మీ ఆరోగ్యాన్ని... దుస్తులే చెబుతాయి!

20 May, 2019 02:09 IST|Sakshi

ఫిట్‌నెస్‌ కోసం మనం స్మార్ట్‌వాచ్‌ల వంటి బోలెడన్ని పరికరాలు వాడేస్తున్నామా... యూబీసీ ఓకనగాన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ శాస్త్రవేత్తలు ఇకపై ఇవేవీ అవసరం లేదని చెప్పేస్తున్నారు. ఎందుకంటే.. తాము ఎంచక్కా ఉతికేసుకున్నా పనిచేయగల సెన్సర్లను అభివృద్ధి చేశామని.. వీటిని పోగులుగా వాడుకున్న దుస్తులను వేసుకుంటే మీ ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండవచ్చునని వీరు చెబుతున్నారు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉండే ఈ సెన్సర్‌ దుస్తుల్లోని పోగులు సాగిపోవడం ఆధారంగా మన కదలికలను గుర్తిస్తాయి. కాకపోతే ఈ పోగులను గ్రాఫీన్‌ నానోప్లేట్‌లెట్స్‌తో శుద్ధి చేయాల్సి ఉంటుంది.

పీజో రెసిస్టివిటీ అనే భౌతిక ధర్మం ఆధారంగా ఈ సెన్సర్లు పనిచేస్తాయని, గుండెచప్పుళ్లను గుర్తించడంతోపాటు, ఉష్ణోగ్రత నియంత్రణకు వీటిని వాడుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మినా హూర్‌ఫర్‌ అంటున్నారు. స్పాండెక్స్‌ వంటి వస్త్రాల్లో  సెన్సర్లు ఉన్న పోగులను ఏర్పాటు చేసి దాన్ని సిలికాన్‌ షీట్‌లతో చుట్టేస్తే... అవి నిత్యం మన వివరాలను నమోదు చేస్తూ అవసరమైనప్పుడు సమాచారం అందిస్తాయని.. శరీరంలో నీళ్లు తగ్గితే తాగమని సూచించడం, ఒత్తిడికి గురైనప్పుడు విశ్రాంతి తీసుకోమని సలహా ఇవ్వడం వంటి పనులన్నీ ఈ సెన్సర్‌ ఆధారిత వస్త్రాలు చేయగలవని మినా అంటున్నారు. ప్రస్తుతానికి తాము సెన్సర్లను పరీక్షించే దశలో ఉన్నామని.. సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అవకాశముందని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే ఈ సరికొత్త, చౌక సెన్సర్‌ దుస్తులు మార్కెట్‌లోకి వచ్చేస్తాయని అన్నారు.

మరిన్ని వార్తలు