ఎటూ మీరు చూడరనే..

22 Oct, 2018 00:57 IST|Sakshi

సాహిత్య మరమరాలు

శ్రావణ మాసంలో పెళ్లిళ్ల జోరు అందరికీ తెలిసిందే కదా! అలాంటి సీజన్లో ఓ శిష్యుడు మద్రాసు నుంచి హైదరాబాద్‌లోని ఓ శ్రీమంతుడి ఇంట్లో పెళ్లికి వెళ్తానంటే– ‘అలాంటి పెళ్లికి నువ్వెళ్లడం దండగ, వెళ్లిరావడానికయ్యే డబ్బును ఏ పేదవాడికో దానం చేసి యిక్కడుండి నీ పనులు చూసుకో’ అని సలహా ఇచ్చారు ఆత్రేయ. 

‘అంతటి శ్రీమంతుడు నన్ను జ్ఞాపకం పెట్టుకొని శుభలేఖ యివ్వడం గొప్పకదా గురువుగారూ, వెళ్లకపోతే ఆయన ఏమనుకుంటారో’ అంటూ సందేహాన్ని వ్యక్తం చేశాడు శిష్యుడు. అతని అభిప్రాయాన్ని చుట్టూకూర్చున్న నలుగురైదుగురు సమర్థిస్తే ఆత్రేయ నవ్వుతూ ‘ఏమీ అనుకోరు’ అంటూ తన అనుభవాన్ని వివరించారు.

‘నా నిర్మాతల్లో మంచి పలుకుబడి, డబ్బు వున్న ఒకాయన తన కూతురు పెళ్లిని పరిశ్రమలో అంతవరకూ యెవరూ చెయ్యనంత ఘనంగా చెయ్యాలనుకున్నాడు. పెళ్లికి సినీప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులనూ ఆహ్వానించాడు. అంత పెద్దయెత్తున జరిగే పెళ్లికి నాకూ ఆహ్వానం అందినా, కావాలనే నేను వెళ్లలేదు. పెళ్లి హడావుడి అయిన తర్వాత ప్రొడ్యూసర్‌ ఆఫీసుకు నేను పాటలు రాసే పనిమీద వెళ్లినప్పుడు ఆయన యెదుటపడితే పలకరించాను. ‘పెళ్లికి రాలేకపోయాను’ అంటూ మర్యాద కోసం చెప్పాను. ‘అలాగా, నేను చూళ్లేదు లెండి’ అన్నాడాయన యథాలాపంగా. నేను నవ్వుతూ ‘మీరు చూడరనే రాలేదు లెండి’ అన్నాను అతనికి మెత్తగా గుచ్చుకునేటట్టు. ఆయన మాట్లాడలేక నవ్వేశారు’.

ఆత్రేయ సద్యఃస్ఫూర్తిని మెచ్చుకుంటూ శిష్యులు పగలబడి నవ్వారు.

డాక్టర్‌ పైడిపాల 

మరిన్ని వార్తలు