నవ్వుల నోటు

24 Oct, 2016 22:51 IST|Sakshi
నవ్వుల నోటు

అందమైన లోకం!


ఈ అమ్మాయి మేఘ. మేఘా చక్రవర్తి. బెంగాలీ నటి. ఉండడం కోల్‌కతాలో. రెండేళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చింది. ఇండస్ట్రీలోకైతే వచ్చింది కానీ లైఫ్‌లోకే ఇంకా పూర్తిగా వచ్చినట్టు లేదు! అంటే వయసు పాతికేనని, ఇంకా పెళ్లి చేసుకోలేదనీ కాదు. లోకం పోకడ అనుభవం కాలేదని!! ఎవరైనా మనల్ని మోసం చేశారనుకోండి, ఎలా ఫీల్ అవుతాం? మోసం చేసినవాళ్ల మీద కోపం వస్తంది. మోసపోయినందుకు మన మీదా మనకు కోపం వస్తుంది. కానీ మేఘ నవ్వుకుంటోంది. తనకు జరిగిన మోసాన్ని గుర్తు చేసుకుని గుర్తు చేసుకుని మరీ చిన్న పిల్లలా నవ్వుకుంటోంది. అసలేం జరిగిందంటే.. మేఘ త్రీడేస్ బ్యాక్ పనిమీద ముంబై వచ్చింది. లేట్ నైట్  క్యాబ్ దొరక్కపోతే ఆటో ఎక్కింది. టైమ్ ఒంటి గంటైంది. ఒక్కటే ఆటోలో ఉంది. ఆమెకేం భయం వెయ్యలేదు. ఆటోవాలా సంస్కారవంతుడిలా ఉన్నాడు. అంత రాత్రప్పుడు అందమైన ముంబై లోకపు రంగుల్ని చూసుకుంటూ వెళ్తోంది మేఘ. చివరికి ఆమె దిగవలసిన చోటు వచ్చింది. దిగి, ఆటోకు డబ్బులు ఇచ్చేసింది. ఆటోవాలా ఆమెకు ఛేంజ్ ఇచ్చేశాడు.

వంద నోటు, ఇంకా రెండు మూడు పదులు. తెల్లారే ఏదో అవసరమై ఆ వంద నోటు తీసింది మేఘ. అది దొంగ నోటు! చూడ్డానికి అచ్చం వందనోటులానే ఉంది కానీ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సి చోట ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ఉంది. నవ్వుకుంది మేఘ. వన్ హండ్రెడ్ రుపీస్ అని ఉండాల్సిన చోట ‘వన్ హండ్రెడ్ కూపన్’ అని ఉంది. మళ్లీ నవ్వుకుంది మేఘ. ఇంకా.. ఐ ప్రామిస్‌టు పే.. అనే చోట ‘ఐ ప్రామిస్ టు ప్లే విత్ ద కూపన్ హండ్రెడ్’ అని, గవర్నర్ సంతకం ఉండే చోట ‘శాంతాక్లాజ్’ అని ఉంది. అన్నిటికీ నవ్వుకుంది మేఘ. ఇప్పటికీ దాన్ని దొంగనోటు అనడం లేదు. ఫేక్ నోట్ అని కూడా అనడం లేదు. మెమరబుల్ నోట్ అంటోంది. చిన్నప్పుడు లాలీపాప్‌లతో ఇలాంటివే గిఫ్ట్ ప్యాక్‌గా ఇచ్చేవారు అని గుర్తు చేసుకుంటోంది.     

 

మరిన్ని వార్తలు