పెన్నుల్లో రాజా..‘రత్నం’!

6 Nov, 2019 04:06 IST|Sakshi

దేశీయ సిరా పెన్నుతో అంతర్జాతీయ ఖ్యాతి

ఖండాంతర గుర్తింపు పొందిన గైడర్, ఫౌంటెన్‌ రకాలు

అనేకమంది ప్రముఖుల నుంచి అభినందనలు

ఇటీవలే జర్మన్‌ చాన్స్‌లర్‌కు మోదీ ఇచ్చిందీ ఇదే పెన్ను

రాజమహేంద్రవరం వేదికగా 1932 నుంచి మూడు తరాలుగా పెన్నుల తయారీ

నాటి యంత్రాలే నేటికీ వినియోగం.. అతి సూక్ష్మ బంగారు పెన్నుకూ రూపకల్పన

రూ.300 నుంచి రూ.35వేల వరకు లభ్యం

ఇటీవల భారత్‌ పర్యటనకు వచ్చిన జర్మన్‌ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ పెన్ను బహుమతిగా ఇచ్చారు. అది ఏ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన మాంట్‌ బ్లాంక్, పార్కర్‌ పెన్నో కాదు.. పూర్తి స్వదేశీది. పైగా.. అచ్చమైన తెలుగు నేలపై తయారైన ‘రత్నం’ పెన్ను అది. ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర.. మూడు తరాల వారసత్వం దీని ఘనత. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఈ కలం పుట్టుపూర్వోత్తరాలు ఇవిగో..  

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం : దేశంలో సిరా పెన్నుల తయారీకి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి అడుగు పడింది. ఈ ఘనత రత్నం పెన్నుకే దక్కింది. మూడు తరాలుగా రత్నం పెన్నులు తయారై దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ పెన్నుల తయారీ కేంద్రం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం రంగిరీజు వీధిలో ఉంది. స్వాతంత్య్ర సమరానికి ముందు దేశీయంగా పెన్నుల తయారీ రంగంపై తనదైన ముద్ర వేసిన రత్నం సన్స్‌ కుటీర పరిశ్రమగా ఉంది. ఇక్కడ తయారైన ‘గైడర్‌’, ఫౌంటెన్‌ పెన్నులు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. అనేక మోడల్‌ పెన్నులు మార్కెట్లోకి వస్తున్నా రత్నం సన్స్‌ పెన్నుకున్న ప్రాచుర్యం ఇప్పటికీ తగ్గలేదు. భారతావనిలో ప్రప్రథమంగా రత్నం పెన్ను రాజమహేంద్రవరంలో 1932లో కోసూరి రత్నం ఆవిష్కరించారు. రత్నం మరణానంతరం అతని రెండో కుమారుడు కోసూరి వెంకటరమణమూర్తి, మూడో తరంలో రత్నం మనుమలు గోపాలరత్నం (గోపీ), చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పెన్నుల తయారీని కొనసాగిస్తున్నారు.

రత్నం పెన్ను పుట్టుపూర్వోత్తరాలు..
స్వాతంత్య్రానికి పూర్వం సిరా పెన్నులు విడిభాగాలు విదేశాల నుంచి రప్పించుకుని కొంతమంది తయారుచేసే వారు. ఒకసారి అప్పటి ఉమ్మడి గోదావరి జిల్లాకు కృష్ణమాచార్య అనే సబ్‌ జడ్జి కలం కిందపడి పాళీ వంగిపోయింది. 14 క్యారెట్ల బంగారంతో చేసిన పాళీ అది. స్వర్ణకారుడైన కేవీ రత్నం, సోదరుడు సత్యం కొత్త పాళీని తయారుచేసి ఇచ్చారు. వీరి ప్రతిభను చూసి సబ్‌జడ్జికి ముచ్చటేసింది. ముడిసరుకు తాను తెప్పిస్తానని కలాల తయారీ చేపట్టమని సబ్‌జడ్జి రత్నంను ప్రోత్సహించారు. అలా 1932లో రత్నం పెన్నులు మార్కెట్‌లోకి ప్రవేశించాయి. కాలక్రమంలో వెండి, బంగారంతో పెన్నులు తయారుచేస్తూ రత్నం పెన్నులకు ఒక బ్రాండ్‌ను తీసుకువచ్చారు. 

