ఆ తొమ్మిది మంది ఎక్కడ?

22 Sep, 2019 06:00 IST|Sakshi

సువార్త

యేసుప్రభువు ఒకసారి సమరయ ప్రాంతం మీదుగా యెరూషలేముకు వెళ్తుండగా, పది మంది కుష్టు రోగులు ఎదురై, తమను కరుణించమంటూ దూరం నుండే కేకలు వేశారు. ఆ కాలంలో కుష్టు చాలా భయంకరమైన వ్యాధి..కుష్టు వ్యాధిగ్రస్థులు కుటుంబ, సామాజిక బహిష్కరణకు గురై జీవచ్ఛవాల్లాగా ఉరికి దూరంగా నిర్జన స్థలాల్లో బతికేవారు. మామూలు మనుషులు ఎదురైతే కుష్టు రోగులు దూరం నుండే మాట్లాడాలి. అలాంటి ఆ పదిమంది కుష్టురోగుల మీద ప్రభువు జాలి పడి, వారి వ్యాధి  బాగు చేసి, వెళ్లి యాజకులకు చూపించుకొమ్మని చెబితే, వాళ్ళు వెళ్లిపోయారు. వాళ్ళు అలా వెళ్తుండగా బాగుపడ్డారని బైబిల్‌ చెబుతోంది( లూకా 17:14). అయితే కొద్ది సేపటికి ఆ పది మందిలో అస్పృశ్యుడు, సమరయుడైన ఒకడు తిరిగొచ్చి ప్రభువుకు సాగిలపడి కృతజ్ఞత వెలిబుచ్చగా,’ శుద్ధులైన మిగిలిన తొమ్మండుగురు ఎక్కడ?’ అని ప్రభువు ప్రశ్నించాడు. సమరయులను యూదులు ముట్టుకోరు, వారితో సాంగత్యం అసలే చేయరు.

అయితే సామాజిక బహిష్కరణకు గురైన తర్వాత కుష్టు వ్యాధిగ్రస్తులుగా అంతకాలం యూదులైన 9 మంది, సమరయుడైన ఆ వ్యక్తి కలిసే జీవించారు. కానీ ప్రభువు కృపతో శుద్ధులై యాజకులను కలిసేందుకు వెళ్తున్నపుడు బహుశా వారిలో వారికి భేదాభిప్రాయాలు వచ్చాయి. సమరయుడైన ఆ వ్యక్తి అంటరానివాడని, పైగా అతనికి ఆలయప్రవేశం కూడా నిషిద్ధమని యూదులైన తొమ్మండుగురికి గుర్తుకొచ్చి అతన్ని వెలివేస్తే, అతను వెనక్కొచ్చి ప్రభువు పాదాలనాశ్రయించాడు. విచిత్రమేమిటంటే, కుష్టువ్యాధి వారిని  కలిపితే, స్వస్థత విడదీసింది. కాకపోతే సమరయుడికి దాని వల్ల ఎంతో మేలు జరిగింది. ఆ తొమ్మండుగురికి శారీరక స్వస్థత, ఆలయ ప్రవేశం మాత్రమే దొరికింది. కాని స్వస్థత పొంది తిరిగొచ్చిన సమరయుడికి, ఆలయంలో ఆరాధనలందుకునే దేవుడే యేసుప్రభువుగా, రక్షకుడుగా దొరికాడు, ఆయన మాత్రమే ఇచ్చే పరలోక రాజ్యంతో కూడిన శాశ్వతజీవం కూడా సమృద్ధిగా దొరికింది.

ఆ తొమ్మిది మంది కుష్టువ్యాధి నయమై మామూలు మనుషులయ్యారు, కాని కృతజ్ఞతతో తిరిగొచ్చిన సమరయుడు ప్రభువు సహవాసంలో గొప్ప విశ్వాసి అయ్యాడు. ఆ తర్వాత అపొస్తలుడై ప్రభువు సువార్త ప్రకటించి వందలాది ఆత్మలు సంపాదించి హత సాక్షి కూడా అయ్యాడని చరిత్ర చెబుతోంది. కుష్టు నయమైనా దాని కన్నా భయంకరమైన ‘కృతజ్ఞతారాహిత్యం’ అనే వ్యాధి నుండి మాత్రం ఆ తొమ్మండుగురికీ విముక్తి దొరకలేదు. ‘ఆ తొమ్మండుగురు ఎక్కడ?’ అన్న తన ప్రశ్నకు, ‘ఇంకెక్కడ? కుష్టు నయమై కూడా వాళ్ళు నరకంలో ఉన్నారు’ అన్నదే జవాబని ప్రభువుకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే యేసుప్రభువిచ్చే స్వస్థత పొందడం వేరు, యేసుప్రభువునే రక్షకుడుగా పొందడం వేరు. పరలోకరాజ్యార్హత తో కూడిన ఆ ధన్యత, పదిమందిలో అంటరాని వాడు, అన్యుడైన సమరయుడికి ఒక్కడికే దొరికింది. లంకె బిందెలు దొరికితే, వాటిలోని బంగారం, వెండి, వజ్రవైఢూర్యాది విలువైన సామాగ్రినంతా పారేసి,  కేవలం ఖాళీ ఇత్తడి బిందెల్ని ఇంటికి తీసుకెళ్లిన వాళ్ళు ఆ తొమ్మిది మంది కాగా, ఐశ్వర్యంతో సహా లంకె బిందెల్ని తీసుకెళ్లిన వాడు ఆ అన్యుడు, సమరయుడు !!
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌  
సంపాదకుడు – ఆకాశధాన్యం

మరిన్ని వార్తలు