అన్నం పంచే అబ్బాయి

1 Apr, 2020 09:52 IST|Sakshi

ఆదర్శం

కరోనా కారణంగా ప్రస్తుతం జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ నడుస్తోంది. అనాథలు, బిచ్చగాళ్లు, వీధి బాలలకు, రోడ్డు మీద నివసించేవారికి ఇది ఒక గడ్డుకాలంగా ఉంది. ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు. ఇదే సమయంలో స్వచ్ఛంగా సేవ చేసేవారు కూడా ముందుకు వచ్చి, చేతనైనంత సహాయం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన మల్లేశ్వరరావు అనే వ్యక్తి చాలాకాలంగా హోటల్స్‌లోను, పెద్ద పెద్ద ఇళ్లలోనూ మిగిలిన ఆహారాన్ని సేకరించి, ఫుట్‌పాత్‌ల మీద నివసిస్తున్న అనాధలకు ఆ ఆహారాన్ని సుమారు నాలుగు సంవత్సరాలుగా అందిస్తున్నారు. తన స్నేహితులతో కలిసి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఇందుకుగాను అనేక అవార్డులు కూడా అందుకున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో అడుగు ముందుకు వేసి, ఫేస్‌బుక్‌ మిత్రుల ద్వారా ఆహార పొట్లాలు, సబ్బులు వంటవి సేకరించి, కష్టాలలో ఉన్నవారికి అందచేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా సోకుతుందనే భయం కూడా లేకుండా సేవలు అందిస్తున్న మల్లేశ్వరరావుని సాక్షి పలకరించింది. అతను తన అనుభవాలను సాక్షితో పంచుకున్నారు...

‘నేను నా జీవితంలో ఎన్నో కష్టాలు
ఎదుర్కొన్నాను. ఒక అనాథ ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులూ పడ్డాను. ఎన్నో రోజులు ఆకలితో అలమటించాను. నాలాగ ఎవ్వరూ బాధపడకూడదు అనుకున్నాను. నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా, వీలైనంత వరకు ఇతరులకు సహాయపడాలనుకున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది అని భావించాను. నా మిత్రుల సహకారంతో ఫేస్‌బుక్‌లో నా పేరున పేజీ ఓపెన్‌ చేసి, నా ఆలోచనను అందరితో పంచుకున్నాను. ఈ విపత్కాలంలో అందరూ సహకరిస్తున్నారు.  ఐదు వందల ఆహార పొట్లాలు తయారుచేసి నాకు ఇస్తున్నారు. నేను నా మిత్రుడు అంకూర్‌ శ్రీవాత్సవ్‌ కలిసి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట లోపు ఈ ఆహారం పొట్లాలు అందచేస్తున్నాం. వీథులలో ఉండేవారినందరినీ ఒక షెల్టర్‌లో ఉంచారు. మాకు చేతనైనంత వరకు ఎవ్వరూ ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. హైదరాబాద్‌ ఎర్రగడ్డ ప్రాంతం నుంచి హైటెక్‌ సిటీ వరకు మేం మా సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. అందరికీ స్నానానికి అవసరమైన సబ్బులు కూడా అందచేస్తున్నాం.

ఇంతటి విపత్కర సమయంలో మేం ప్రాణాలకు తెగించి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటానికి ప్రయత్నిస్తుంటే, కొందరు ఆకతాయిలు మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కొందరు సంపన్నులు కార్లలో దిగి, మా దగ్గరకు వచ్చి, వారంతా తిండి లేక బాధపడుతున్నామని, వారికి కూడా ఆహారం పొట్లాలు ఇవ్వమని దౌర్జన్యంగా తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. వారందరికీ మేం చేతులెత్తి ప్రార్థిస్తున్నాం, ఇటువంటి పరిస్థితుల్లో అల్లరిచిల్లరి పనులు చేయొద్దని మొక్కుతున్నాం. ఈ సమయంలో నిర్విరామంగా పనిచేస్తున్న పోలీసులకు కూడా మేం ఆహారం అందిస్తుంటే వారు, ‘మేం ప్రజల కోసం పనిచేస్తున్నాం. మీరు మా కోసం పనిచేస్తున్నారు’ అంటూ మమ్మల్ని ప్రశంసిస్తున్నారు.

రెండు నెలల క్రితం triporey అనే ఒక ట్రావెల్‌ స్టార్టప్‌ కంపెనీ ప్రారంభించాను. కరోనా వల్ల వచ్చిన బుకింగ్స్‌ అన్నీ క్యాన్సిల్‌ అయిపోయాయి. మా కంపెనీ ప్రారంభదశలోనే ఆగిపోయింది. నేను గతంలో జోష్‌ టాక్‌లో ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో ప్రస్తుతం నా జీవనం సాగిస్తున్నాను. త్వరలోనే అందరికీ మంచి రోజులు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.– మల్లేశ్వరరావు,సోషల్‌ వర్కర్, హైదరాబాద్‌

ఇక మేం వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నాం. ఇంటికి వెళ్లేసరికి, ఓ మిత్రుడు మా కోసం నీళ్లు, దుస్తులు సిద్ధం చేసి ఉంచుతున్నాడు. శుభ్రంగా స్నానం చేసిన తరవాత ఇంట్లోకి అడుగు పెడుతున్నాం. దయచేసి మాకు ఈ విషయంలో అందరూ సహకరించండి’ అంటూ ఎంతో బాధ్యతగా అర్థిస్తున్నాడు 28 సంవత్సరాల మల్లేశ్వరరావు.– సంభాషణ: వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా