మహిళా ప్రయాణికులకు షీ లాడ్జ్‌

14 Nov, 2018 23:42 IST|Sakshi

మన దేశంలో స్త్రీలు ఒంటరిగా ప్రయాణించరని, ప్రయాణించే పని వారికి ఉండదని, ప్రయాణించినా ఎవరినో ఒకరిని తోడు తీసుకువెళతారని ప్రభుత్వాలు, సమాజము భావిస్తాయి. కాని ఇది నిజమా? ఒంటరిగా ప్రయాణించకుండానే స్త్రీలకు జీవితం గడుస్తూ ఉన్నదా? ఉద్యోగంలో భాగంగా, కుటుంబ అవసరాల్లో భాగంగా, పర్యాటనాభిలాషతో స్త్రీలు ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉంటారు. వితంతువులు, డైవొర్సీలు, అవివాహితలు, సింగిల్‌ పేరెంట్‌లు... ఎందరో ఈ సమాజంలో భాగం. వీరు కాక మగతోడు అవసరం లేకుండా ప్రయాణించాలనుకునే అన్ని వర్గాల, నేపథ్యాల స్త్రీలూ ఉంటారు.స్వేచ్ఛగా, భద్రతగా తమ అవసరాల కోసం ప్రయాణించే హక్కు వారికి ఉంది. మరి వారికి తగిన ఏర్పాటు ఉన్నదా? గదుల విషయంలో, భద్రత విషయంలో, భోజన ఏర్పాట్ల విషయంలో, టికెట్ల జారీలో...వీరందరి కోసమే కేరళ ప్రభుత్వం చేసిన ఒక ఆలోచన ‘షీ లాడ్జ్‌’వారం పది రోజుల క్రితం కేరళలోని త్రిచూర్‌లో మొదలైన ‘షీ లాడ్జ్‌’ కేరళలోని సామాన్య మహిళల దృష్టినే కాక దేశం దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. దాదాపు ఒకటిన్నర కోట్ల ఖర్చుతో రెండంతస్తులతో నిర్మించిన ఈ లాడ్జ్‌ మహిళలకు ఒక గొప్ప ఊరట అని చెప్పాలి.

‘ఒంటరిగా లేదా పిల్లలతో ప్రయాణించాలనుకునే స్త్రీలు ఇక్కడ బస చేయవచ్చు’ అని అధికారి ఒకరు తెలిపారు. ఈ లాడ్జ్‌లను పూర్తిగా స్త్రీలే నిర్వహిస్తారు. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఉంటుంది. రైల్వేస్టేషన్‌కు, బస్టాండ్‌కు డ్రాప్‌ చేయడానికి ఏర్పాట్లు ఉంటాయి. ప్రత్యేకమైన టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ కూడా ఉంటుంది. గదులు, డార్మిటరీలు ఉన్నాయి. ‘ఏకకాలంలో నలభై మంది ఇక్కడ ఉండవచ్చు’ అని అధికారి చెప్పారు. కేరళలో మొత్తం 14 జిల్లాలు ఉన్నాయి. అన్ని జిల్లాలలో షీ లాడ్జ్‌లు ఏర్పాటు కానున్నాయి.ప్రస్తుతం త్రిచూర్, కన్హన్‌గఢ్‌లలో ఈ లాడ్జ్‌లు తమ కార్యకలాపాలు మొదలెట్టాయి. మిగిలిన చోట్ల మొదలుకానున్నాయి. ప్రభుత్వం వీటి ఏర్పాటు కోసం దాదాపు 140 కోట్లు విడుదల చేసింది. ‘ఇది కేరళ ప్రభుత్వం సగర్వ కార్యక్రమం’ అని ఆ ప్రభుత్వ ప్రతినిధులు భావిస్తున్నారు. మన దగ్గర ఉన్న డ్వాక్రా గ్రూప్‌లా కేరళలో ‘కుటుంబశ్రీ’ సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులు ఉన్నాయి. దాదాపు 40 లక్షల మంది స్త్రీలు ఈ గ్రూపులలో భాగం అయి ఉన్నారు. వీరు సాగించే లావాదేవీలు నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటాయనే పేరు గడించారు.

‘అందుకే షీలాడ్జ్‌ల నిర్వహణ ఈ గ్రూప్‌లకు అప్పజెబుతున్నాం’ అని ప్రభుత్వాధికారి చెప్పారు.మెరుగైన జీవనం, మెరుగైన సమాజం కేవలం ఆర్థికాభివృద్ధి వల్ల ఏర్పడవు. దైనందిన జీవితాల్లోని ఆటంకాలను తొలగించే ఉపాయాలు చేసినప్పుడే సాధ్యమవుతాయి. స్త్రీ ముందుకు సాగాలంటే వారు ఇంటి నుంచి బయటకు రాక తప్పదు. ప్రయాణం చేయక తప్పదు. ఎక్కడకు వెళ్లినా క్షేమకరమైన బస, భోజనం దొరుకుతాయంటే వారు అనేక పనులు చేయగలుగుతారు. కుటుంబాలపై వారి రక్షణకు సంబంధించిన ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇలాంటి వికాసం అన్ని రాష్ట్రాల్లోనూ జరిగితే ఎదుగుదల నాలుగు చక్రాల మీద పరుగుతీస్తుందనడంలో సందేహం లేదు. 

మరిన్ని వార్తలు