‘ఆస్కార్‌’ ఎంత పని చేసింది!

9 Jun, 2019 02:28 IST|Sakshi

రీల్‌ టు రియల్‌

జీవితమే ఒక సినిమా అంటుంటారు. ఒక్కోసారి జీవితం కూడా సినిమాలా సాగుతుంటుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్నేహ, సుమన్‌ అనే యువతుల జీవితాలు ఒక్క సినిమాతో మారిపోయాయి. మూడు నెలల క్రితం సెలబ్రిటీ స్టేటస్‌ అనుభవించిన ఈ ఇద్దరిని ఇప్పుడు పట్టించుకునేవారే కరువయ్యారు. సినీమాయాజాలం ఇదే కామోసు! ఫ్లై (ఊ y) అనే స్వచ్ఛంద సంస్థ 2017లో కాథిఖేరా గ్రామంలో శానిటరీ ప్యాడ్‌ తయారీ యూనిట్‌ పెట్టింది. వీటి గురించి ఏమాత్రం అవగాహన లేని గ్రామస్తులు శానిటరీ ప్యాడ్స్‌ తయారీని వింతగా చూశారు. 28 ఏళ్ల సుమన్, 22 ఏళ్ల స్నేహ ధైర్యంగా ముందడుగు వేశారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్యాడ్స్‌ తయారీకి వెళ్లేవారు. ఈ ధైర్యమే వారికి సినిమా అవకాశం తెచ్చిపెట్టింది.

శానిటరీ ప్యాడ్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు, తదనంతర పరిణామాలపై 26 నిమిషాల నిడివితో డాక్యుమెంటరీని ఇరానియన్‌–అమెరికన్‌ దర్శకురాలు రేఖ జెహతా బచ్చి తెరకెక్కించారు. ఇందులో సుమన్, స్నేహ నటించారు. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్‌ అవార్డు దక్కడంతో వీరిద్దరూ అమెరికా వెళ్లి అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని ఈ ఏడాది మార్చిలో సొంతూరికి తిరిగొచ్చిన స్నేహ, సుమన్‌లకు ఘన స్వాగతం లభించింది. వారిని స్వాగతించేందుకు ఊరు మొత్తం కదిలొచ్చింది. మరుసటి రోజుకు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడిపారు. తమ ఊరి పేరును ప్రపంచమంతా మార్మోగిపోయేలా చేశారంటూ వీరిని ఘజియాబాద్‌ జిల్లా హాపూర్‌ తాలుకాలోని కాథిఖేరా గ్రామస్తులు పొగడ్తలతో ముంచెత్తారు. కాథిఖేరా గ్రామం పేరు కూడా ప్రసార సాధనాల్లో ప్రముఖంగా కనబడింది.

ఆ తర్వాత వీరిద్దరి జీవితం తలకిందులైంది. ఆర్థిక సమస్యలు చట్టుముట్టడం, ఉన్న ఉపాధి కోల్పోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ‘మేము మంచి సినిమాలో నటించాం. కానీ ఈరోజు మేము ఎక్కడ ఉన్నామో చూసుకుంటే బాధ కలుగుతుంది. ఆస్కార్‌తో తలరాత మారుతుందని అనుకున్నాం కానీ అప్పుల్లో కూరుకుపోతామని ఊహించలేదు. ఎవరో ఒకరు మమ్మల్ని ఆదుకోవాల’ని సుమన్‌ దీనంగా వేడుకుంటోంది.ఏదో ఒకరోజు ఢిల్లీ పోలీసు దళంలో చేరాలని చేరాలని కలలు కన్న స్నేహ డబ్బుల్లేక కోచింగ్‌ క్లాసులు మానుకుంది. ‘నెలకు రూ. 2500 ఇచ్చే ఫ్లై సంస్థ నాకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు.

ఇక నుంచి పనులకు రావొద్దని సంస్థ ప్రతినిధి చెప్పారు. నాకు రావాల్సిన జీతం డబ్బుల గురించి అడిగితే ముందే లక్ష రూపాయలు ఇచ్చామని, ఇక ఇవ్వాల్సిన అవసరం లేదన్నార’ని వాపోయింది. ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్నందుకు సుమన్, స్నేహలకు ఉత్తరప్రదేశ్‌ అప్పటి ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌.. చెరో లక్ష రూపాయలు రివార్డుగా ఇచ్చారు. గవర్నర్‌ రామ్‌నాయక్‌ 50 వేల చొప్పున బహూకరించారు. అయితే ఈ సొమ్ము తమకే చెందుతుందని వాదిస్తూ ఫ్లై సంస్థ తమను ఇబ్బంది పెడుతోందని సుమన్‌ తెలిపారు.సుమన్, స్నేహ ఆరోపణల్లో వాస్తవం లేదని, చేతులారా వారి జీవితాన్ని వారే దిగజార్చుకున్నారని ఫ్లై సంస్థ వాదిస్తోంది.

అమెరికా నుంచి వచ్చిన తర్వాత వీరిద్దరూ పనిని నిర్లక్ష్యం చేశారు. రెండు నెలలుపైగా పనిలోకి రాలేదు. ఆరుగురు మనుషులతో నడిచే చిన్న యూనిట్‌లో ఇద్దరు పని మానేస్తే ఎంత కష్టమవుతుంది. పనిలోకి చాలాసార్లు చెప్పినా వారు వినిపించుకోలేదని సదరు సంస్థ వివరించింది. మరోవైపు రుతుక్రమంపై అవగాహన పెరగడం, శానిటరీ ప్యాడ్‌ లభ్యత స్థానికంగా పెరగడంతో వీరు తయారు చేసే వాటిని డిమాండ్‌ కూడా తగ్గింది. సుమన్, స్నేహల పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.  వీరిద్దరూ ఎలా గట్టెక్కుతారో చూడాలి!
పోడూరి నాగ శ్రీనివాసరావు
సాక్షి వెబ్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు