నేను... నేనేనా?!

30 Apr, 2014 23:39 IST|Sakshi
నేను... నేనేనా?!

కనువిప్పు
 
మాకు మేము ‘పంచపాండవులు’ అని పేరు పెట్టుకొని ప్రతి తగాదాలో తలదూర్చేవాళ్లం. లెక్చరర్‌లను ఎదురించేవాళ్లం. ఒకసారి మా ఫ్రెండ్‌ను సీనియర్ ఎవరో ఏదో అన్నాడని, అతడిని చితకబాదాం.
 
సినిమాల ప్రభావమో ఏమిటోగానీ... గొడవలు పడడం, గొడవల్లో తల దూర్చడం. దీన్ని హీరోయిజంగా భావించేవాడిని. ఇంటర్ చదివే రోజుల్లో అయితే చదువు కంటే గొడవల మీదే ఎక్కువ దృష్టి ఉండేది. మా గ్రూపులో మొత్తం అయిదుగు సభ్యులం.  ఒకసారి మా ఫ్రెండ్‌ను సీనియర్ ఎవరో ఏదో అన్నాడని, అతడిని చితకబాదాం.

ఒక వారం తరువాత...ఆ రోజు నేను ఏదో పని ఉండి పక్క ఊరు నుంచి వస్తున్నాను. సమయం రాత్రి పది దాటింది. టీ స్టాల్ దగ్గర ఒక బ్యాచ్ కనిపించింది. మేము చావబాదిన సీనియర్ అందులో ఉన్నాడు. ‘వీళ్లు నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా?’ అని మనసులో అనుకొని వేరే రూట్‌లో వెళ్లే ప్రయత్నంలో ఉండగానే- ‘‘రేయ్ ఆగరా’’ అనే అరుపు వినిపించింది.

నేను పారిపోబోతుండగా...అందరూ ఒక్కసారిగా వచ్చి నా మీద పడ్డారు. ఇష్టమొచ్చినట్లు  కొట్టారు. స్పృహ కోల్పోయాను. స్పృహ వచ్చేసరికి హాస్పిటల్‌లో ఉన్నాను.  రెండు వారాల తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాను. కొంత కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకరోజు మా నాన్న కొన్ని పుస్తకాలు తెచ్చి నా చేతిలో పెట్టి ‘‘ఇవి చదువుకోరా. బోర్ కొట్టదు’’ అన్నారు.

అవి ప్రముఖుల జీవిత చరిత్రలు. నా ఆసక్తిని గమనించి మరికొన్ని పుస్తకాలను తెచ్చిచ్చాడు నాన్న. ఆ పుస్తకాలు చదివిన తరువాత  జీవితానికి సార్థకత లేకపోతే  వృథా అనే భావన ఏర్పడింది. ఇక ఆనాటి నుంచి గొడవలు వదిలేశాను. చదువులో ముందున్నాను. ఇప్పుడు నన్ను ఎవరైనా  పొగడుతుంటే ‘నేను నేనేనా?’ అనిపిస్తుంది!
 
-వలస శేషుకుమార్, కాగజ్‌నగర్
 

మరిన్ని వార్తలు