అక్రమ దందా | Sakshi
Sakshi News home page

అక్రమ దందా

Published Mon, Feb 1 2016 1:22 AM

అక్రమ దందా


 కరీంనగర్ జిల్లా నుంచి సిద్దిపేట, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు నిత్యం వందలాది లారీల ఇసుక తరలిపోతోంది. రాత్రీపగలు తేడా లేకుండా రోజంతా రవాణా జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణా, నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆ చెక్‌పోస్టు వద్దకు రాగానే ఇసుక దందా నిర్వాహకులు అధికారుల చేతులు తడుపుతూ రవాణాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అధిక లోడుతో మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణమంటే వాహనదారులు జంకుతున్నారు. మితిమీరిన వేగంతో వెళ్లడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గన్నేరువరం తదితర ప్రాంతాల వాగు నుంచి ఇసుకను హైదరాబాద్‌కు లారీల్లో ఈ రోడ్డు మీదుగానే తరలిస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో లారీల్లో ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇసుక లారీలు త్వరగా మూడు, నాలుగు ట్రిప్పులు చేయాలనే ఆతృతతో డ్రైవర్లు లారీలను వేగంగా తోలుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సంబంధిత అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేపట్టి నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. రవాణా సమయంలో రోడ్లపై ఇసుక జారిపడుతుంది. ఆ ఇసుక వాహనదారుల కళ్లల్లో పడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇసుక లారీలు కనీస నియమాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల వారు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement