మూపురాల జాతర

6 Nov, 2019 04:04 IST|Sakshi

పుష్కర్‌ మేళా

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ఒంటెల సంతతి పెరుగుతూ ఉంటే ఒక్క భారతదేశంలో తరుగుతూ ఉంది. ప్రమాదకరమైన ఈ పరిణామం మధ్య ఈసారి పుష్కర్‌లో జరుగనున్న ప్రపంచ ప్రఖ్యాత ‘ఒంటెల మేళా’ ఒంటెల గురించి కాసింతైన స్పృహను కలిగించాల్సిన అవసరం ఉంది.

ఊళ్లోకి ఏనుగు వచ్చినా ఒంటె వచ్చినా పిల్లలకు వింత. పెద్దలకు సరదా. రెండూ మన ప్రాంతంలో విస్తృతంగా కనిపించే జంతువులు కావు. ఒంటె ఎడారి జంతువు. అందుకే దానిని ఎడారి ఓడ అంటారు. ‘లొటిపిట్ట’ అని కూడా అంటారు. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా రాజస్థాన్‌లో ఒంటె లేకుండా సామాన్య జీవనం జరగదు. ఒక అంచనా ప్రకారం దేశంలోని ఎనభై శాతం ఒంటెలు రాజస్థాన్‌లోనే ఉన్నాయి.

అందుకే అక్కడ ఒంటెను ఇక్కడ ఎద్దులా ఇంటి పశువు అనుకుంటారు. కుటుంబంలో భాగం చేసుకుంటారు. సంవత్సరానికి ఒకసారి పుష్కర్‌లో మహా మేళా నిర్వహించి ఒంటెల కొనుగోలు, అమ్మకం జరుపుకుంటారు. కార్తీక మాసంలో కార్తీక ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఈ మేళా జరుగుతుంది. ఈసారి ఈ మేళా నవంబర్‌ 5 నుంచి 12వ తేదీ వరకు జరుగుతోంది.

తరలి వచ్చే సంచారజాతులు
సంవత్సరం పొడవునా ఒంటెలను మేపుతూ ఎడారుల్లో తిరిగే, చిన్న చిన్న ఆవాసాల్లో నివసించే సంచార జాతులవారు పుష్కర్‌ మేళా కోసం వేచి చూస్తారు. తేదీలు దగ్గర పడగానే తమ వద్ద ఉన్న ఒంటెలను తీసుకొని, కుటుంబాలతో, వంట సామాగ్రితో, గుడారాలతో పుష్కర్‌ మేళాకు తరలి వస్తారు. వీరు తమను తాము ఒంటెలకు బంట్లుగా భావిస్తారు. శివుడు ఒంటెలను చూసుకోమని తమను పుట్టించాడని వీరి విశ్వాసం. పుష్కర్‌ రాజస్థాన్‌లో ఉన్న ముఖ్య పుణ్యక్షేత్రం.

పంచ సరోవరాల్లోని ఒకటైన ‘పుష్కర్‌ సరోవరం’ ఈ పట్టణంలోనే ఉంది. కార్తీక పౌర్ణమి రోజు ఈ సరోవరంలో భక్తులు విశేషంగా పుణ్యస్నానాలు చేస్తారు. ఈ సందర్భంగా వచ్చిన పర్యాటకలు ఒంటెల మేళాను కూడా ఉత్సాహంగా వెళ్లి తిలకిస్తారు. పుష్కర్‌ అజ్మీర్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ ఆరావళి పర్వతాల పహారా కాస్తుంటే ఈ ఊరు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక మేళా జరుగుతున్న రోజుల్లో అయితే దేశ,విదేశ పర్యాటకులతో కళకళలాడిపోతుంది.

