Sakshi News home page

4 శాతం నిరుద్యోగులకే ఉద్యోగాలు!

Published Fri, Oct 5 2018 12:47 AM

jobs to 4% unemployed! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్కారీ ఉద్యోగాల్లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేసినా నిరుద్యోగుల్లో 4 శాతం మందికి మాత్రమే ఉపాధి లభిస్తుందని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాయితీ పథకాలతో స్వయం ఉపాధి కల్పన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించడం ద్వారానే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించామని, ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్య రంగంగా పరిగణించి కొనసాగిస్తామన్నారు. ట్విట్టర్‌ వేదికగా గురువారం నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానాలిచ్చారు.

‘గడిచిన నాలుగేళ్ల పాలనలో ప్రధానంగా వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల, తాగునీటి సరఫరా రంగాలపై దృష్టి కేంద్రీకరించాం. వచ్చే ఐదేళ్లలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్య రంగాల్లో సదుపాయాల అభివృద్ధిపై దృష్టిసారిస్తాం. సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం. తెలంగాణ కోసం చాలా ప్రణాళికలున్నాయి’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల మేళవింపుతో నెలాఖరులోగా టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు.

హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.10 వేల కోట్లతో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం (ఎస్సార్డీపీ) పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రానున్న మూడేళ్లలో నగరాభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌ నుంచి రూ.50 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. వర్షాకాలంలో రాజధాని ముంపునకు గురికాకుండా మరో రూ.20 వేల కోట్లతో వరద కాల్వల పనులు చేపడతామన్నారు. రోడ్ల అభివృద్ధి, మాస్టర్‌ ప్లాన్‌ అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఐటీ కారిడార్‌ ప్రాంత అభివృద్ధిపై మాత్రమే దృష్టిసారించారని అడిగిన ఓ ప్రశ్నను కేటీఆర్‌ తోసిపుచ్చారు.

ప్రజలను ముంచేందుకు జట్టు కట్టాయి..
దశాబ్దాలుగా తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్, టీడీపీలు జత కట్టడం ద్వారా తమ అవకాశవాద రాజకీయాలను మరోసారి రుజువు చేసుకున్నాయని కేటీఆర్‌ దుయ్యబట్టారు. వందల మంది తెలంగాణ యువత ప్రాణాలను బలికొన్న పార్టీలు మరోసారి రాష్ట్ర ప్రజలను ముంచేందుకు జట్టు కట్టాయని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల రాజకీయ విమర్శలు ఎన్నడూ లేనంత స్థాయికి దిగజారాయని, రాజకీయాల్లో కనీస విలువలు, మర్యాద పాటించాలన్న సంస్కారాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు మరిచిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు తాము చేసిన అభివృద్ధిని వివరించామని, ప్రజలే తమ పాలన పైన ఓట్ల రూపంలో నిర్ణయం తీసుకుంటారన్నారు.


ఢిల్లీలో రైతులపై లాఠీ చార్జీకి ఖండన
ఢిల్లీలో రైతులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. రైతులకు, వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వ పాలసీలు దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాలకు ఆదర్శనీయమన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి వినూత్న పథకాలు దేశ చరిత్రలో నిలిచిపోతాయన్నారు. యూఏఈలో ఆమ్నెస్టీ అమల్లో ఉన్న నేపథ్యంలో మరింత ఎక్కువ మందిని రాష్ట్రానికి తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సుమారు 500 మంది తిరిగి వస్తారని అంచనా వేశారు.

Advertisement

What’s your opinion

Advertisement