దొంగల పాలు

29 Jan, 2019 00:26 IST|Sakshi
∙రజనీకాంత్‌కు పాలాభిషేకం చేస్తున్న ఫ్యాన్స్‌ (ఫైల్‌);     ఇన్‌సెట్‌లో శింబు 

అతి అభిమానం

చైన్‌ స్నాచర్ల గురించి విన్నాం గానీ పాల క్యాన్ల స్నాచర్ల గురించి విన్నామా?  తమిళనాడులో పాలక్యాన్ల దొంగలు ఇటీవల పెరిగిపోయారని అక్కడి పాల ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీని వెనుక మన తెలుగువారి పాత్ర కూడా ఉందని తెలిస్తే అంతగా కంగారు పడాల్సిన పని లేదు.

తెలుగులో పెద్ద విజయం సాధించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా తమిళంలో సింబు హీరోగా సి.సుందర్‌ (కుష్బూ భర్త) దర్శకత్వంలో ‘వందా రాజావతన్‌ వరువన్‌’గా రీమేక్‌ అయ్యింది. ఫిబ్రవరి 1న విడుదల. ఈ సందర్భంగా హీరో సింబు ఒక వీడియో విడుదల చేస్తూ ‘బాగా ఆర్భాటం చేయండి. పాలతో నా కటౌట్లు అభిషేకం చేయండి’ అని అభిమానులకు పిలుపు ఇచ్చాడు. దానిపై ట్రోలింగ్‌ జరిగింది. ‘సింబుకు అంత సీన్‌ లేదు. అంత పాలుబోసేంత ఫ్యాన్లు లేరు’ అని వేరే హీరోల అభిమానులు కామెంట్‌ చేశారు. దాంతో సింబు మరో వీడియో విడుదల చేసి ‘రెచ్చిపోండి... భారీ క్యాన్లతో నా కటౌట్లకు పాలాభిషేకం చేయండి’ అని పిలుపు ఇచ్చాడు. ఇది అభిమానులను తప్పుదారి పట్టించేలా ఉందని కొందరు మండిపడ్డారు. ఈలోపు ఈ తతంగం కోసమే అన్నట్టు తమిళనాడులో పాలతో వస్తున్న వాహనాలలోని క్యాన్లు మాయం కావడం మొదలెట్టాయి. వ్యవహారం ముదిరిపోయేసరికి సింబు నాలుకా పెదాలు రెండూ కరుచుకుని ‘నేను చెప్పింది పాలాభిషేకం చేయమని కాదు. అక్కర ఉన్న పిల్లలకు పాలు పంచమని’ అని కొత్త వీడియో రిలీజ్‌ చేసి తప్పు నుంచి తప్పించుకున్నాడు.

అయితే ఈ సందర్భంగా ఈ శ్రుతి మించిన అభిమానం గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో పాలాభిషేకానికి తెర తీసిన రజనీకాంత్‌ అభిమానులు ఈ ట్రెండ్‌ను పెంచి పోషించారని ఆలోచనాపరులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో వేలకొద్ది పసిపిల్లలు తగినన్ని పాలులేక బాధ పడుతుంటే కటౌట్ల మీద పాలుబోసి వృ«థా చేయడం అన్యాయమని అంటున్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల, పెరుగుతున్న వేడి వల్ల, నీటివసతి, గడ్డి వసతి కరువై సరైన ఆహారం లేక పశువులు ఇచ్చే పాల శాతం రాను రాను తగ్గుతూ పాల ధర పెరుగుతోందని ఒక పరిశీలన. మరోవైపు మనదేశంలో పిల్లల కోసం ఉపయోగించే పాల కన్నా క్రతువుల్లో వాడే పాలు అధికం. దానికితోడు వెర్రి అభిమానం వల్ల కూడా పాలు వృ«థా అవుతున్నాయి.  సినిమా రిలీజ్‌ అవుతుందంటే ఇళ్ల ముందరి పాల ప్యాకెట్లు మాయమవుతున్నాయంటే మన కుర్రకారు ఏ స్థాయిలో ఉన్నట్టు?

మరిన్ని వార్తలు