జంగిల్ ఫీట్స్

20 Nov, 2016 22:58 IST|Sakshi
జంగిల్ ఫీట్స్

హ్యూమర్ ప్లస్

మనకెంత తెలుసో అదే జ్ఞానం. ఒక తొండ బస్కీలు లేసి తీసి తనది సిక్స్‌ప్యాక్ బాడీ అనుకుంది. జ్ఞానాన్ని అమ్ముకోవడం తెలిస్తే దాన్ని విజ్ఞానమంటారు. అందుకే అడవిలో జిమ్‌స్టార్ట్ చేసింది. ఒక ఊసరవెల్లి వచ్చి రిబ్బన్ కట్ చేసింది. రకరకాల రంగులు మారుస్తూ అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొండ ప్రత్యేకత ఏమంటే అది ప్రతిదానికీ తల ఊపుతూ ఉంది. ఈ ఒక్క లక్షణముంటే చాలు మనమెక్కడున్నా పెద్దమనిషి అని పిలుస్తారు. అందువల్ల తొండకి అండదండలు లభించాయి. జిమ్‌లో బాడీమసాజ్, వెయిట్‌లాస్, మెమరీలాస్ ఇలా చాలా ఐటమ్స్ ప్రవేశపెట్టింది.

మొదట ఒక నత్తవచ్చి రన్నింగ్ నేర్పించమని అడిగింది. ‘‘నత్తలతో పరిగెత్తించడం కార్పొరేట్ సంస్కృతి, పరిగెత్తేవాటిని నత్తలుగా మార్చడం ప్రభుత్వ విధానం. ఇది అడవి. భోజ్యమే తప్ప రాజ్యముండదు’’ అని తొండ రెండు బస్కీలు తీసింది. బస్కీలు తీస్త్తూ మాట్లాడ్డం, మాట్లాడుతూ బస్కీలు తీయడం తొండ బాడీ లాంగ్వేజ్.నత్తకి స్కేటింగ్ బూట్లు కట్టి ఒక తోపు తోస్తే ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ అని పాడుకుంటూ వెళ్లింది.

షికారు ముగిసిన తర్వాత నత్త చిత్త భ్రాంతితో పొర్లుదండాలు పెట్టి ‘‘నత్తకే వేగం నేర్పావంటే నువ్వు మామూలు తొండవి కాదు, ఉద్ధండ పిండానివి’’ అని పొగిడింది.‘‘ఉన్నచోటునే ఉంటూ పరిగెత్తుతున్నామని అనుకోవడం భ్రాంతి, భ్రమలు, కలలే జీవన విధానమైనప్పుడు భ్రాంతిని కాంతిమతం చేసుకోవాలి. దీన్నే పర్సనాలిటి డెవలప్‌మెంట్ అంటారు’’ అంది బస్కీటోన్‌తో తొండ.తరువాత ఒక ఎలుగుబంటి వచ్చి బాడీమసాజ్ చేయమని అడిగింది.

‘‘నీలో ఏది బొచ్చో, ఏది బాడీనో తెలుసుకోవడానికే రెండు రోజులు పడుతుంది’’ అని తొండ గొణుక్కుని, ఖడ్గమృగాన్ని అవుట్‌సోర్సింగ్‌కి తీసుకుంది. ఒక గ్యాలన్ ఫిల్టర్ వాటర్ వేతనంగా ఇవ్వాలని అది కోరింది. ఎలుగుబంటిని చూడగానే ఖడ్గమృగం ఒక్కసారిగా జడుసుకుంది. ఒక బూజుకర్ర తీసుకుని దాని ఒంటిపై ఎడాపెడా బాదింది. దట్టమైన దుమ్ముధూళితోపాటు కొన్ని వందల తేనెటీగలు కూడా ‘జుమ్మంది నాదం’ అంటూ పైకి లేచి కోపంతో ఖడ్గమృగం వెంటపడ్డాయి.‘వీటికి నోట్లోనే కుట్టు మిషనుంటుంది’ అనుకుంటూ ఖడ్గమృగం పారిపోయింది. తేనెటీగల్ని ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ఇంతకాలం ఒంటిపై తేనె పట్టు ఉంచుకుని తేనెకోసం చెట్లూపుట్టలూ వెతికానా?’’ అంది ఎలుగుబంటి.

‘‘అదే ఈ ప్రపంచానికి పట్టిన తెగులు. తమలో ఉన్నది తెలుసుకోలేరు. దేనికోసమో వెతుకుతూ ఉంటారు. నీ అన్వేషణ నీతోనే ముగుస్తుంది’’ అంది తొండ. ఒక కొండచిలువ బుసబుస వచ్చి తనకి స్కిప్పింగ్ నేర్పించమని అడిగింది. ‘‘ప్రపంచమంతా రజ్జు సర్పభ్రాంతితో చస్తూ వుంది. మనం తాడనుకున్నవాడు పాముగా మారుతాడు. పాము అనుకుని హడలి చస్తే అక్కడ తాడూ బొంగరమూ రెండూ ఉండవు. పాము వచ్చి తాడును కోరుకోవడం వాస్తవ విరుద్ధం. మనం నకిలీగా జీవించాలి తప్ప, మనలాంటి నకిలీలను తయారు చేయకూడదు’’ అంది తొండ. కొండ చిలువ వినలేదు. దానికి స్కిప్పింగ్ తాడు ఇస్తే రెండుసార్లు ఎగిరింది. మూడోసారి తన తోకనే తాడు అనుకుని దబ్బున పడింది.

తరువాత ఒక జింక వేగంగా వగరుస్తూ వచ్చి తనకి చిరుతకంటే వేగంగా పరిగెత్తడం నేర్పమని అడిగింది. తొండ విషాదంగా నవ్వి ‘‘నువ్వెంత వేగంగా పరిగెత్తినా, నిన్ను తినేవాడు నీకంటే వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. చిరుత నీకు మృత్యురూపమైతే గద్ద నాకు మృత్యురూపం. మృత్యువు ఒక నీడలా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు అది మనముందు నిలబడి చిరునవ్వు నవ్వుతుంది. అప్పుడు మనకు ఏడుపొచ్చినా నవ్వాల్సిందే’’ అంది.ఇంతలో చిరుతవచ్చి జింకని పట్టేసుకుంది. గద్దకి దొరక్కుండా తొండ మాయమైంది.  - జి.ఆర్.మహర్షి

మరిన్ని వార్తలు