గాంధీ మెచ్చిన పెన్ను
అప్పట్లో అఖిల భారత గ్రామీణ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు జేసీ కుమారప్ప రాజమహేంద్రవరంలో మూడు రోజులు మకాం చేసి దగ్గరుండి రెండు పెన్నులు తయారుచేయించుకుని తీసుకువెళ్లారు. ఒక పెన్నును ఆయన గాంధీజీకి బహూకరించారు. పెన్నును వాడి చూసిన గాంధీ మెచ్చుకుని స్వదస్తూరితో అభినందనల లేఖ రాసి 1935 జూలై 16న రత్నంకు పంపించారు. ‘‘ప్రియమైన రత్నం.. కుమారప్ప ద్వారా ఫౌంటెన్‌ పెన్ను పంపినందుకు మీకు కృతజ్ఞతలు తెలపాలి. బజారులో దొరికే విదేశీ కలాలకు ఇది మంచి ప్రత్యామ్నాయం’’.. అంటూ అభినందిస్తూ వార్ధా నుంచి రత్నంకు లేఖ పంపించారు. అంతేకాదు.. ప్రముఖులు బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, జవహర్‌లాల్‌ నెహ్రు, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ.. సినీ నటులు ఎన్టీరామారావు నుంచి చిరంజీవి వరకు రత్నం పెన్ను వినియోగించి ఆయన్ను అభినందించిన వారే. 

విదేశాల నుంచి యంత్రాల దిగుమతి
1930లో ఇంగ్లాండ్‌ నుంచి రత్నం దిగుమతి చేసుకున్న లెగ్‌ ఆపరేటర్‌ మెషిన్, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న మైఫోర్డ్‌ మెషీన్లనే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. అలాగే, పెన్నుల తయారీకి రబ్బర్‌ చెట్టు పాలు నుంచి తయారుచేసే మెటీరియల్‌ గుజరాత్‌ నుంచి, ఇరిడియమ్‌ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మార్పులకు అనుగుణంగా పెన్నుల తయారీలోను మార్పులు తీసుకురావాలని డిమాండ్‌ వచ్చిందని రత్నం మనుమడు గోపీ చెప్పారు. కానీ, నాడు తాత జాతీయభావంతో ఏర్పాటుచేసిన ఈ పెన్నులో ఎటువంటి మార్పులు చేయకూడదనే ఉద్దేశంతో అదే ఒరవడిని కొనసాగిస్తున్నామన్నారు. వ్యాపారాత్మక ధోరణితో కాకుండా పెట్టుబడి, రెక్కల కష్టం చేతికొస్తే చాలని సరిపెట్టుకుంటున్నామని ఆయన వివరించారు. కాగా, ఈ పెన్నుల కోసం ఇప్పటికీ దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. 1948లో తొలిసారి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ హై కమిషనర్‌ సర్‌ ఆల్డ్‌బాల్క్‌ పెన్నుకు ఆర్డర్‌ రావడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రధాని కార్యాలయం నుంచి 10 పెన్నుల ఆర్డర్‌ రాగా వాటిని పంపించారు. అందులో ఒక పెన్ను జర్మనీ చాన్సలర్‌కు ప్రధాని అందజేశారు.

