సాయంత్రపు సూర్యోదయం

23 Sep, 2019 01:42 IST|Sakshi
రాచవీర దేవర ‘తీర్థ’

ప్రతిధ్వనించే పుస్తకం 

పెద్దమఠము రాచవీర దేవర ‘తీర్థ’ జన్మస్థానం ‘మెదక్‌ జిల్లాలోని ఆందోలు తాలూకా చేవెళ్ల గ్రామం’. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. హిందీ ‘భూషణ’, కన్నడ ‘జాణ’ పరీక్షలు ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ వీరమాహేశ్వర (జంగమ) మహాసభ అధ్యక్షులుగా పనిచేశారు. వీరశైవ ధర్మ ప్రచారం చేశారు. ‘వీరశైవ ధర్మము’ పత్రికను నడిపారు. 2017లో ‘లింగైక్యము’ చెందారు. ఆయన ‘స్వీయ చరిత్రము’లోంచి ఈ ఘట్టం: నా బాల్యమున నొక పర్యాయము సాయంత్రము సమయమున మా తండ్రిగారు ప్రతినిత్యము మాదిరి మధ్యాహ్నము స్నానము జేసే అప్పుడు తడిపిన మైలబట్టలను మిగతా మైల బట్టలను ఉతికి శుభ్రపరచి తేవడానికై నన్ను వెంబడించుకొని ఆందోలు చెరువునకు దీసికెళ్లెను. అక్కడికి వెళ్లిన పిదప నాన్నగారు బట్టలను నీటిలో తడుపుతు– నన్ను పండుకొని నిద్రనుండి లేచావు, కావున ముఖము గడుక్కొమ్మని యాదేశించిరి. అది విని నేను దంతధావనమునకు పండ్ల బూడిద లేదు గదా? అని బ్రశ్నించితిని. అందుకు వారు చిరునవ్వు నవ్వుతూ ఇప్పుడు ఉదయము గాదు. ఇది సాయం సమయమని చెప్పిరి. నేను సూర్యుడుదయించుచున్నాడు గదా? అంటిని. వారది విని అది తూర్పు దిక్కు గాదు, పశ్చిమ దిక్కు అని సమాధానమిచ్చిరి. ఇది నా భ్రాంతి మాత్రమే. అందుకే పెద్దల సూక్తి ‘‘ఉదితె సవితా రక్తా– రక్తా చాస్తమేపిచ’’ అని గలదు. ఇది సార్థకమైనది. సూర్యుడుదయించునప్పుడు ఎర్రగానే ఉంటాడు, మరియును అస్తమించె అప్పుడు ఎర్రగానే ఉంటాడు. అలాగే సత్పురుషుల స్వభావము అట్టిదే.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా