అణుశక్తి బ్యాటరీలు వచ్చేస్తున్నాయి!

5 Jun, 2018 00:48 IST|Sakshi

మీ స్మార్ట్‌ఫోన్‌ను ఓ పదేళ్లపాటు ఛార్జ్‌ చేయాల్సిన అవసరం లేదని ఎవరైనా చెప్పారనుకోండి.. అసాధ్యమని తల అడ్డంగా ఊపేస్తాం. కానీ అణుశక్తి ద్వారా దీన్ని సుసాధ్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మాస్కో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ శాస్త్రవేత్తలు. అణువిద్యుదుదత్పత్తికి ప్రస్తుతం కోటానుకోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తున్న భారీసైజు విద్యుత్‌ కేంద్రాల స్థానంలో చిన్న చిన్న బ్యాటరీల్లాంటివి వాడతారన్నమాట. నికెల్‌ – 63 అనే మూలకం ద్వారా రష్యా శాస్త్రవేత్తలు ఇప్పటికే అణుబ్యాటరీను డిజైన్‌ చేశారు కూడా.

దీంట్లో ప్రస్తుతం మనం వాడుతున్న బ్యాటరీల కంటే ఎక్కువ మోతాదులో విద్యుత్తును నిల్వ చేయగలిగారు శాస్త్రవేత్తలు. రేడియోధార్మిక లక్షణమున్న పదార్థాలు నశించిపోతూ చాలా నెమ్మదిగా ఎలక్ట్రాన్లు/పాసిట్రాన్లను విడుదల చేస్తాయి. ఇలా విడుదలయ్యే ఎలక్ట్రాన్లు/పాసిట్రాన్లను సిలికాన్‌ వంటి అర్ధ వాహకపు పొరలోకి పంపిస్తే కరెంటు ఉత్పత్తి అవుతుంది. నికెల్‌ – 63తో సిద్ధం చేసిన నమూనా బ్యాటరీ ప్రతి ఘనపు సెంటీమీటర్‌లోనూ దాదాపు పది వాట్ల వరకూ విద్యుత్తును నిల్వ చేయవచ్చు. నికెల్‌ –63 అర్ధాయుష్షు వందేళ్లను పరిగణలోకి తీసుకుంటే ఈ బ్యాటరీ సాధారణ ఎలక్ట్రో కెమికల్‌ బ్యాటరీల కంటే పది రెట్లు ఎక్కువ కాలం పాటు విద్యుత్తును అందివ్వగలవు.  

మరిన్ని వార్తలు