ఇదో కన్నీళ్ల స్టోరీ!

1 Feb, 2016 20:25 IST|Sakshi
ఇదో కన్నీళ్ల స్టోరీ!

ఇదో కన్నీళ్ల స్టోరీ. కనురెప్పల్నుంచి దిగి, ముక్కు పక్కలకు ప్రవహించి, మీసాల్లో కలిసి, పెదవుల కిందికి జారి, చుబుకాన్ని అంటి, గొంతు కిందిగా సాగి, ఛాతీ వెంట్రుకల్లో పాయలుగా విడిపోయి, అక్కడి నుంచి సిక్స్ ప్యాక్ గడుల సందులకు దిగి, మరింత దిగువకు చేరి, గుంభనంగా, గంభీరంగా నాభిలో కలిసిపోయే కన్నీళ్ల స్టోరీ.
 
ఏడ్చే మగాళ్లను నమ్మొచ్చా? మళ్లీ మొదటికొచ్చారా! సరే మీ ఇష్టం. మగాళ్లను నమ్మకండి. కనీసం వాళ్ల కన్నీళ్లనైనా నమ్మకపోతే ఎలా? మీరనుకోవడం ఏంటంటే... మగాళ్లది దొంగ ఏడుపని. అందుకే నమ్మనవసరం లేదని. అవునా? ఏదో ఒక ఏడుపు బాస్. వాళ్ల ఏడుపు వాళ్లను ఏడ్వనివ్వకపోవడం కరెక్టు కాదేమో!  నో అటెన్షన్ ప్లీజ్.

‘బాయ్స్ డోన్ట్ క్రయ్’ అనే మాట ఏ వేదంలోనైనా ఉండి ఉండాలి. లేకుంటే మనవాళ్లు మగాళ్ల ఏడుపుపై ఇంత పట్టింపుతో ఉండేవాళ్లు కాదు. అసలు మగాళ్లు ఎందుకు ఏడ్వకూడదు? వాళ్లు రోబోలేం కాదు కదా. కాదు కానీ, ఫీలింగ్స్ లేని రోబోల్లాగే వాళ్లు ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా స్త్రీల ఫీలింగ్స్ విషయంలో. వినరు. విన్నా పట్టించుకోరు. సో... వీళ్లు ఏడ్చే అర్హతను కోల్పోయి, ఏడ్పించే జాతిలోకి చేరిపోయారని అర్థం చేసుకోవాలి. ఇంకొకటేంటంటే... ఏడుపు మగాళ్లకు నప్పదు. (నచ్చదు కాదు. నప్పదు). అందుకే వాళ్లు ఏడిస్తే నవ్వొస్తుంది. లేదా భయం వేస్తుంది. లేదా వింతగా, విడ్డూరంగా ఉంటుంది. బాధతో ఏడ్చినా, సంతోషంతో ఏడ్చినా!    

బరాక్ ఒబామా ఏడ్చాడనే అనుకుందాం. అనుకోవడం ఏముంది! రెండోసారి ఎన్నికైనప్పుడు, మొన్నీమధ్య వీడ్కోలు స్పీచ్‌లో ఆయన నిజంగానే ఏడ్చేశారు... సంతోషాన్ని పట్టలేక, బాధని ఓర్చుకోలేక.  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి కూడా ఏడ్చిన హిస్టరీ ఉంది. ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడుతూ మాట్లాడుతూ పట్టలేని ఎమోషన్‌తో ఆయన ఏడ్చేశారు. జర్మన్ మగాళ్లు అస్సలు ఏడ్వరు. కానీ ఒకప్పటి వాళ్ల ఛాన్స్‌లర్ హెల్మట్ కోల్ ‘‘నేనెందుకు ఏడ్వకూడదు?’’ అని డైరీలో రాసుకున్నారు. దీన్ని బట్టి ఏడుపురాని, వస్తే ఏడవకూడదని అనుకునే మగాళ్లు ఈ భూమండలంపై లేరనే అనుకోవాలి. చిత్రం చూడండి, ఒబామా ఏడ్చినా, మన పక్కింటి వెంకటేశ్వర్రావుగారు ఏడ్చినా ఒకే విధమైన ఆశ్చర్యం కలుగుతుంది మనకు. ఏడుపు విషయంలో సెలబ్రిటినీ, సగటు మగాణ్నీ వేర్వేరుగా టాలరేట్ చెయ్యలేకపోతున్నాం మనం!

ఆల్బర్ట్ కామూ నవల ‘ది ఔట్‌సైడర్’లో మెహ్‌సో (క్ఛఠటట్చఠ్ట) అనే క్యారెక్టర్ ఉంటుంది. అతడు మనుషుల్లో కలవడు. నిర్లక్ష్యంగా ఉంటాడు. దేన్నీ పట్టించుకోడు. సొంత తల్లి చనిపోతే అంత్యక్రియలప్పుడు కూడా అతడికి ఏడుపురాదు. కానీ ఆ తర్వాత ఒక హత్య చేస్తాడు. ఈ మధ్య రణబీర్ కపూర్ ఆ పుస్తకం చదివాడట. అందులో మెహ్‌సో, తనూ ఒకటేనట. చివరిసారిగా తనెప్పుడు ఏడ్చాడో రణబీర్‌కి గుర్తులేదట. ఏడ్చే అవకాశం లేక మగాళ్లంతా ఇలా... మెహ్‌సోలా ఇంట్రావర్ట్‌లు అయిపోతున్నారనుకోవాలా? వాళ్లను హాయిగా ఏడ్వనిస్తే.. స్త్రీ జాతిని ఏడిపించడం నుంచి డైవర్ట్ అవుతారని ఆశించాలా?

అద్వానీ నుంచి ఆమిర్ వరకు ఇండియాలో బహిరంగంగా ఏడ్చిన సెలబ్రిటీ మగాళ్ల లిస్టు మరీ అంత చిన్నదేం కాదు. అసలు మగాళ్లు ఏడిస్తే చాలు, ఎక్కడలేని సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది! ఈ ఏడుపుగొట్టు స్టేటస్ మనకెందుగ్గానీ, కన్నీళ్లు జలజలా రాలితే గుండెకు బలమని వైద్య పరిశోధకులు అంటున్నారు. అందుకోసమైనా మగాళ్లు ఏడుపు ఆపుకోనక్కర్లేదు. ‘ఒక మగవాడి ఫీలింగ్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన మగ పుస్తకం ‘మధుపం’ లో కుర్ర రచయిత పూడూరి రాజిరెడ్డి అన్నట్టు... ‘నేను మగవాణ్ణి’ అన్న ఆనందం అనుభవించడం కోసం కనుక ఎవరైనా ఏడవ్వడం మానేసి ఉంటే..  అది గుండెకు ఆరోగ్యం కలిగించని ఆనందం అని గ్రహించడం మంచిది.
 
మాధవ్ శింగరాజు

మరిన్ని వార్తలు