వర్ణాలంకరణ

5 Oct, 2018 00:50 IST|Sakshi

ఫ్యాషన్‌

సప్తవర్ణాలు ఆకాశాన  ఇంద్రధనుస్సులో ఇమిడి ఉంటాయి. నవవర్ణాలు దసరా నవరాత్రులలో  ఇల మీద కనువిందు చేస్తుంటాయి. దుర్గాదేవి ప్రతిరూపాలుగా  అవనిపై వెలిసిన స్త్రీ మూర్తులు 
వర్ణరంజితమైన వస్త్రాలను  అలంకరించుకొని ఆనంద నృత్యాలతో  అమ్మవారి మనసును  పరవశింపజేస్తారు. తొమ్మిది రోజులు...  తొమ్మిది వర్ణాల అలంకరణలు చూసే కనులకు ఇవి  వర్ణించనలవి కాని  వర్ణాలంకారాలు.

1వ రోజు రాయంచ దేవికి రాయల్‌ బ్లూ
మొదటి రోజు పాడ్యమి నాడు దుర్గాదేవి శైలపుత్రిగా భక్తుల నీరాజనాలు అందుకుంటుంది. శైలపుత్రి అంటే యువరాణిలా ఆమె అలంకారం ఉండాలి. రాయల్‌ బ్లూ (ముదురు నీలం రంగు) రాజసానికి పెట్టింది పేరు. అందుకే ఈ రోజు నీలం రంగు దుస్తులను ధరించాలి. ప్లెయిన్‌ టస్సర్, క్రేప్‌ లెహంగాల మీద అద్దాలు, చమ్కీలు, స్వరోస్కి, జర్దోసి వర్క్‌లు మరింత ముచ్చట గొలుపుతాయి. 

2వ రోజు బంగారు మేనికి పసుపు
పండగల్లో పసుపు రంగుది ప్రత్యేక స్థానం. పవిత్ర భావనతో మనసును కట్టిపడేస్తుంది. దుర్గాదేవి బ్రహ్మచారిణిగా పూజలు అందుకునే ఈ రోజు ఆమెకు నచ్చే రంగు పసుపు. సంప్రదాయ వేడుకలన్నింటిలోనూ పసుపు రంగు దుస్తులు చూపులను కట్టడి చేస్తాయి. పసుపు రంగుతో ఎరుపు, నీలం, పచ్చ.. ఇలా అన్ని రకాల కాంబినేషన్స్‌ని జత చేయవచ్చు. 

3వ రోజు నిండైన జీవితానికి పచ్చ 
కోటి నెలవంకలను పోలిన అందం ఈ రోజు అమ్మవారిది. అందుకే అమ్మవారు చంద్రఘంటగా భక్తులకు ఆశీస్సులు అందిస్తోంది. ఆకుపచ్చ రంగు వస్త్రాలంకరణ ఈ రోజు ప్రత్యేకం. çగ్రీన్‌కు ఎరుపు, గులాబీ, పసుపు మంచి కాంబినేషన్‌. 

4వ రోజు విశ్వశక్తికి ప్రతీక బూడిద రంగు
ఈ రోజు అమ్మవారు విశ్వశక్తిని నింపుకుని దర్శనమిస్తుంది.  ఆ అనంతశక్తి మనలో ప్రవహించేందుకు బూడిదరంగు సరైన వాహకం. గ్రేకలర్‌ ప్రత్యేకతను చాటుతుంది. ఎంబ్రాయిడరీ చేసిన దుస్తుల మీదకు అదేరంగును పోలిన సిల్వర్‌ ఆభరణాల అలంకరణ సరైన ఎంపిక.

5వ రోజు అగ్ని జ్వాలల ఉత్సాహం నారింజ
స్కందుడు అంటే కార్తికేయుడు. అతని తల్లి దుర్గాదేవి స్కందమాతగా ఈ రోజు పూజలందుకుంటుంది. అగ్ని నారింజ (ఆరెంజ్‌) రంగులో గోచరమవుతుంటుంది. కనుక ఈ రోజు ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే సకల శుభాలు కలుగుతాయంటారు. ఈ కాన్సెప్ట్‌ను అందిపుచ్చుకొని ఈ రోజు ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరించి దాండియా నృత్యాలలో పాల్గొంటే రెట్టించిన ఆనందం, మానసిక ఉద్దీపనలు కలుగుతాయి.

6వ రోజు  స్వచ్ఛమైన తెలుపు
అమ్మవారు తెల్లటి వస్త్రాలు ధరించి కాత్యాయనిగా దర్శనమిస్తారు ఈ రోజు. అమ్మవారి స్వరూపులైన అతివలు తెలుపు వర్ణ దుస్తులు ధరించి గర్భానృత్యం చేస్తూ ఉంటే ఆ దేవి ఆశీస్సులు అపారంగా అందుతాయి. తెలుపు రంగు శాంతికి, మానసిక ప్రశాంతతకు, స్వచ్ఛతకు చిహ్నం. నెటెడ్‌ లెహంగా–చోలీ–దుపట్టా పూర్తిగా తెలుపు రంగు. అక్కడక్కడా తళుక్కుమనే అద్దాలు, చమ్కీలు.. నృత్యంలో ఎటూ చూసినా కలువపూల అందమే.  

7వ రోజు  ఉత్సాహానికి రూపు ఎరుపు
చెడుపై కాళికగా ధ్వజమెత్తిన దుర్గాదేవికి ఎరుపు రంగు దుస్తులను అలంకరించి ఆశీస్సులను అందుకుంటారు భక్తులు. ఆ అమ్మవారికి నచ్చిన దుస్తులను ధరించి ఆమె కృపకు పాత్రులు కావాలని కోరుకునే అతివలు ఎరుపు వర్ణం దుస్తులు అలంకరణకు ఉపయోగిస్తారు.
 

8వ రోజు నీలాకాశమే హద్దు నీలం 
మహాగౌరిగా పరమేశ్వరుని ఇష్టసఖిగా నీరాజనాలు అందుకునే అమ్మవారు ఆకాశమే తనుగా భాసిల్లుతుంది. అందుకే ఈ రోజు  నీలాకాశం రంగు దుస్తులు «ధరిస్తే సకల శుభాలు కలుగుతాయంటారు. దీనికి ఆరెంజ్, ఎరుపు రంగుల కాంబినేషన్‌ సరైన ఎంపిక.  

9వ రోజు సకల శుభాల అందం గులాబీ
చివరి రోజున సిద్ధిధాత్రిగా కోరినవరాలు ఇచ్చే కల్పతరవుగా ప్రసన్నవదనంతో, గులాబీరంగు చెక్కిళ్లతో దర్శనమిస్తుంది అమ్మవారు. కాబట్టి ఈ రోజు గులాబీ రంగు వస్త్రాలంకరణ శ్రేష్టం.

మరిన్ని వార్తలు