తెలిసి... తెలిసీ

18 Jul, 2015 22:42 IST|Sakshi
తెలిసి... తెలిసీ

సోల్
 
అనగనగా ఒక చీమ. పరమ శివుడి కోసం తపస్సు చేసింది.శివుడు మెచ్చాడు. వరం కోరుకోమన్నాడు. మనుషుల మీద కసితో ‘నేను కుట్టగానే చావు తథ్యం కావాలి’ అంది చీమ. తథాస్తు అన్నాడు శివుడు. పాపం నాటి నుంచి ఆ చీమ కుట్టీ కుట్టగానే మరణిస్తోంది. (కుట్టగానే చంపేస్తాం కదా). ఇదే స్వయంకృతం! ‘నేను ఎవరిని కుడితే వారు చావాలి’ అని వరం అడగవలసిన చీమ, కుట్టిన వెంటనే చావాలి అంది. ఇక మిడాస్ కథ తెలిసిందే. అత్యాశ పరుడైన మిడాస్ తాను ఏది ముట్టుకుంటే అది బంగారం కావాలని భగవంతుడిని కోరాడు. ఆయన తథాస్తు అన్నాడు. అంతే... నాటి నుంచి మిడాస్ పట్టిందల్లా బంగారమే.  మంచినీళ్లు, అన్నం సహా అన్నీ బంగారమై పోయాయి. ఆకలి దప్పులు తీరక నానా ఇక్కట్లు పడ్డాడు. అది మిడాస్ స్వయంకృతం. ఆది నుంచి ఈ స్వయంకృతాపరాధాలు ఏదో ఒకరూపంలో మానవజన్మను పీడిస్తూనే ఉన్నాయి. ఈ పీడనపై చిన్న ఫోకస్.
 
స్వయంకృతాలే మహాపరాధాలుగా నిలిచిన సంఘటనలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్... ప్రతిభతో ఎంత ప్రఖ్యాతి గడించాడో... స్వయం తప్పిదాలతో అంతే బ్లేమ్ అయ్యాడు. మాదకద్రవ్యాలకు బానిసై, కుస్తీ బరిలో ప్రత్యర్థి చెవి కొరికి, గర్ల్‌ఫ్రెండ్‌ని హింసించి... తనకున్న మంచిపేరును మట్టికరిపించాడు. కటకటాల పాలయ్యాడు.  
 
వరల్డ్ ట్రేడ్ టవర్స్

 ఆకాశాన్నంటిన కీర్తిని కూడా భూస్థాపితం చేస్తుంది ఈ స్వయంకృతాపరాధం. దీనికి సాక్ష్యం అమెరికానే. జార్జ్ బుష్ జూనియర్ రూపంలో అమెరికా చేసిన తప్పిదం.. ఇరాక్‌తో యుద్ధం. దీని ఫలితమే 9/11 దాడులు. వాసికెక్కిన వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఆనవాలు లేకుండా నేల కూలాయి. ఎందరో ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. అయితే స్వయంకృతాపరాధాలు చేయడం అమెరికాకు కొత్తేం కాదు.  గల్ఫ్ యుద్ధం కంటే ముందే వియత్నాం మీద విరుచుకుపడింది. చిన్న దేశం చేతిలో చిత్తుగా ఓడి తోక ముడిచింది. ఇది ఒక దేశం చేసిన, చేస్తున్న స్వయంకృతాపరాధానికి సాక్ష్యం.
 
గ్లామర్ వరల్డ్..

పేరున్న వాళ్ల స్వయంకృతపరాధాలను సామాన్యులకూ ట్రాన్స్‌పరెంట్‌గా చూపించేది గ్లామర్ వరల్డే. అందులో సినిమా ఫస్ట్. బ్లాక్ అండ్ వైట్ జమానా తీసుకుంటే మహానటి సావిత్రి, గురుదత్ మొదలు  సిల్క్‌స్మిత, ఉదయ్‌కిరణ్, చక్రిలు ఠక్కున గుర్తొస్తారు.
 అభినయ ఘనాపాటి సావిత్రి.. జెమినీ గణేశన్‌కు మూడో భార్యగా ఆయన చేయి అందుకోవడానికి సిద్ధపడ్డప్పుడు తెలుగులోని సీనియర్ నటులు వద్దని వారించారట. కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావని హెచ్చరించారట కూడా. అయినా వాటిని వినిపించుకోక జెమినీ గణేశన్‌కు భార్య అయి తర్వాత మందుకు బానిస అయింది. తాగితాగి తనువు చాలించింది. గురుదత్ విషయానికి వస్తే .. ఆయన ప్రేమకు బానిస. ఆ బలహీనతే ఆయనను మందుకు మాలిమి చేసి ఆత్మహత్యతో చేయి కలిపేలా చేసింది. అలాగే తెలుగులో నిన్నటి తరం నటి.. సిల్క్‌స్మిత అంతే! రంగుల ప్రపంచంలోని నలుపుతెలుపుల షేడ్స్‌ని సరిగ్గా గుర్తించక ఉరితాడు బిగించుకుంది. చిన్న వయసులో ఉదయ్‌కిరణ్ చేసిన పనీ అదే ఆత్మహత్య. గెలుపు, ఓటములు సహజం అన్న విషయం తెలిసీ.. సినీమాయా జగత్తులో ఎలా మసులుకోవాలో అవగతమయ్యీ... తొందరపాటు అనే స్వయంకృతంతో ఆత్మహత్య అనే అపరాధానికి చోటిచ్చాడు. ఫలితంగా భూమ్మీద తన ఉనికినే కోల్పోయాడు. సంగీత దర్శకుడు చక్రి.. తన స్థూలకాయాన్ని తగ్గించుకునే పరిష్కారం ఉండీ.. భయం, నిర్లక్ష్యం అనే స్వయంకృతంతో హార్ట్‌ఎటాక్‌కు ప్రాణాలను అప్పగించాడు.
 
