నాగరత్నమ్మకు నాగాభరణం

21 Jan, 2020 08:54 IST|Sakshi
నాటకంలోని ఒక దృశ్యం

దేవదాసీగా పుట్టి, అద్భుత గాయనిగా ఎదిగి, త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలకు అంకురార్పణ చేసిన బెంగళూరు నాగరత్నమ్మ నేటికీ మహిళాలోకాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. తాజాగా ఆమె జీవితం ప్రసిద్ధ కన్నడ దర్శకుడు నాగాభరణ ద్వారా నాటకంగా రూపుదిద్దుకుంది.

త్యాగరాజ ఆరాధనోత్సవాలు వస్తున్నాయంటే అందరికీ ముందుగా గుర్తుకువచ్చే వ్యక్తిబెంగళూరు నాగరత్నమ్మ. ఆవిడ ఒక సాంస్కృతిక ఉద్యమకారిణి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, మేధావి. దేవదాసి వ్యవస్థ రద్దు కాకూడదని, పోరాడి గెలిచిన దేవదాసి ఆమె.  ఆమె జీవిత చరిత్రను మొట్టమొదటిసారిగా కన్నడ సినీ దర్శకుడు టి.ఎస్‌.నాగాభరణ దర్శకత్వంలో ‘విద్యాసుందరి నాగరత్నమ్మ’ పేరుతో నాటకంగా రూపొందించారు. ఏటా పుష్యమాసంలో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా ఈ నాటకాన్ని ‘బెంగళూరు చౌడయ్య మెమోరియల్‌ హాల్‌’లో ఇటీవల ప్రదర్శించారు.మైసూరులో దేవదాసీ కుటుంబంలో పుట్టిన నాగరత్నమ్మ గొప్ప కర్నాటక గాయకురాలు. సంప్రదాయ సంగీత సాహిత్యాలలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. ఆవిడ చరిత్రను చూడటానికి చాలామంది ఆసక్తి చూపుతుండటం వలన నాగాభరణ ఆమె జీవితాన్ని నాటకంగా రూపొందించారు. ‘‘నాగరత్నమ్మ గారి జీవిత చరిత్రను నాటకంగా రూపొందించినందుకు కన్నడ వ్యక్తిగా గర్విస్తాను. వి.శ్రీరామ్‌ రచించిన, ‘దేవదాసి అండ్‌ ద సెయింట్‌ – లైఫ్‌ అండ్‌ టైమ్స్‌ ఆఫ్‌ నాగరత్నమ్మ’ అనే పుస్తకాన్ని ఏడాది క్రితం చదివాను. ఒక్కో అక్షరం చదువుతుంటే ఒళ్లు పులకించిపోయింది. ఆవిడ గొప్పదనం తెలుసుకునే కొద్దీ ఆ రోజుల్లోనే ఆమె ఎంత ఆధునికురాలో అనిపించింది. నాగరత్నమ్మ మహిళల హక్కుల కోసం పోరాడారు. లింగవివక్షతో మహిళల రచనలను వెలుగులోనికి రానీయని తరుణంలో నాగరత్నమ్మ.. కన్నడ, తెలుగు, తమిళ, సంస్కృత భాషలలోని మహిళల రచనలకు అచ్చురూపం కల్పించారు. అటువంటిæ మహనీయురాలిని ఈ తరానికి చూపించాలనుకున్నాను’’ అంటారు నాగాభరణ.

ఆకాశవాణిలో ఏ గ్రేడ్‌ కళాకారిణిగా పనిచేస్తున్న ‘పుస్తకం రమా’ అనే గాయని, నాగరత్నమ్మ గారి మీద ఒక కార్యక్రమం రూపొందించే క్రమంలో నాగాభరణను కలిశారు. ఆ సమయంలోనే ఆయన ఈ నాటకం రచిస్తున్నారని తెలిసింది. ఇద్దరూ కలిసి సంవత్సరం పాటు అనేక సంగీత పుస్తకాల మీద పరిశోధన  చేసి, రెండు గంటల నాటకాన్ని రూపొందించారు. ఈ నాటకంలో మొత్తం 20 మంది గాయకులు పాడారు. ఆకాశవాణి పూర్వ డైరెక్టర్‌ జనరల్‌ కె. వేగేశ్‌

