Coconut Oil : కేరళ అమ్మాయిల స్కిన్‌ సీక్రెట్‌ ఇదే, అందుకే అంత కళగా ఉంటారు మరి!

2 Dec, 2023 10:58 IST|Sakshi

సహజ సిద్ధమైన  మాయిశ్చరైజర్‌

కొబ్బరినూనె మంచి సౌందర్య సాధనంగా పనిచేస్తుంది. సెలబ్రెటీలు చాలామంది తమ చర్మాన్ని అందంగా... ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొబ్బరినూనెను విరివిగా వాడుతుంటారు. కొబ్బరినూనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు పొడి చర్మానికి ఔషధంలా పనిచేస్తాయి. కొబ్బరినూనె చర్మానికి సహజసిద్ధమెన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

టీ స్పూను కొబ్బరినూనెలో అర టీస్పూను పెరుగు, టీస్పూను ఓట్స్‌ పొడి వేసి మెత్తని పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరాక గుండ్రంగా మర్దన చేస్తూ గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్‌ వేసుకోవడం వల్ల ముఖచర్మానికి తేమ అంది ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

రెండు టీస్పూన్ల కొబ్బరినూనెలో  కొద్దిగా నిమ్మరసం, టీ స్పూను వంటసోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముక్కు, గడ్డం, నుదురు వంటి బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పట్టించి పది నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడమేగాక, చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. ఫలితంగా చర్మరంధ్రాల్లో పేరుకున్న అధిక జిడ్డు, దుమ్మూ ధూళీ పోయి చర్మం చక్కని నిగారింపుని సంతరించుకుంటుంది.

  ముఖం మీద నల్లమచ్చలు, కంటిచుట్టూ ఏర్పడిన నల్లని వలయాలపై కొబ్బరినూనెతో క్రమం తప్పకుండా మర్దన చేస్తుంటే .. మచ్చలు తగ్గుముఖం పడతాయి. 

మరిన్ని వార్తలు