ప్రమోషన్‌ నాన్నకు అంకితం

14 Jul, 2020 00:09 IST|Sakshi

తండ్రి కోరిక

ఖుష్బూ మీర్జా ఇప్పుడు వార్తల్లో వ్యక్తి. ఆమె ఇస్రోలో సైంటిస్ట్‌. గత నెల 25వ తేదీన ఆమె ఇస్రోలో డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఆమె గతంలో చంద్రయాన్, చంద్రయాన్‌–2 ప్రాజెక్టుల్లో పని చేశారు. ఈ ప్రాజెక్టుల్లో ఆమె అందించిన కీలకమైన సేవలకు గుర్తింపుగా 2015లో ‘ఇస్రో టీమ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ అందుకున్నారు. ఖుష్బూ మీర్జాది ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ. ఆమె అలీఘర్‌ ముస్లిమ్‌ యూనివర్సిటీ నుంచి బీటెక్‌ చేసి 2006లో ఇస్రోలో ఉద్యోగంలో చేరారు. ఖుష్బూ ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమె తండ్రి సికందర్‌ మీర్జా మరణించారు. సికందర్‌ ఇంజనీర్‌. వాళ్ల కుటుంబానికి పెట్రోల్‌ పంప్‌ వ్యాపారం ఉండేది. సికిందర్‌ మరణం తర్వాత ఖుష్బూ తల్లి ఫర్హాత్‌ మీర్జా వ్యాపార బాధ్యతలు చేపట్టారు.
తల్లి ఫర్హాత్‌తో ఖుష్బూ మీర్జా
ఖుష్బూ చిన్నప్పటి నుంచి చురుకైన విద్యార్థి. స్కూలు, కాలేజీల్లో ఆమె ఎప్పుడూ టాపర్‌. మంచి క్రీడాకారిణి కూడా. బ్యాడ్మింటన్, వాలీ బాల్‌ ఆటలు బాగా ఆడేవారు. అలీఘర్‌ యూనివర్సిటీలో సీటు కూడా స్పోర్ట్స్‌ కోటాలోనే వచ్చింది. ఖుష్బూ తండ్రికి తన పిల్లలు ఇంజనీర్‌లు కావాలని, దేశం గర్వించే స్థాయిలో దేశానికి సేవలందించాలనే కోరిక ఉండేది. అతడి కోరికను పిల్లలకు చెబుతూ పెంచారు ఫర్హాత్‌. అయితే పిల్లలందరిలో తండ్రి కల కోసం అంకితమైంది ఖుష్బూ మాత్రమే. ఆమె సోదరుడు ఇంజనీరింగ్‌ చదివి తల్లికి వ్యాపారంలో సహాయంగా ఉండిపోయాడు. ఇద్దరు చెల్లెళ్లు పెళ్లి చేసుకుని గృహిణులుగా స్థిరపడ్డారు. ఖుష్బూ ఉద్యోగంలో కూడా చురుగ్గా ఉండేవారు. అనేక సైన్స్‌ సదస్సుల్లో పాల్గొన్నారు. 2012లో జాతీయ స్థాయి ఇస్రో సదస్సులోనూ, 2018లో వరల్డ్‌ జియోగ్రఫిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ సదస్సులోనూ ప్రసంగించారు.

మరిన్ని వార్తలు