చందనపు చల్లన

8 May, 2018 00:01 IST|Sakshi

వేసవి ఊపు మీద ఉంది. సూరన్న శివాలూగుతున్నాడు. రానున్న రెండు మూడు వారాలు కీలకమైనవి. జాగ్రత్త పడాల్సినవి. సూర్యుడి వేడి ప్రకృతికి ఒక సహజ అవసరం. ఈ సహజ అవసరంలోని తీవ్ర క్షణాలను సహజ రక్షణ కవచాలతోనే మనం ఎదుర్కోవాలి. అందుకు ఏం చేయాలి. వినండి.ఇంట్లోనే ఉన్నాం కదా అని సరిగా నీళ్లు తాగకుండా ఉండకూడదు. నీళ్లు తాగకపోవడం వలన డీహైడ్రేషన్‌ బారిన పడే ప్రమాదం ఉంది. తగినన్ని నీళ్లు తాగకపోతే నిద్ర లేమి, అజీర్తి సమస్యలు కూడా తలెత్తుతాయి. కీర దోస, పుచ్చకాయ, నిమ్మరసం, కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, రాగి జావ వంటివి తీసుకుంటూ, కాఫీ, టీలను తగ్గించాలి. నిల్వ ఉన్న ఆహారం కాకుండా తాజాగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యమివ్వాలి. 

ఎండగా ఉన్నప్పుడు చల్లని పండ్ల రసాలు గొంతులోకి దిగుతుంటే, చల్లగా హాయిగా అనుభూతి కలుగుతుంది. అలాగని ఏవి పడితే అవి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. సోడా నీరు, శీతల పానీయాలు, ఐస్‌క్రీముల జోలికి పోకూడదు. పండ్లు కొనేటప్పుడు వాటి మీద క్రిమిసంహారక మందు ఎంత ఉందో పరిశీలించాలి. ఉదాహరణకు ద్రాక్ష పండ్ల వంటివి. తినడానికి ముందు వాటిని ఉప్పు నీటిలో రెండు సార్లు నానబెట్టి, శుభ్రపరచుకోవాలి. ప్రకృతి సహజసిద్ధంగా ప్రసాదించిన శీతల పానీయం కొబ్బరిబొండం. కొబ్బరి నీళ్లలో చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే డీ హైడ్రేషన్‌ సమస్య ఉండదు. ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చాక, ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుని కొబ్బరి నీళ్లతో ముఖం కడుక్కుంటే, ఎండవల్ల నల్లగా మారిన చర్మం తాజాదనాన్ని పొందుతుంది.  గ్లాసుడు నీళ్లలో టీ స్పూను నిమ్మరసం, టీ స్పూను తేనె వేసి బాగా కలిపి తాగడం వల్ల శరీర వేడి తగ్గుతుంది.నారింజ లేదా కమలాపండ్ల రసం తీసి, అందులో కొద్దిగా పంచదార, తేనె కలిపి తాగితే కడుపు చల్లగా అవుతుంది. వేడి వాతావరణంలో కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. కీర దోసకాయ రసం తీసి, చెంచాడు తేనె, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే మంచిది.గుప్పెడు పుదీనా ఆకులు, చెంచాడు తేనె, రెండు చెంచాల నిమ్మరసం కలిపి మెత్తగా చేసి స్మూతీలా తీసుకుంటే మంచిది. నాలుగు పుచ్చకాయ ముక్కలను జ్యూస్‌గా తీసి అలాగే తాగడం మంచిది.

∙   జామకాయ రసంలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల దీనిని వేసవికాలంలో తీసుకోవడం మంచిది. రసం తీసేటప్పుడు విత్తనాలను తొలగించడం మంచిది.
∙  అన్నిటి కంటె మంచినీళ్లు తాగడం చాలా ముఖ్యం. రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. జీవనశైలిని బట్టి, మరింత ఎక్కువగా నీళ్లు తాగాలని ఆయుర్వేదం చెబుతోంది.

వేసవిని ఆయుర్వేదం ఆదాన కాలం అంటుంది. ఈ కాలంలో సూర్యుడు ప్రాణుల నుంచి శక్తిని తీసుకుంటాడు కాబట్టి దానికి ఆ పేరు. ఈ శక్తిని మళ్లీ సమకూర్చుకోవడం ఎలాగో ఆయుర్వేదం చెబుతుంది. ఈ కాలంలో వచ్చే మూత్రంలో మంట, అతిసారం లాంటి అనేక వ్యాధుల్ని వాటి నివారణను సూచిస్తుంది.పళ్లరసాలు తాగిన వెంటనే వాటి దోషాల నివారణగా కొద్దిగా వేడి నీళ్లలో శొంఠి, మిరియాల పొడి (ఒక్కొక్కటి చిటికెడు) కలిపి తాగాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే టోపీ కాని గొడుగు కాని వాడాలి.షడంగ పానీయంచందనం (మంచి గంధం), ముస్తా (తుంగ ముస్తలు), ఉశీరం (వట్టి వేరు) ఉదీచ్య (కురువేరు) నాగర (శొంఠి), పర్పాటక... వీటిని దంచి కషాయం కాచుకోవాలి. ఇలా తయారు చేసుకున్నకషాయాన్ని 30 మి.లీ. తీసుకుని అందులో కొంచెం పటికబెల్లం (మిశ్రి) కలిపి రోజూ తాగాలి.జంబీర పానీయం: గ్లాసుడు నీటిలో (300 మి.లీ.) చెంచాడు అల్లం రసం, ఒక చెంచాడు నిమ్మరసం, నాలుగు చెంచాల శర్కర, చిటికెడు ఉప్పు కలిపి తాగాలి.తక్ర పానీయం: పులుపు లేని మజ్జిగను పలుచగా చేసి కొద్దిగా నిమ్మరసం, అల్లం, ఉప్పు, కరివేపాకు, పుదీనా కలిపి వడగొట్టి రోజుకి రెండు మూడుసార్లు తాగాలి.
– వి. ఎల్‌. ఎన్‌. శాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు 

మరిన్ని వార్తలు