వెలుగు పూల పరిమళాల వేళ...

22 Oct, 2014 22:24 IST|Sakshi
వెలుగు పూల పరిమళాల వేళ...

దీపావళి రోజున ఇంటింటా దీపం వెలిగించడం ఆచారం. భారతీయ సంప్రదాయం ప్రకారం చెప్పాలంటే... దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు.
 
 దీపం జ్యోతి పర బ్రహ్మ దీపం సర్వ తమోపహమ్‌
 దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే ॥

 దీపాన్ని మనో వికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి... నిదర్శనంగా భావిస్తారని పండితులు చెబుతారు. ఇలా దీపం వెలిగించి, మహాలక్ష్మిని పూజించడం వెనుక ఒక పురాణగాథ ఉంది.
 
పూర్వం ఒకసారి దుర్వాస మహామునికి దేవేంద్రుడు ఆతిథ్యం ఇచ్చాడు. అతిథి సత్కారానికి దుర్వాసుడు పరమానందం చెంది, ఇంద్రుడికి మహిమాన్విత హారాన్ని ప్రసాదించాడు. అయితే అహంకారంతో నిండిన ఇంద్రుడు ఆ హారాన్ని తిరస్కార భావంతో చూసి, తన దగ్గరున్న ఐరావతం మెడలో వేశాడు. ఏనుగు ఆ హారాన్ని తన కాలితో తొక్కేసింది. ఆ సంఘటన చూసిన దుర్వాసుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ ఆగ్రహంలో దేవేంద్రుడిని శపించాడు.

ఆ శాప ఫలంగా దేవేంద్రుడు రాజ్యం, సర్వ సంపదలు కోల్పోయి, దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థించాడు. విషయం గ్రహించిన శ్రీమహావిష్ణువు, దేవేంద్రునితో- ఒక జ్యోతిని వెలిగించి, దానిని శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచించాడు. శ్రీహరి సూచనను తుచ తప్పకుండా పాటించాడు ఇంద్రుడు. దేవేంద్రుని భక్తికి సంతుష్టి చెందిన లక్ష్మీదేవి ఇంద్రుడిని అనుగ్రహించింది. ఆమె కరుణతో దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలనూ పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీహరి చెంతనే ఉన్న శ్రీలక్ష్మితో ‘‘తల్లీ నీవు కేవలం శ్రీహరి దగ్గరే ఉండటం న్యాయమా! నీ భక్తులను కరుణించవా?’’ అని దేవేంద్రుడు ప్రశ్నించాడు. అందుకు లక్ష్మీదేవి, ‘‘దేవేంద్రా! నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు ప్రసన్నురాలనవుతాను. మహర్షులకు మోక్షలక్ష్మిగా, జయాన్ని కాంక్షించే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా, భక్తుల సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా ప్రసన్నురాలవుతాను’’ అని వరమిచ్చింది.

అందుకే, దీపావళి నాడు దీపం వెలిగించి, మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలూ చేకూరతాయని పెద్దల మాట. పురాణాల మాటెలా ఉన్నా, జీవితంలోని చీకటినీ, దుఃఖాన్నీ పారదోలేం దుకు వెలుగు పూల పరిమళాలను పంచే దీపాలను మించినవి ఏముంటాయి!                 

- డా. పురాణపండ వైజయంతి
 

మరిన్ని వార్తలు