ప్రపంచంలోనే తొలి సూక్ష్మ పెన్నుకూ శ్రీకారం
3.5సెం.మీ.ల పొడవు, 1.7 గ్రాముల బరువుతో రత్నం సన్స్‌ తయారుచేసిన పెన్ను ప్రపంచంలో అతిచిన్న పెన్నుగా 2012 అక్టోబర్‌లో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ పెన్నులో 2.22 క్యారెట్ల బంగారం పాళీ వాడారు. 5 గ్రాముల బంగారుతో తయారుచేసిన పెన్నుపై భరతమాత, జాతీయ జెండా, జాతిపిత గాంధీ చిత్రాలను చెక్కి భారతీయతను ప్రతిబింబింపజేశారు. రత్నం సన్స్‌లో అంగుళం మొదలు 36 అంగుళాల సైజు వరకూ రత్నం పెన్నులు తయారుచేస్తున్నారు. విభజనకు ముందున్న కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల సంస్కృతిని అద్దంపట్టేలా గోదావరి వంతెన, తిరుపతి గోపురం, కాకతీయుల శిలాతోరణంతో ఒక కలాన్ని తయారుచేశారు.

రూ.300లు నుంచి రూ.35వేల వరకూ..
స్టీల్‌ పాళీతో తయారుచేసిన రత్నం పెన్ను తొలినాళ్లలో రూ.2.25లు ఉండేది. ప్రస్తుతం రూ.300 నుంచి రూ.3,500 వరకూ లభిస్తోంది. బంగారం పాళీలతో తయారుచేసిన పెన్ను రూ.3,000 నుంచి రూ.35వేలు వరకూ లభిస్తున్నాయి. కాగా, మార్కెట్‌లో తక్కువ ధరలకు లభించే బాల్‌ పెన్నుల పోటీని తట్టుకుని ఇప్పటికీ రత్నం పెన్ను నిలుస్తోంది. 

జర్మనీ చాన్సలర్‌కు మోదీ కానుక
ఇటీవల భారత్‌ పర్యటనకు వచ్చిన జర్మనీ చాన్సలర్‌ యాంజిలా మార్కల్‌కు  ప్రధాని మోదీ.. రత్నం సన్స్‌ తయారుచేసిన సిరా పెన్నును ఢిల్లీలో బహూకరించారు. స్వాతంత్య్రానికి పూర్వం స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగించాలనే తలంపుతో నాడు గాంధీజీ కూడా రత్నం తయారుచేసిన స్వదేశీ పెన్నును ఉపయోగించారని ప్రధాని ఆమెకు వివరించడం విశేషం.
పెన్నుల తయారీలో మూడోతరం గోపి, చంద్రశేఖర్‌ 

ప్రోత్సాహం కావాలి
జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన రత్నం పెన్నుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కాస్త గుర్తింపు, ప్రోత్సాహం కావాలి. ఇప్పటివరకూ ఎవరిపై ఆధారపడకుండా సొంతంగానే దీనిని నిర్వహించుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఇప్పుడు ప్రోత్సహించి విద్యుత్, పన్ను మినహాయింపుల్లో రాయితీలు ఇస్తే బాగుంటుంది. అలాగే, మేం ఎలాంటి మార్కెటింగ్‌ పద్ధతులను అవలంబించం. కావల్సిన వారు నేరుగా వచ్చి పట్టుకెళ్తారు. విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. మాకు ఎలాంటి వెబ్‌సైటూ లేదు. కొనుగోలుదారుల మౌఖిక ప్రచారమే మాకు వెబ్‌సైటు.
 – వెంకటరమణమూర్తి, రత్నం కుమారుడు 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేటి ముఖ్యాంశాలు..

తల్లి కడసారి చూపునకూ నోచుకోక..

ఒక్కో ఇంటికి వెయ్యి రూపాయలు

అనారోగ్యంతో ఉన్న పోలీసులకు విధులొద్దు

నిత్యావసరాల రవాణాలో రైల్వేదే అగ్రస్థానం

సినిమా

కరోనా విరాళం

అంతా బాగానే ఉంది

నేను బాగానే ఉన్నాను

నిర్మాత ప్రసాద్‌ కన్నుమూత

అర్జున్‌.. అను వచ్చేశారు

ప్రపంచంలో ఎన్నో కష్టాలున్నాయి