త్రీమంకీస్ - 68

25 Dec, 2014 22:52 IST|Sakshi
త్రీమంకీస్ - 68

 డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 68
- మల్లాది వెంకటకృష్ణమూర్తి

 
 కదిలితే వాళ్ళు తమని కాల్చచ్చనే భయంతో గదిలోని ప్రతి ఒక్కరూ నిశ్చలంగా నిలబడ్డారు. ఎవరూ మాట్లాడకపోయినా వారి నాయకుడు గట్టిగా అరిచాడు.
 ‘‘షటప్! మాట్లాడితే కాల్చేస్తాను.’’
 వెంటనే బేంక్ మేనేజర్ ముక్కు మీద వేలు వేసుకున్నాడు.
 ‘‘బయట పోలీసులు ఉన్నారు. మేం బేంక్ దోపిడీకి వచ్చినట్లు ఎలా తెలిసింది?’’
 ఎవరూ మాట్లాడక పోవడంతో టీ అమ్మే కుర్రాడు చెప్పాడు - ‘‘ఆలస్యం చేస్తే మా టీ షాప్ ఓనర్ నన్ను ఉద్యోగం లోంచి తీసేస్తాడు. నన్ను వెళ్ళనీండి.’’
 ‘‘అర్థమైంది. మీ ఓనరే పోలీసులకి కబురు చేసి ఉంటాడు. పోలీసులతో ఎవరైనా మాట్లాడాలి.’’
 నాయకుడు అందర్నీ పరీక్షించి చూశాడు. అతని దృష్టి వానర్ మీద నిలిచింది.
 ‘‘ఏమిటి మొహం నిండా ఆ దుమ్ము?’’ అడిగాడు.
 ‘‘భయంతో నాకు చెమటలు పడుతూంటే ఈమె హేండ్ బేగ్‌లోని పౌడర్ తీసి రాసుకున్నాను’’ వానర్ నిర్భయంగా చెప్పాడు.
 మానసిక ఒత్తిడిలో ఉన్న ఆ నాయకుడు దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించలేదు.
 ‘‘నీ పేరేమిటి?’’ అడిగాడు.
 ‘‘వార్.’’
 ‘‘అదేం పేరు?’’
 ‘‘మేము ఆంగ్లో ఇండియన్స్..’’
 ‘‘సరే. నాతో రా.’’
 వానర్ తలుపువైపు నడుస్తూ మిగిలిన వారి వంక చూశాడు. అసిస్టెంట్ మేనేజర్ పొడవు అకస్మాత్తుగా నాలుగు అడుగులు తగ్గడం గమనించాడు. అతను అందరి వెనకా దాక్కునే ప్రయత్నంలో ఉన్నాడు. చిన్నగా లేడీ క్లర్క్‌కి కన్ను కొట్టాడు. ఓ దొంగ స్ట్రాంగ్ రూమ్ తలుపుని బయటి నించి మూసి గడియపెట్టాడు. ముందు వానర్, వెనక అతన్ని అనుసరించే ముగ్గురూ బేంక్ హాల్లోకి నడిచారు. అక్కడ మొహాలకి తొడుగులు ఉన్న ఇంకో ముగ్గురు సబ్‌మెషీన్ గన్స్‌తో కనిపించారు. నేల మీదంతా కాగితాలు చెల్లాచెదురుగా, చెత్త బుట్టలు, ఫ్లవర్ వేజ్‌లు తలకిందులుగా పడి ఉన్నాయి. గోడ మీద తుపాకీ గుళ్ళు దిగిన రంధ్రాలు ఐదారు కనిపించాయి. వాటి పెచ్చులు కింద రాలిపడ్డాయి. అదృష్టవశాత్తు నేల మీద ఎక్కడా శవాలు కనపడలేదు.
 గోడ గడియారం ఐదుంపావు చూపిస్తోంది. వానర్ లెక్క ప్రకారం ఆ సరికి బేంక్ మూసేసి ఇళ్ళకి వెళ్ళిపోవాలి. కాని బేంక్ దొంగలు బేంక్‌ని దోచుకోడానికి తమ ముహూర్తాన్నే ఎన్నుకుని వాళ్ళని ఆపేయడంతో తమ పథకం దెబ్బతినడం వానర్‌ని బాధించింది. అతని వీపుకి వెనక నించి తుపాకీ గొట్టం బలంగా గుచ్చుకుంది.
