నుంచి టెర్రస్‌పై కూరగాయల సాగు చేస్తున్నారు. భర్త టీవీ సుధాకర్‌ ప్రోత్సాహంతో ఆమె ఈ పనిని ఎంత శ్రద్ధగా చేస్తున్నారంటే ఈ రెండేళ్లుగా ఆకుకూరలు, కూరగాయలు కొనలేదట.

ఆ ఇంట.. ప్రతి పంట..
అనుపమ ఇంటి టెర్రస్‌పై ప్రతి పంటా దర్శనమిస్తుంది. వంటగదిలో ఏర్పాటు చేసిన కుండీల్లో పుదీనా, కొత్తిమీర, కరివేపాకును పెంచుతున్నారు. కూరలకు అవసరమైన వాటిని ఆ కుండీల నుంచి తాజాగా తుంచి వంటలకు వినియోగిస్తున్నారు. అదే మాదిరిగా టెర్రస్‌పై తోటకూర, పాలకూర, మెంతి కూర, బచ్చలి కూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా, ముల్లంగి, ఉల్లికాడలు, మెంతికూర తదితర ఆకుకూరలను సాగు చేస్తున్నారు.

అదే విధంగా దొండకాయలు, బెండకాయలు, వంకాయ, టమాటా, బీర, దోస, చిక్కుడు, సొరకాయ, మిరపకాయలు, అల్లం, మామిడి అల్లం, వెల్లుల్లి, మునగకాయలు, ఫ్రెంచ్‌బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ, కాలిఫ్లవర్, చిక్కుడు, మునగ, బీట్‌రూట్‌ మొదలైన కూరగాయలు పండిస్తున్నారు. మిర్చిలో నాలుగైదు రకాలు ఉన్నాయి.  జామ, నిమ్మ, దానిమ్మ, స్ట్రాబెర్రీ మొక్కలను సైతం పెంచుతున్నారు.

డ్రమ్ములు, సిమెంట్, ప్లాస్టిక్, మట్టి కుండీలతో పాటు ధర్మాకోల్‌ డబ్బాలు, వాటర్‌ క్యాన్లలోనూ మొక్కలు పెంచుతున్నారు. 10 మొక్కలతో ప్రారంభమైన ఆ ఇంటి పంట.. ఇప్పుడు 200కి పైగా మొక్కలకు చేరుకుంది.గోమూత్రం, ఆవు పేడను ఎరువుగా వినియోగిస్తున్నారు. వాడిపోయిన పూలు, రాలిన ఆకులు, కూరగాయ వ్యర్థాలను ఒక చోట చేర్చి, అందులో అప్పుడప్పుడూ మజ్జిగ చల్లుతూ 30 నుంచి 45 రోజుల్లో కంపోస్టు తయారు చేసుకొని, మొక్కలకు వాడుతున్నారు.

పిల్లల కోసం లిటిల్‌ ఫార్మర్‌ కిట్‌
చిన్నారుల్లో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించి లిటిల్‌ ఫార్మర్‌గా తీర్చిదిద్దాలని ఆమె సంకల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కిట్‌ను సిద్ధం చేశారు.  ఒక గ్రోబ్యాగ్, మట్టి మిశ్రమం, విత్తనాలతోపాటు.. విత్తనాలు వేశాక దశలవారీగా మొక్కల పెరుగుదలను పిల్లలు నమోదు చేసేందుకు యాక్టివిటీ షీట్, కలరింగ్‌ షీట్, సలాడ్‌ రెసిపీతో పాటు లిటిల్‌ ఫార్మర్‌ సర్టిఫికెట్‌ కూడా ఆ కిట్‌లో ఉంటాయి.

                                అనుపమ రూపకల్పన చేసిన ‘లిటిల్‌ ఫార్మర్‌ కిట్‌’

మరిన్ని వార్తలు