తల్లికి రోజూ పూజ చెయ్యడమా?

5 Nov, 2016 23:12 IST|Sakshi
తల్లికి రోజూ పూజ చెయ్యడమా?

మాతృభక్తి అంటే...

చిన్నప్పుడు పెద్దలు పిల్లల ఆలనాపాలనా చూస్తే, పిల్లలు పెద్దయ్యాక తల్లితండ్రుల ఆలనా పాలనా చూడాలి.  ఏ కారణంగానైనా తల్లితండ్రులు పిల్లల పెంపకంలో శ్రద్ధ వహించక పోయినా వారిని చక్కగా చూసుకోవడం పిల్లల కర్తవ్యం.

మాతృదేవోభవ’ అన్న గురువు ఆదేశం అందరికీ ఆచరణీయం. దాని అర్థం - ‘తల్లే దైవంగా కలవాడవు కమ్ము’ అని. తల్లి మొదటి గురువు, దైవం కూడా! భక్తి ప్రపత్తులతో తల్లిని సేవించాలి. తల్లి మాటను తల దాల్చాలి. ఇది వేదవాక్కు. ఆదర్శ పురుషులుగా పేరొందిన వారందరూ తల్లి మాటను శిరసావహించినట్టు చరిత్ర చెబుతోంది. ఎందుకంటే తల్లిగా ఏ స్త్రీ కూడా బిడ్డకి హాని చేయాలని అనుకోదు. వ్యక్తిగా, కూతురిగా, సోదరిగా, భార్యగా, కోడలిగా చెడ్డదై ఉండవచ్చు కానీ, తల్లిగా మాత్రం చెడ్డతనం ఏ కోశానా ఉండదు.

ఎంతైనా తల్లి కూడా మానవమాత్రురాలు. ఆవిడ తెలివి, జ్ఞానం, పరిస్థితులు, మానసిక స్థితి మొదలైన అంశాల మీద ఆమె మాటలు ఆధారపడి  ఉంటాయి. ఈ పరిమితులను అర్థం చేసుకుంటే తప్ప అవి ఆచరణ యోగ్యాలా కాదా అనేది తెలియదు. ఇవేవీ పట్టించుకోకుండా అమ్మ అన్నది కదా అని పాటించి, జీవితాలను వ్యర్థం చేసుకున్న సామాన్యులు ఎందరో కనపడతారు. విచక్షణ లేకపోవడమే దీనికి కారణం.

ప్రహ్లాదుడు తండ్రి మాటని పాటించాడా? అలాగని ఎదిరించలేదు, చులకన చెయ్యలేదు. తండ్రిది సరైన దారి కాదు కనుక, తండ్రి మీద ఉన్న భక్తితో అతడిని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. తల్లి కూడా పొరబాటున క్షణికావేశంలోనో, తెలివి లేకో, మతిమాలో ఏదైనా చెబితే - మాతృభక్తి ఉన్నవారు తల్లికి సర్దిచెప్పవలసి ఉంటుంది. అంతేకానీ ఆమెకు తెలియక విషం పెడుతుంటే తెలిసిన కొడుకో, కూతురో మాతృభక్తి పేరుతో తినరు కదా!

మాతృభక్తి అంటే తల్లికి రోజూ పూజ చెయ్యడం కానట్టే, మూర్ఖంగా చెప్పినవన్నీ చెయ్యడం కూడా కాదు. ఆమె ధర్మమార్గంలో చరించేలా, ఉద్ధరించబడేలా, ఉత్తమగతులకు వెళ్ళేలా చేయడం నిజమైన మాతృభక్తి. దీనికి శ్రీరామచంద్రుడు పెద్ద ఉదాహరణ. తల్లి కౌసల్యాదేవి రాముణ్ణి అడవికి వెళ్ళవద్దని ఎంతగానో బతిమాలింది. ‘తండ్రి మాట విన్నట్టే, నా మాట కూడా వినాల్సి ఉంది’ అన్నది. నిజానికి రాముడు తండ్రి మాట కూడా వినలేదు. దశరథుడు కూడా రాముణ్ణి అరణ్యానికి వెళ్ళవద్దనే అన్నాడు. తనను చెరసాలలో ఉంచి కానీ, చంపి కానీ సింహాసనాన్ని అధిరోహించమనే అడిగాడు. కానీ, తండ్రి చెప్పిన ఆ మాటలు రాముడు విన్నాడా? లేదే! పినతల్లి అయిన కైకకు తండ్రి గారిచ్చిన మాటను అమలు జరిపి, తండ్రిని సత్యవాక్య పాలకుణ్ణి చేశాడు. అదేవిధంగా తల్లిని కూడా ధర్మపాలన చేయడానికి ప్రోత్సహించాడే కానీ, కౌసల్య దుఃఖవివశురాలై అన్న మాటల్ని అమలు చేయలేదు. పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా, వృద్ధాప్యంలో భర్తను వదలి ఉండడం ధర్మం కాదనీ, భర్తకు అవసరం ఉన్నప్పుడు అతడికి సేవ చెయ్యడం ముఖ్యధర్మమనీ కౌసల్యకు పాతివ్రత్య ధర్మాలను గుర్తుచేశాడు. ఆమెకి తెలియవని కాదు. దుఃఖం మాటున మరుగుపడ్డాయి. మాతృభక్తి అంటే అది. అంతేకానీ, తల్లి కదా అని చెప్పిన ప్రతి వెర్రి మొర్రిమాటనూ అమలు చెయ్యాలనుకోవటం మూర్ఖత్వం. 

