కందకాలతో తోట పచ్చన

22 May, 2018 05:05 IST|Sakshi

కందకాలు తవ్విన తర్వాత వర్షపు నీటితో 2 సార్లు నిండిన కందకాలు

పుష్కలంగా నీరు పోస్తున్న తోటలోని 5 బోర్లు

పుస్కూరు రఘుకుమార్, పీతా రవివర్మ అనే ఇద్దరు మిత్రులు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం వెంకిర్యాల, ఆగిర్యాల గ్రామాల పరిధిలో 50 ఎకరాలలో మామిడి తోటను పదేళ్లుగా సాగు చేస్తున్నారు. వర్షాలు అంతంతమాత్రంగా కురవడం, కురిసిన వర్షం కూడా భూగర్భంలోకి ఇంకే మార్గం లేకపోవడం వల్ల భూగర్భ జలమట్టం మరీ తగ్గిపోయింది. దీంతో తోటలో 5 బోర్లు ఉన్నప్పటికీ ఏ బోరూ సరిగ్గా నీరు పోయకపోవడం సమస్యగా మారింది. పదేళ్ల తోటను కాపాడుకోవడానికి వాన నీటిని సమర్థవంతంగా సంరక్షించుకోవడమే ఉత్తమ పరిష్కార మార్గమని భావించిన రఘు, రవి.. గత ఏడాది తొలుత ఫాం పాండ్‌ తవ్వించుకున్నారు.
ఆ క్రమంలోనే పొలంలో కందకాలు తవ్వడం మంచిదని తెలుసుకొని.. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలను సంప్రదించారు. వీరి కోరిక మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోలి దామోదర్‌రెడ్డి గత ఏడాది మే నెలలో స్వయంగా వచ్చి తోటలో భూమి స్థితిగతులను పరిశీలించి, వాలుకు అడ్డంగా మీటరు లోతున, మీటరు వెడల్పున, 20 మీటర్ల పొడవున కందకాలు తవ్వించారు.

అదే వరుసలో 5 మీటర్లు ఖాళీ వదిలి మరో 20 మీటర్ల చొప్పున కందకాలు తవ్వించామని రవివర్మ తెలిపారు.  కందకాలు తవ్విన తర్వాత కురిసిన వర్షాలకు రెండు సార్లు కందకాలు నీటితో నిండాయి. వర్షపు నీరంతా బయటకు కొట్టుకుపోకుండా పూర్తిగా భూమి లోపలికి ఇంకింది. ఈ కందకాల పుణ్యానే తమ మామిడి తోట పెరుగుదల, కాపు ఈ ఏడాది బాగుందని.. ఇంత మండు వేసవిలో కూడా పచ్చగా ఉందని రవివర్మ సంతృప్తిగా చెప్పారు. ఆ ప్రాంతంలో ఇతర తోటల్లో బోర్లు ఈ ఏడాది ఆగి ఆగి పోస్తుంటే.. తమ తోటలో బోర్లు మాత్రమే పుష్కలంగా పోస్తున్నాయన్నారు. రెండు బోర్లలో రెండున్నర ఇంచుల నీరు, మూడు బోర్లలో ఒకటిన్నర ఇంచుల బోర్లు కంటిన్యూగా పోస్తుండటానికి కారణం నిస్సంకోచంగా కందకాలేనని రవి వర్మ అన్నారు. రైతులు కందకాలు తవ్వుకుని పంటలను కాపాడుకోవచ్చని రఘు, రవివర్మ (80089 66677) ల అనుభవాలు చాటిచెబుతున్నాయి.

      పుస్కూరు రఘుకుమార్

మరిన్ని వార్తలు