కేన్సర్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు వినూత్న పద్ధతి..

18 May, 2018 02:13 IST|Sakshi

కేన్సర్‌ చివరిదశకు చేరుకుందంటే మరణానికి చేరువైనట్లే. మెటాస్టాసిస్‌ అని పిలిచే ఈ చివరిదశ కేన్సర్‌ను అడ్డుకునేందుకు కాన్సస్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. మెటార్రెస్టిన్‌ అనే ఓ రసాయన మూలకం మెటాస్టాసిస్‌ దశ కేన్సర్‌ కణాలను దాదాపుగా నాశనం చేయగలదని వీరు గుర్తించారు. కొన్ని ఎలుకలకు కృత్రిమంగా క్లోమ, ప్రోస్టేట్, రొమ్ము కేన్సర్‌ కణాలను చొప్పించి మెటార్రెస్టిన్‌ను ప్రయోగించినప్పుడు చాలావరకు కణాలు నాశనమైపోయాయని, ఊపిరితిత్తులు, కాలేయ కేన్సర్లున్న ఎలుకలు ఎలాంటి చికిత్స తీసుకోకుండానే ఎక్కువకాలం పాటు జీవించగలిగాయని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ సుయ్‌ హంగ్‌ తెలిపారు.

మెటాస్టాసిస్‌ కేన్సర్‌ను నిలువరించేందుకు ప్రస్తుతం ఏ మందూ అందుబాటులో లేదని మెటార్రెస్టిన్‌పై వీలైనంత తొందరగా క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హంగ్‌ తెలిపారు. కేవలం ఒకరకమైన జన్యువును లక్ష్యంగా చేసుకుని మందులు తయారుచేస్తే ప్రయోజనం తక్కువగానే ఉంటుందని.. మెటాస్టాసిస్‌ కణాలు మిగిలిన వాటి కంటే చాలా భిన్నంగా ఉండటం దీనికి కారణమని వివరించారు. సర్జరీ, కీమో థెరపీ, రేడియేషన్ల ద్వారా ప్రాథమిక కణితికి చికిత్స అందిస్తే మరణాలను చాలావరకూ తగ్గించవచ్చునని, మెటాస్టాసిస్‌ దశలో మాత్రం ఇది సాధ్యం కాదని చెప్పారు.  

మరిన్ని వార్తలు