నాగరత్నమ్మ ,నాగాభరణ
‘విద్యాసుందరి నాగరత్నమ్మ’ నాటకాన్ని చౌడయ్య మెమోరియల్‌ హాల్, బెంగళూరులో ప్రదర్శించారు. ఈ నాటకం ‘పుస్తకం రమా’ గానంతో ప్రారంభమవుతుంది. ఆమె బెంగళూరు నాగరత్నమ్మలాగే గమకాలు పలికించగలిగారు. తెర తీయగానే త్యాగరాజ సమాధి దగ్గర పెరియ కచ్చి, చిన్న కచ్చి అనే ఇద్దరు త్యాగరాయ ఆరాధన ఉత్సవాలు నిర్వహించడం కోసం పోటీ పడుతుంటారు. ఆ సమయంలో కొంతమంది దేవదాసీలను వెంటబెట్టుకుని బెంగళూరు నాగరత్నమ్మ స్వయంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించటం, బన్నీ బాయ్‌ను దత్తతు తీసుకోవటం చూపిస్తారు. నాటకం చాలా స్పీడ్‌గా నడుస్తుంది. నాగరత్నమ్మ జీవితంలోని ప్రధానఘట్టాలను మాత్రమే ఇందులో చూపారు. నాగరత్నమ్మ చదువు, భాష పరిజ్ఞానం, సంగీతం, ఆమె తల్లి పుట్టలక్ష్మమ్మ దయనీయ స్థితి, బెంగళూరుకు వలస వెళ్లటం, ఆమె మరణం, న్యాయమూర్తి నరహరిరావును కలవటం వంటి ఘట్టాలు ఇందులో చూపారు. యువనాగరత్నమ్మగా, నరహరిగా అనన్యభట్, నితిన్‌ నటించారు. నాగరత్నమ్మ మద్రాసు వచ్చాక వీణ ధనమ్మాళ్‌తో స్నేహం, ధన  సంపాదన, నూతన గృహం, గురువును ఆహ్వానించటం, తిరువాయూరు వెళ్లినప్పుడు, త్యాగరాజ సమాధి చూసి బాధ పడి, ఆ తరవాత కొంత కాలానికి అక్కడ మంచి సమాధి నిర్మించి, త్యాగరాజ ఆరాధనోత్సవాలకు తన సంపదనంతా ఖర్చు చేయటం ఇందులో చూపారు. ఆమెలోని సునిశిత హాస్యాన్ని కూడా ప్రదర్శించారు. ఈ నాటకానికి కన్నడ ప్రజలు నీరాజనం పట్టారు.

నాగరత్నమ్మ 1878లో పుట్టులక్ష్మి అనే దేవదాసికి నంజంగుడ్‌లో జన్మించారు . మైసూరు రాజు దగ్గర ఆస్థాన కవిగా పనిచే సిన గిరిభట్ట తిమ్మయ్య శాస్త్రి అనే పండితుడు పుట్టులక్ష్మికి, నాగరత్నమ్మకు ఆశ్రయం ఇచ్చారు. ఆయన నాగరత్నమ్మను చిన్నచూపు చూశాడు. వీధులలోకి వెళ్లి ఆవుపేడ తీసుకురమ్మని పంపేవాడు. ఈ అవమానంతో పుట్టులక్ష్మికి మొండి ధైర్యం వచ్చింది. కూతురిని గొప్ప సంగీత విద్వాంసురాలిని చేసి, ఆత్మస్థయిర్యం నూరిపోసింది. తిరిగి బెంగళూరు వచ్చేశాక, మైసూరు లా కోర్టు న్యాయాధికారి నరహరి రావు నాగరత్నమ్మకు ఆశ్రయం ఇచ్చారు. యవ్వనంలోకి వచ్చిన నాగరత్నమ్మ సంగీత కచేరీలు ప్రారంభించారు. ఆమె గొప్పదనం గురించి కర్ణాకర్ణిగా విన్న మైసూరు మహారాజ్‌ చామరాజ వడయార్‌ (పది) నాగరత్నమ్మను తన కొలువుకు పిలిపించారు. ఆ తరవాత నాగరత్నమ్మకు కచేరీ అవకాశాలు విస్తృతంగా వచ్చాయి. ఆమె మద్రాసు చేరాక, ద గ్రామఫోన్‌ కంపెనీవారు 1904 – 1905 మధ్య కాలంలో నాగరత్నమ్మ సంగీతాన్ని రికార్డు చేశారు.

‘బిడారం కృష్ణప్ప’ (నాగరత్నమ్మ గురువు) పాత్ర పోషించారు. ‘నాకు సీనియర్‌ నాగరత్నమ్మ పాత్ర వేయాలని ఉంది’ అని తన మనసులోని మాట బయటపెట్టారు పుస్తకం రమా. ఈ నాటకం కోసం వీరంతా పది వారాల పాటు సాధన చేశారు. పులికేశి కస్తూరి కొరియోగ్రఫీ చేశారు.  నాగరత్నమ్మకు సంగీతం పట్ల ఉన్న ఆరాధన, ఆవిడలోని సామాజిక స్పృహ, రూపుమాసిపోతున్న దేవదాసీ వ్యవస్థను ఎత్తివేయాలంటూ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆవిడ చేసిన పోరాటం.. వంటి అంశాలను ప్రముఖంగా చూపారు ఇందులో. నాగరత్నమ్మ పెంపుడు కూతురు బన్నీ బాయ్, ఆమె ప్రాణ స్నేహితురాలు వీణ ధనమ్మాళ్‌ (మద్రాసు) గురించి కూడా చూపారు. వీణ ధనమ్మాళ్‌ మరణం తరవాత నాగరత్నమ్మకు వైరాగ్యం వచ్చింది, తన బంగ్లా, నగలను అమ్మేసి, తిరువయ్యూరులో త్యాగరాజుకి మందిరం నిర్మించి, తన చివరి రోజులను చేతిలో చిల్లిగవ్వ లేకుండా అక్కడే గడిపారు. ఆమె చూపిన చొరవతోనే నేటికీ ఏటా తిరువాయూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. పురుష ఆధిక్యం ఉన్న సంగీత ప్రపంచంలో, నాగరత్నమ్మ ప్రోత్సాహంతో మహిళలు కూడా మంచి గుర్తింపు పొందారు. ఆ రోజుల్లోనే అంతటి ఘనతను సాధించిన ధీర బెంగళూరు నాగరత్నమ్మ.– వైజయంతి

మరిన్ని వార్తలు