నా భార్యను ఇలా మెప్పించాను...

26 Feb, 2014 00:07 IST|Sakshi
నా భార్యను ఇలా మెప్పించాను...

 ఓ ఐదు కిలోమీటర్ల నుంచి మొదలైన ‘ఎక్కడికి?’ అన్న ప్రశ్న ఓ పదిసార్లు నా చెవిని ఇబ్బంది పెట్టింది. ఎట్టకేలకు ఏదో ఒకటి చెప్పి ఊరి శివారులోని ఓ వనానికి తీసుకెళ్లాను.
 
 

బంగారం కొంటేనే భార్య ఫ్లాటవుతుంది, చీర కొంటేనే సరదా పడుతుంది.. అనే భ్రమలు మీలో ఎవరికైనా ఉంటే వాటిని తుడిచేయడం చాలా బెటరు. ఎందుకంటే భార్య మెప్పు ‘ఆకలి’ వంటిది. ప్రతి పూటకు ఆకలి తీర్చుకోవచ్చు కానీ ప్రతిసారీ ఆమెను మెప్పించడం కష్టసాధ్యం. అందుకే ఆమె మెప్పు పొందే ప్రయత్నాలు ఎంత తక్కువ ఖరీదుతో కూడుకున్నవైతే అంత మంచిది.
 భార్య మెప్పు పొందడం పెళ్లయిన ప్రతి మగాడి సమస్య కాబట్టి నేను కూడా పెళ్లయ్యాక ఈ సమస్యను ఎదుర్కొన్నాను. కాకపోతే అందరిలా కాకుండా నేను కొన్ని కొత్త ప్రయోగాల ద్వారా నా భార్యను మెప్పించాలని ఫిక్సయ్యాను. ఆ క్రమంలో నా బుర్రలోకి వచ్చిన తొలి ఆలోచనను ఇటీవలే అమలు పరిచాను. అది ఇదే!

 

 గత ఆదివారం తెల్లవారుజామునే లేచాను. ఏదో బాత్‌రూంకు వెళ్లినట్టు నటించి హాల్లో బాత్‌రూమ్ లోపలకు వెళ్లే శబ్దం చేసి ఒక్క నిమిషంలోనే నిశ్శబ్దంగా బయటకు వచ్చి వంట గదిలోకి వెళ్లాను. ఆ ముందు రోజు రాత్రే ఏవి ఎక్కడ ఉన్నాయో రెక్కీ నిర్వహించిన మూలంగా సులువుగా పాత్రల శబ్ధం ఏమీ రాకుండా ఓ వంటకు కావల్సిన వస్తువులన్నీ జాగ్రత్తగా తీసుకున్నాను. ముందు రోజే కొన్ని రెడీ మిక్స్‌లు కారు డిక్కీలో మా ఆవిడకు తెలియకుండా ఉంచాను. వాటికి అదనంగా కావల్సిన ఉపకరణాలు, వస్తువులు, ఇతర యాడ్-ఆన్స్ ఓ ప్లాన్ ప్రకారం రెడీ చేసుకుని కేవలం పది నిమిషాల్లో అన్నింటినీ కారు డిక్కీలో పెట్టేశాను.

 

మళ్లీ బాత్‌రూంలోకి నిశ్శబ్దంగా వెళ్లి శబ్దం చేసుకుంటూ బయటకు వచ్చాను. అంటే అంతసేపూ బాత్‌రూంలో ఉన్నట్టు బిల్డప్ ఇవ్వడానికి! ఆ తర్వాత మళ్లీ పడుకుని తీరిగ్గా మా ఆవిడ లేచి టిఫిన్ చేశాక బద్దకంగా లేచాను. ఆ పనీ, ఈ పనీ చేసుకునేటప్పటికి పదకొండు అయ్యింది. అలా బయటికి వెళ్దాం... అని ఆమెను బయలుదేరమని చెప్పి కారులో బయటకు వెళ్లాం. ఓ ఐదు కిలోమీటర్ల నుంచి మొదలైన ‘ఎక్కడికి?’ అన్న ప్రశ్న ఓ పదిసార్లు నా చెవిని ఇబ్బంది పెట్టింది. ఎట్టకేలకు ఏదో ఒకటి చెప్పి ఊరి శివారులోని ఓ వనానికి తీసుకెళ్లాను. అదీ మరి అటవీ ప్రాంతమేమీ కాదు.. కానీ ఓ పల్లెటూరికి సమీపంలోని చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం.

 

 

అక్కడ ఆపి కాస్త ఒళ్లు విరుచుకుని డిక్కీ ఓపెన్ చేశాను. ఏం చేస్తున్నానో మా ఆవిడ అర్థం చేసుకునేలోపు ‘అడవిలో వంట’ టైటిల్ కింద ఓపెన్ ఎయిర్ కిచెన్ సెటప్ ఏర్పాటుచేసి వంట మొదలుపెట్టాను. మా ఆవిడ ఆశ్చర్యం నుంచి ప్రశ్నల వర్షం... ‘ఇవన్నీ ఎప్పుడు కొన్నావు, సామాన్లు కారులో ఎప్పుడు పెట్టావు, నాకు ముందు ఎందుకు చెప్పలేదు’... ఇలాంటి రకరకాల ప్రశ్నలు వేస్తూండగానే నేను వంట మొదలుపెట్టాను. ఆ తర్వాత చకా చకా హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్‌తో ఆమె నోరు మూయించా. మొత్తానికి ఎగ్‌తో రెండు రకాల ప్రయోగాలు, రెడీమిక్స్‌లతో ఓ రెండు మూడు ప్రయోగాలు వండుకుని, కోక్‌తో కలిపి వడ్డించుకుని మా ఆవిడని మెప్పించాను. ఆమె ఎంత ఆనందపడిందంటే... ఆ ఫొటోలు తీసి ఫేస్ బుక్‌లో ‘వన్ సర్‌ప్రైజింగ్ డే ఇన్ మై రీసెంట్ లైఫ్’ అని పెట్టి ఫ్రెండ్సందరితో లైకులు కొట్టించుకుని ఓ రెండు మూడు రోజులు నన్ను పొగుడుతూనే ఉంది. అపుడు నాకు నేనే శభాష్ అనుకుని, మరో భిన్నమైన ఐడియా ఆలోచిస్తూ అలా రోజులు గడిపేస్తూ ఉన్నా!     ఇట్లు     
 - ఒక తెలివైన భర్త.
 
 

>
మరిన్ని వార్తలు