తెర వేసుకున్నా కనిపిస్తుంది...

10 Nov, 2018 00:24 IST|Sakshi

వాహనాల కిటికీలకు సోలార్‌ స్క్రీన్లు ఎందుకు వేసుకుంటాం? ఇంకెందుకు? సూర్యుడి వేడి లోపలికి రాకుండా. కానీ వాటిపై ఇటీవల నిషేధం పెట్టేశారు అంటున్నారా? ఇంకొన్ని రోజులు ఆగండి, ఎంచక్కా స్క్రీన్‌ వేసేసుకోవచ్చు. పోలీసులు అడ్డుకుంటారన్న బెంగ కూడా అక్కరలేదు. ఎందుకంటే... ఫొటోలో కనిపిస్తున్న సరికొత్త సోలార్‌ స్క్రీన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. పారదర్శకంగా ఉన్నాయి కాబట్టి వేడిని ఎలా అడ్డుకుంటాయో అనుకోనక్కరలేదు. ఇవి కనీసం 70 శాతం వేడికి అడ్డుకట్ట వేస్తాయని భరోసా ఇస్తున్నారు మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు.

వాహనాలకు మాత్రమే కాదు.. వీటిని భవనాల కిటికీలకు, అద్దాలకూ బిగించుకోవచ్చునని, ఏసీ ఖర్చులను కనీసం పది శాతం మిగుల్చుకునేందుకు ఉపయోగపడతాయని ఈ సరికొత్త సోలార్‌ స్క్రీన్స్‌ తయారీలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త ఫాంగ్‌ అంటున్నారు. ప్లాస్టిక్‌తోనే తయారైనప్పటికీ ఈ స్క్రీన్‌ మధ్యలో ప్రత్యేక లక్షణాలున్న సూక్ష్మ కణాలు ఉంటాయని, వేడి ఎక్కువైనకొద్దీ వీటి సైజు తగ్గిపోవడం ద్వారా వేడిని లోపలకు  రాకుండా అడ్డుకుంటాయని ఆయన వివరించారు. ఇప్పటికే తాము తయారుచేసిన స్క్రీన్‌ అద్భుత ఫలితాలిచ్చిందని.. మరిన్ని పరీక్షలు చేసిన తరువాత అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తామని వివరించారు.  

మరిన్ని వార్తలు