ఇక, మూర్తీభవించిన ధర్మమైన అన్నగారి అడుగుజాడల్లో నడిచిన భరతుడు తల్లి కోరికను అనుసరించి సింహాసనాన్ని అధిరోహించలేదే! అయాచితంగా మహాసామ్రాజ్యం లభించింది కదా అని అంగీకరిస్తే, ఉభయతారకంగా ఉండేది. రాజ్యానికి రాజ్యం. మాతృవాక్య పరిపాలకుడన్న ఖ్యాతి. దోషం - ధర్మవిరుద్ధమైన కోరిక కోరిన తల్లిది. తనకు మాత్రం లాభం, సుఖం. అలా తల్లికి పాపం (అధర్మ దోషం) వస్తుంటే పట్టించుకోకుండా చూస్తూ ఊరుకుంటే అది తల్లి మీద ప్రేమ ఉన్నట్టా? తల్లికి పాపం రాకూడదనీ, ఆమెకు దుర్గతి రాకూడదనీ కైక కోరికను నిరాకరించి ఆమెకు ఎంతో మేలు చేశాడు భరతుడు. ఇది మాతృభక్తి.

పిల్లలకు భక్తి ఉన్నట్టే పెద్దలకు వాత్సల్యం కూడా ఉండాలి. ‘చిన్నతనంలో వాళ్ళకు సేవ చేశాం కాబట్టి, ఇప్పుడు మాకు చెయ్యవలసిందే’ అనడం సరి కాదు. అది తల్లితండ్రుల కర్తవ్యం. పెళ్లి చేసుకోవడమే ఈ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధమయ్యామని చెప్పడం! పిల్లలను పెంచడం ఏదో పెద్ద త్యాగం చెయ్యడమనుకునే వారికి సంతానమెందుకు? వృద్ధాప్యంలో తమని చూస్తారనుకుని పిల్లల్ని పెంచితే అది లాభనష్టాలను బేరీజు వేసుకొని చేసే వ్యాపారమవుతుంది. తల్లితండ్రులకు లేని మానవతా భావన పిల్లలకు ఎలా ఉంటుంది? ఉండాల్సిన అవసరం ఏముంది?

నిజమే! చిన్నప్పుడు పెద్దలు పిల్లల ఆలనాపాలనా చూస్తే, పిల్లలు పెద్దయ్యాక తల్లితండ్రుల ఆలనా పాలనా చూడాలి. ఏ కారణంగానైనా తల్లితండ్రులు పిల్లల పెంపకంలో శ్రద్ధ వహించక పోయినా వారిని చక్కగా చూసుకోవడం పిల్లల కర్తవ్యం. అంత మాత్రాన పిల్లల్ని వారి సుఖసంతోషాలను వదులుకుని తమకు సేవ చెయ్యమనడం (తమకు శక్తి ఉన్నా కూడా) ఎంత సమంజసం? ‘బతికినంత కాలం బతకం కదా’ అంటారు. కానీ, ఈలోగా పిల్లలు (కొడుకు కోడలో, కూతురు అల్లుడో) వృద్ధులై పోతారు. జీవితాన్ని అనుభవించే వయసు దాటిపోయి ఉంటుంది. తాము యౌవనంలో అనుభవించిన సుఖాలనూ, భోగాలనూ తమ సంతానానికి దూరం చెయ్యడం భావ్యమా? ఏ కారణంగానైనా తాము సుఖాలని అనుభవించ లేదు కనుక అసూయతో పిల్లల్ని వాటికి దూరం చెయ్యడం న్యాయమా? 

తల్లితండ్రుల మీద ప్రేమ, భక్తి ఉన్న వారు గమనించవలసింది - వారు చెప్పినదాన్ని ఆచరించడం వల్ల వారికి ఉత్తమగతులు లభిస్తాయా, లేదా అన్నది. అంతేకానీ, పెద్దలు కదా అని వాళ్ళు చెప్పిన తప్పు పనులు చెయ్యడం వల్ల వాళ్ళూ తామూ కూడా ఇహపరాలను కోల్పోతారు.  అటు పెద్దలు, ఇటు యువతరం గుర్తించవలసిన అంశం ఇది.

 - డా. ఎన్. అనంతలక్ష్మి

మరిన్ని వార్తలు