అనేక రకాలు
ఎద్దుల్లో, గేదెల్లో రకాలు ఉన్నట్టే ఒంటెల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. రకాన్ని బట్టి వాటి విలువ ఉంటుంది. మనం ఒంటెలన్నీ ఒకటే అనుకుంటాం కానీ కాదు. అందంగా నాజూకుగా తెలివిగా ఉండే ‘సాచోరి’ జాతి ఒంటె ఒక్కోటి లక్షన్నర పలుకుతుంది. ఇది వ్యవసాయానికి, బండి లాగడానికి, నృత్యానికి పనికి వస్తుంది. ఇక బరువులు మోసే జాతి అయిన ‘బాడ్‌మెరి’ ఒక్కోటి యాభై వేలు పలుకుతుంది.  రేసులలో గెలవాలంటే మాత్రం ‘జైసల్మేరి’ జాతికి చెందిన ఒంటె తప్పని సరి. దీని వెల ముప్పై వేల నుంచి మొదలవుతుంది. పుష్కర్‌ మేళాలో వీటిని వేలాదిగా తీసుకొచ్చి అమ్మడం, కొనడం చేస్తారు. ఇవి కాకుండా ‘గీర్‌’ అని, ‘నాగేరి’ అని అనేక రకాలు ఉన్నాయి.

తరుగుతున్న సంఖ్య
ప్రపంచ దేశాలలో పోలిస్తే మన దేశంలో ఒంటెల సంఖ్య దారుణంగా పడిపోతోంది. దీనిని గమనించి రాజస్థాన్‌ ప్రభుత్వం ఒంటెల కాపరులకు ప్రతి ఒంటె పిల్ల జననానికీ పది వేల రూపాయల నజరానా ప్రకటించింది. ఒంటెల పెంపకం, మేత కష్టంతో కూడుకున్న పని. ఒంటెల సంతతి ఒంటెల కాపరుల మీద ఆధార పడి ఉంటుంది. జానా బెత్తెడుగా ఉన్న కాపరి వృత్తి నుంచి క్రమంగా చాలామంది తప్పుకుంటూ ఉండటంతో సంతతి పడిపోతోంది. ఒంటె పాల అమ్మకాల గురించి చేసిన ప్రయత్నాలు కూడా అంతంత మాత్రం ఉండటం మరో కారణం.

తప్పనిసరిగా చూడాల్సిన వేడుక
ఈ సమస్యలు ఎలా ఉన్నా జీవితంలో ఒక్కసారైనా ఈ ఒంటెల మేళాను చూడాలి. వేలాదిగా ఉండే ఒంటెల సౌందర్యం, వాటి అలంకరణ, వాటి సవారి చూడతగ్గవి. పర్యాటకుల ఆకర్షణ కోసం అక్కడ ప్రభుత్వం అనేక కళా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ఈ నెల 12వ తేదీ వరకు ఈ మేళా జరుగనుంది కనుక ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేసుకొని వెళ్లి చూసి రావచ్చు.

ఆంజనేయ స్వామి వాహనం
ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షణాదిన ఆంజనేయ స్వామి గుడులలో వాహనంగా ఒంటె కనిపించడం అరుదు. కాని అది ఆంజనేయస్వామి వాహనం అని నమ్మే వారున్నారు. దానికి కథ కూడా ఉంది.రావణుని బావమరిది దుందుభిని వాలి వధించి అతడి మృతదేహాన్ని రుష్యమూక పర్వతం (నేటి హింపీ ప్రాంతం) పై పడేశాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న మాతంగ మహాముని ఇది చూసి వాలి కనుక రుష్యమూక పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు.

ఆ తర్వాత సుగ్రీవుణ్ణి వాలి చంపడానికి వెంటపడినప్పుడు సుగ్రీవుడు రుష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కుంటాడు. ఆ సమయంలో సుగ్రీవుణ్ణి చూడటానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంప సరోవరాన్ని తిలకించాలని అనుకుంటాడు. అందుకు సుగ్రీవుడు పంపా సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా ఒంటెను సిద్ధం చేస్తాడు. అలా అది ఆయనకు వాహనం అయ్యిందని కథనం.

మరిన్ని వార్తలు