టెండనైటిస్‌ తగ్గుతుంది..!

13 Mar, 2017 23:30 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 45 ఏళ్లు. నేను బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ను. నాకు కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే టెండన్స్‌కి సంబంధించిన వ్యాధి అని చెప్పారు. మందులు వాడుతున్నా సమస్య నుంచి ఉపశమనం లభించడం లేదు. అసలు ఈ సమస్య ఎందుకు కలుగుతుంది. హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. – మనోజ్‌కుమార్, నందికొట్కూరు

మీరు వివరంగా తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్‌ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి హోమియో ద్వారా  పరిష్కారం లభిస్తుంది. సాధారణంగా మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్‌ అంటారు. ఇవి ఫైబ్రస్‌ కణజాలంతో ఏర్పడతాయి. ఇవి సాగగల గుణం ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.

ఈ టెండన్స్‌ ఇన్ఫెక్షన్‌కు గురికావడాన్ని టెండినైటిస్‌ అంటారు. శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ వయసు వారిలోనైనా కనిపించే ఈ సమస్య ఎక్కువగా పెద్దవయసు వారిలో (ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారిలో) కనిపిస్తుంది. ఆ వయసు వారిలో సాధారణంగా టెండాన్స్‌ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

కారణాలు : వయసు పెరగడం, గాయం కావడం... వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్‌పై అధిగ ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్‌ కీ–బోర్డులు, మౌస్‌లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్‌ మొదలైనవి.

క్రీడల వల్ల: పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్‌బాల్, గోల్ఫ్, బౌలింగ్‌ మొదలైన వాటివల్ల ∙డయాబెటిస్, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో  బాధపడేవారు ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది ∙కొన్ని ఇన్ఫెక్షన్‌ల వల్ల కూడా ఈ టెండినైటిస్‌ సంభవించే అవకాశం ఉంది.

లక్షణాలు:  ∙టెండినైటిస్‌కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం, ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం, కొన్ని రకాల శబ్దాలు వినిపించడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలను గమనించవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:  ∙కంప్యూ టర్లను, కీబోర్డులను, మౌస్‌లను సరైన పొజిషన్‌లో సర్దుబాటు చేసుకోవడం ∙పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం ∙వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం ∙క్రీడలలో కోచ్‌ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం... ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.


చికిత్స: జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శారీరక పరిస్థితులు, తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించి రోగ నిరోధకశక్తిని సరిచేయడం వల్ల... ఎలాంటి ఇన్‌ఫ్లమేషన్‌ ఉన్నా దానిని నయం చేయడం సాధ్యమవుతుంది. అంతే కాకుండా టెండన్స్‌ను దృఢపరచి సమస్యను సమూలంగా దూరం చేయడం జరుగుతుంది.

డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌ సీఎండి
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ హైదరాబాద్‌

మరిన్ని వార్తలు