 ‘అవర్ స్పెషల్ గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్’ అనే పోస్టర్‌కి ఆనుకుని నిలబడ్డ ఓ వ్యక్తి చెప్పాడు.
 ‘‘నువ్వు ఇప్పుడు బయటకి వెళ్ళాలి. పోలీసులు నిన్ను దొంగగా భావించి కాలుస్తారో లేదో చూడాలి.’’
 ‘‘కాని నేను దొంగని కానుగా’’ వానర్ భయంగా చెప్పాడు.
 ‘‘ఆ విచక్షణ నీకుంది. వాళ్ళకి ఉందా, లేదా అని తెలుసుకోడానికే. నిన్ను కాల్చకపోతే మా తరఫున మా డిమాండ్స్‌ని నువ్వు వినిపించాలి.’’
 ‘‘అప్పుడు నేను మీలో ఒకణ్ణని భావించి కాల్చచ్చుగా?’’ వానర్ రెట్టింపు భయంతో అడిగాడు.
 ‘‘నీ పేరేమిటి?’’
 ‘‘వార్. ఆంగ్లోఇండియన్‌ని.’’
 ‘‘మేం లోపల. పోలీసులు బయట. ఇలా ఎంతకాలం ఉండగలం? కాబట్టి మేము పారిపోయే ఏర్పాట్లు చేయడం మొదలెట్టాలి. బయటకి నడు.’’
 కాళ్ళు ఒణికి పడిపోబోతున్న వానర్‌ని వెనక నించి ఓ దొంగ పడిపోకుండా పట్టుకున్నాడు.
 ‘‘మూర్ఛని ఆపుకో. లేదా నిన్ను కాల్చేస్తాం. నువ్వు స్పృహలో ఉండాల్సిన సమయం ఇది. నిజానికి నువ్వు చేయాల్సింది చాలా తేలిక. ఊ.’’ నాయకుడు తన అనుచరుడికి సౌంజ్ఞ చేశాడు.
 వెనక నించి అతను వానర్ ముఖానికి నల్లటి సాక్స్‌ని తొడిగాడు.
 ‘‘ఇప్పుడు బయటకి నడు’’ నాయకుడు చెప్పాడు.
 ‘‘కాని ఇలా చూస్తే వాళ్ళు నన్ను మీలో ఒకరు అనుకుంటారు కదా?’’ వానర్ సందేహంగా చెప్పాడు.
 ‘‘అదే మాక్కావాల్సింది. పోలీసులు నిన్ను షూట్ చేయకపోవడం కూడా మాక్కావాలి. వారు ఎలా స్పందిస్తారో తెలుసుకోడానికే నీకు ముఖానికి అలంకారం తొడిగింది.’’
 ‘‘కాని గుళ్ళు దిగితే నొప్పి పుడుతుంది. కనీసం క్షమాపణ కోరి పంపచ్చుగా?’’
 ‘‘ఇంకేం మాట్లాడక బయటకి నడు’’ నాయకుడు కోపంగా అరిచాడు.
 వానర్ కదల్లేదు.
 ‘‘ముందు నీ పాదాల మీద కాల్చనా? తర్వాత పాక్కుంటూ వెళ్తావా?’’ నాయకుడు తన సబ్‌మెషీన్ గన్‌ని వానర్ కాళ్ళకి గురి పెట్టాడు.
 ‘‘ఆగాగు. కాల్చకు. ఒన్, టు, త్రీ చెప్పి కాల్చు. ఇదిగో వెళ్తున్నాను. నాకు ఇష్టం లేకపోయినా వెళ్తున్నాను. నాకేమైనా అయితే బాధ్యత మీది.’’
 వానర్ తలుపు వైపు నడిచాడు.
 ‘‘పేవ్‌మెంట్ దాకానే. అది దిగి రోడ్డెక్కావంటే నీ వీపులో గుళ్ళు దిగుతాయి. నడిచినా, పరిగెత్తినా సరే. అక్కడే కదలకుండా నిలబడు’’ ఓ దొంగ హెచ్చరించాడు.
 
 

మరిన్ని వార్తలు