పిడికెడు మెతుకులు...గుప్పెడు అక్షరాలు.

21 Dec, 2019 01:23 IST|Sakshi
∙శారదా మఠంలో కుట్టు శిక్షణ పొందుతున్న యువతులు

మానవ సేవ కూడా ఒక ఆధ్యాత్మిక సాధనే. సాటి మానవునికి చేతనైన సేవ చేయడం దివ్యత్వానికి చేరువ కావడమే. గుంటూరులోని శారదా పీఠం చేస్తున్న సేవ చాలామంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. వారిలో సంచారజాతి బాలలు ఉన్నారు. నిమ్నవర్గాల స్త్రీలు ఉన్నారు. విద్య, వృత్తివిద్య అందిస్తూ ఇక్కడ సాగుతున్న సేవ ప్రశంసనీయమైనది.

గుంటూరు నగరంపాలెంలోని విశాలమైన జిల్లాపరిషత్‌ ప్రాంగణంలో ప్రశాంతంగా కనిపించే ‘శారదాపీఠం’లో  సాగుతున్న మానవసేవ ప్రశంసనీయమైనది. సంచారజాతుల పిల్లలను చేరదీసి, వారికి విద్యాబుద్ధులు చెప్పడం ఒక పని. పేదబాలికలకు స్కూల్‌ నడపడం మరో పని. పేద వర్గాల మహిళలకు, యువతులకు స్వయంసమృద్ధి కోసం వృత్తి విద్యలు నేర్పడం మరో పని. ఇన్ని పనులు శారదామఠం కార్యదర్శి భవానీ ప్రాణ మాతాజీ ఆధ్వార్యంలో దాదాపు 15 ఇరవై మంది మాతాజీలు క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో, అంకితభావంతో, ఆధ్యాత్మికసేవగా ఎంచి చేస్తున్నారు.

శ్రీశారదామఠం అంటే?
సంపూర్ణ సాధికార ఆధ్యాత్మిక సంస్థ ఒకటి స్త్రీలకు స్థాపించాలి అన్న స్వామి వివేకానంద స్వప్నానికి రూపమే శ్రీ శారదామఠం. కలకత్తాలోని దక్షిణేశ్వరం ముఖ్యకేంద్రంగా దేశ విదేశాల్లో 40 ఉపసంస్థలతో జాతి, కులమతాలకు అతీతంగా ఈ మఠం సేవలందిస్తోంది. శ్రీరామకృష్ణ పరమహంస ధర్మపత్ని శారదామాత జయంతి సందర్భంగా 1954లో దక్షిణేశ్వరంలో స్థాపించబడిన ఈ సంస్థ బాలిక, యువతి, స్త్రీ అభ్యున్నతికి విశేష సేవలందిస్తుంన్నది. రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం గుంటూరులోనే శ్రీశారదామఠం ఉంది. 2001లో నెలకొల్పిన ఈ మఠం గత పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా పని చేస్తోంది.

శ్రీరామకృష్ణ శారదా విద్యాలయం
ఈ మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్‌ ఇది. విశాలమైన ప్రాంగణంలో 350 మంది పేద, మధ్యతరగతి విద్యార్థినులకు విలువలతో కూడిన విద్య అందిస్తున్నారు. వీరిలో 150 మంది విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, భోజన వసతితో సహా ఉచిత విద్యను అందిస్తున్నారు. మిగిలిన వారివద్ద నామమాత్రపు ఫీజులే వసూలు చేస్తున్నారు. పాఠశాలను పూర్తిస్థాయి ఉచిత విద్యాకేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చే స్తున్నారు.

వివేకా విహార్‌
ఇది వీధి బాలల కోసం, సంచార తెగల బాలల కోసం ప్రత్యేకంగా నిర్వహించే స్కూల్‌. గతంలో మఠ ప్రాంగణం చుట్టుపక్కల సంచార కుటుంబాలు చెట్ల కింద నివసించేవారు. తోలుబొమ్మలాట కళాకారులైన వీరు అనంతర కాలంలో ఆ కళకు ఆదరణ తగ్గడంతో ఆర్థికంగా, సామాజికంగా వెనుకపడ్డారు. యాచకవృత్తి, చెత్త సేకరించి విక్రయించుకోవడం తదితర పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి మఠంలోని మాతాజీలు ఎంత ప్రయత్నించినా వారి తల్లిదండ్రులు సహకరించలేదు.

