గరాజీ.. భలే రుచి..

27 Oct, 2019 10:20 IST|Sakshi
నోరూరించే గరాజీలు

సాక్షి, మామిడికుదురు (పి.గన్నవరం): బియ్యం పిండి, పంచదారతో తయారు చేసే ‘గరాజీ’లు నోరూరిస్తాయి. మామిడికుదురు, నగరం గ్రామాలకు మాత్రమే పరిమితమైన ఈ వంటకం ముస్లిం వంటకంగా ప్రాచుర్యం పొందింది. పై రెండు గ్రామాల్లో 216వ నంబర్‌ జాతీయ రహదారి పక్కన గాజు సీసాల్లో వీటిని ఉంచి విక్రయిస్తుంటారు. సైజును బట్టి ఒక్కొక్క గరాజీని రూ.నాలుగు, రూ. ఐదుకు విక్రయిస్తారు. మళ్లీమళ్లీ తినాలనిపించే గరాజీలను ఇతర ప్రాంతాల వారు మిక్కిలిగా ఇష్టపడతారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తదితర సుదూర ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లకు వీటిని తీసుకు వెళుతుంటారు. 12 గంటల పాటు బియ్యం నానబెట్టిన తరువాత ఆ బియ్యాన్ని మెత్తగా దంచి పిండిని గుడ్డతో జల్లిస్తారు.

పంచదారను తీగలా సాగే విధంగా పాకం పెడతారు. రెండు కిలోల బియ్యం పిండికి అర కిలో పంచదారను పాకంగా పెడతారు. ఈ పాకంలో బియ్యం పిండి కలిపిన తరువాత ఈ రెండింటి మిశ్రమాన్ని నూనెలో దోరగా వేయిస్తారు. గుండ్రంగా వేయించిన గరాజీని బయటకు తీసి దానిని మడచి మళ్లీ వేయిస్తారు. ఈ విధంగా గరాజీలు తయారు చేస్తారు. గరాజీలను వేడివేడి పాలలో వేసుకుని తింటే సేమ్యాను మించిన రుచి ఉంటుంది. ఈ ప్రాంతంలో గరాజీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అన్ని వర్గాల వారు వీటిని అమితంగా ఇష్టపడతారు.

మరిన్ని వార్తలు