 ‘రుణ’గణమన

 నాగరికత నేర్చిన మనుషులు ఒప్పులకుప్పల్లా ఉండాల్సింది పోయి, వాణిజ్యబ్యాంకుల పోటీ పుణ్యమాని అప్పులకుప్పల్లా మిగులుతున్నారు. క్రెడిట్ కార్డులతో స్తోమతకు మించి ఖర్చు చేస్తున్నారు. కన్జూమర్ లోన్స్ ఊబిలో చిక్కుకుని, అవసరం ఉన్నా, లేకున్నా ఎడాపెడా విలాస వస్తువులను కొనుక్కొని, జీతాల్లో సింహభాగం ఈఎంఐలకు చెల్లిస్తూ, నిత్య రుణగ్రస్తుల్లా మిగులుతున్నారు. ఈ దా‘రుణ’భారం వ్యక్తులనే కాదు, దేశాలకు దేశాలనే కుంగదీస్తోంది. అగ్రరాజ్యాల రుణాల ఉచ్చులో చిక్కుకున్న చిన్న దేశాలు చితికిపోతున్నాయి. స్తోమతకు మించిన రుణాలు ఎవరికైనా స్వయంకృతాపరాధాలే!
 
 అభివృద్ధి అపరాధం

 అభివృద్ధి ... మానవజాతి చేస్తున్న స్వయంకృతాపరాధం. సౌకర్యవంతమైన జీవితం గడపడానికి మనిషి చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమే. అయితే మితిమీరుతున్న ఈ అభివృద్ధి మనం కూర్చున్న చెట్టును మనమే నరుక్కోవడం లాంటిదే. మనం తెచ్చుకున్న సాంకేతిక విప్లవం, వ్యవసాయానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఈ భూమ్మీద జీవించే హక్కున్న మిగిలిన జీవుల బతుకును దుర్భరం చేస్తున్నాయి. అడవులను నరికేయడం, భూగర్భంలోంచి విచక్షణా రహితంగా నీటిని తోడేయడం  పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తోంది. కాలుష్యం పంచభూతాలను డిస్టర్బ్ చేస్తోంది. వర్షాల్లేవ్.. పంటల్లేవ్.. ధరలు ఆకాశానికి ఎగబాకుతుంటే జీవనప్రమాణం పాతాళానికి దిగజారుతోంది. స్వయంకృతాపరాధానికి వర్తమానంలో ఇంతకు మించిన సజీవ సాక్ష్యం లేదు.  
 - సరస్వతి రమ
 
భస్మాసుర హస్తం
భస్మాసురుడు కఠోర తపస్సు చేశాడు. బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. నేను ఎవరి నెత్తిన చెయ్యి పెడితే వాడు చావాలి అని కోరుకున్నాడు.తథాస్తు అన్నాడు. తన వరం పని చేస్తోందో లేదో పరీక్షించాలనుకున్నాడు. ఆ పరీక్ష కూడా వరమిచ్చిన శివుడి మీదే ప్రయోగించాలనుకున్నాడు. శివుడు పరుగులు తీశాడు. అది శివుడి స్వయంకృతం. శివుడు విధిలేక విష్ణుమూర్తిని శరణు కోరాడు. విష్ణుమూర్తి మోిహ నిగా అవతరించి, భస్మాసురుడికి నాట్యం నేర్పడం ప్రారంభించాడు. హస్త ముద్రలు, పాద విన్యాసం నేర్పుతూ తాను ఎలా చెబితే అలా నాట్యం చేయిస్తూ, శిరసు మీద హస్తం ఉంచే ముద్రను నేర్పడంతో భస్మాసురుడు భస్మమైపోయాడు. అది పూర్తిగా భస్మాసురుడి స్వయంకృతమే.

అరణ్యవాసం సమయంలో సీతాదేవి బంగారులేడి కావాలని కోరుకుంది. అది మాయ అని లక్ష్మణుడు ఎంత వారించినా సీత వినిపించుకోలేదు. రాముడు లేడి కోసం వెళ్లాడు. రావణుడు మారువేషంలో సీతను అపహరించాడు. అది సీత స్వయంకృతం.
 ఇక రావణుడు... సీతాదేవిని ఎత్తుకు రావద్దని ఎందరు వారించినా వారి సలహాలను పెడచెవినపెట్టి, సీతను ఎత్తుకు వచ్చి లంకలో అశోకవనంలో ఉంచాడు. చివరకు ఏమయ్యింది. లంక నాశనమే కదా! అందుకు సంపూర్ణంగా రావణుడి స్వయంకృతమే కారణం కాదా?
 ఇక దుర్యోధనుడు, శకుని కలిసి మాయా జూదం ఆడతారని తెలిసుండీ, రాజ ధర్మం, క్షాత్ర ధర్మం అంటూ ధర్మరాజు జూదం ఆడాడు. ఒళ్లు మరచి సర్వస్వం కోల్పోయాడు. అది ధర్మరాజు స్వయంకృతమే.

కీచకుడు ద్రౌపదిని చెరపట్టాలనుకున్నాడు. ఆమె ఎంత వారించినా కీచకుడు తన పట్టు విడువలేదు. వినాశకాలే విపరీత బుద్ధీ అన్న చందాన కీచకుడి చెవులకు హితవాక్యాలు నచ్చలేదు. చివరకు భీముడి చేతిలో హతుడయ్యాడు. ఇది కీచకుని స్వయంకృతం తప్ప మరొకటి కాదు.
 - డా. పురాణపండ వైజయంతి
 
 

మరిన్ని వార్తలు