చివరకు పెద్దలకు నచ్చచెప్పి వారి పిల్లలకు మఠంలో వివేకా విహార్‌ అనియత విద్యాకేంద్రం ప్రారంభించారు. వివిధ వయస్సుల్లో ఉన్న 30 మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు వారికి చదువుతోపాటు వ్యక్తిత్వ వికాస æశిక్షణ ఇచ్చారు. మఠంలోని పిల్లలు 5వ తరగతి పూర్తి చేసిన అనంతరం ఉన్నత చదువులకోసం విజయవాడ, గుంటూరులోని పలు కార్పోరేట్‌ పాఠశాలలను సంప్రదించి అక్కడ ఉచితంగా విద్య అభ్యసించేలా చేర్పించారు. ఇది కాకుండా ‘శిశు వికాస్‌’ పేరుతో పాఠశాల అనంతరం పేద విద్యార్దినీ విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్, యోగాసనాలు, సంగీతం, నృత్యంలో శిక్షణ ఇవ్వడంతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నారు.

నివేదిత వృత్తి విద్యా కేంద్రం

మహిళలలో ఆర్థికస్వాలంబన తీసుకువచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే ధ్యేయంగా వృత్తివిద్యాకేంద్రం పనిచేస్తోంది. ఈ కేంద్రం ద్వారా రోజుకు 200 మంది మహిళలు, యువతులకు ఎంబ్రాయిడరి, రంగుల అద్దకం, బ్యాగుల తయారి, కంప్యూటర్‌లలో బ్యాచ్‌ల వారీగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. పేదమహిళలకు ఉచితంగా కుట్టుమిషన్‌లు అందించడంతోపాటు శిక్షణ పూర్తయిన వారికి పలు సంస్థలను సంప్రదించి ఉద్యోగాల కల్పనలోనూ కీలకపాత్ర పోషిస్తున్నది శారదామఠం. ఇక ప్రతిరోజూ మఠంలోని మందిరంలో పూజలు, భజనలు, ధ్యానం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆదివారాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచనాలు మఠకార్యక్రమాల్లో ఒక భాగం.
 – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్‌
ఫోటోలు: మిరియాల వీరాంజనేయులు

తోలుబొమ్మలాట కళాకారుల కుటుంబానికి చెందిన మేము ఆ కళకు ఆదరణ లేకపోవడంతో సోఫాలు రిపేర్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాము. మఠ మాతాజీ 6 సంవత్సరాల క్రితం మా ఊరు వచ్చి మా పిల్లలకు చదువు చెప్పించమని చెప్పడంతో మా ఇద్దరు పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్చాము. నెలకు ఒకసారి పాఠశాలకు వచ్చి పిల్లల్ని చూసుకుని వెళతాము. ఈ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన మా అబ్బాయిని విజయవాడలోని హీల్‌ సంస్థలో పై చదువులు చదివిస్తున్నాం. మా పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గం చూపిన మాతాజీలకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– వనపర్తి బాలాజి, మీనాక్షి దంపతులు,
నరసరావుపేట మండలం, ఎక్కల వారిపాలెం

2008 సంవత్సరంలో మఠంలో కుట్టు, ఎంబ్రాయిడరి, బ్యాగులు తయారి శిక్షణ పొందాను. కొన్ని సంవత్సరాలుగా నేను ఇంటివద్ద మరో ముగ్గురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ షాపు నిర్వహిస్తున్నాను. గతంలో కూలి పనులకు వెళ్ళే నేను, నా భర్త ఈ ఆదాయం కారణంగా పిల్లలు ఇద్దర్ని మంచి కళాశాలలో ఉన్నత చదువులు చదివిస్తున్నాం.
– టి.పరమగీత, గుంటూరు రూరల్‌ మండలం, దాసరిపాలెం

ప్రపంచంలో ఎవరూ పరాయివారు కారు. అందరు నీవారే అన్న దివ్యజనని శ్రీ శారదాదే బోధనల స్ఫూర్తితో మఠాన్ని నిర్వహిస్తున్నాము. ఈ భావం అందరిలో వ్యాప్తి కావాలన్నదేమా ఆకాంక్ష. ఇందుకోసం అంకితభావంతో పని చేస్తున్నాము.
– భవాని ప్రాణ మాతాజీ,  మఠ కార్యదర్శి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా