సలామ్‌ డాక్టర్‌

8 Jul, 2020 00:06 IST|Sakshi

వెనుకబడిన ప్రాంతాలు లండన్‌లో కూడా ఉంటాయి. తూర్పు లండన్‌లోని న్యూహామ్‌ అలాంటి ఒక ప్రాంతం. అక్కడి ఎన్‌.హెచ్‌.ఎస్‌ (నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌) శాఖ హాస్పిటల్‌లో పని చేసే డాక్టర్‌ ఫర్జానా హుసేన్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దానికి కారణం బ్రిటన్‌లోని మూలమూలలా ఆమె నిలువెత్తు హోర్డింగ్‌లు ప్రదర్శితం కావడమే. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన ఈ బంగ్లాదేశి అక్కడే 1995లో మెడిసిన్‌ పూర్తి చేసి జనరల్‌ ప్రాక్టీషనర్‌గా పని చేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభించిన గత నాలుగు నెలలుగా తన క్లినిక్‌లో అలుపు లేకుండా పని చేస్తోంది. ఎన్‌.హెచ్‌.ఎస్‌ తన 72వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా తన బ్రాంచ్‌ హాస్పిటల్స్‌లో కరోనాపై యుద్ధం చేస్తున్న డాక్టర్లను గౌరవించదలచుకుంది. మొత్తం 12 మంది డాక్టర్లను ఎంపిక చేసి వారికి కృతజ్ఞతలు చెప్తూ హోర్డింగ్స్‌ ఏర్పాటు చేసింది. ఆ 12 మందిలో డాక్టర్‌ ఫర్జానా కూడా ఒకరుగా నిలిచి ప్రశంసలు పొందుతోంది.

‘నేను మెడిసిన్‌ చేస్తుండగా మా అమ్మకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. నేను కాలేజ్‌ నుంచి 250 మైళ్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్లి ఆమె దగ్గర ఉన్నాను. కాని మా అమ్మ– ‘వెళ్లు... చదువుకో... నువ్వు డాక్టర్‌ అయ్యి నలుగురికీ సాయం చెయ్యి’ అని చెప్పింది. ఆ తర్వాత ఐదు రోజులకు ఆమె చనిపోయింది. నా దగ్గరకు ఏ పేషెంట్‌ వచ్చినా వారు ఎవరికో ఒకరికి కుటుంబ సభ్యులు అయి ఉంటారని, వారి ప్రాణాలు ముఖ్యమని భావిస్తాను. వారికి శ్రద్ధగా వైద్యం చేస్తాను’ అని చెప్పిందామె. ‘నేను ఏ వసతులు లేని ప్రాంతంలో పని చేస్తున్నాను. పిల్లలకు టీకాలు వేయడం కూడా ఇక్కడ పెద్ద విషయం. కాని ప్రజలు నన్ను ఇష్టపడతారు. ఇరువురం కలిసి జబ్బులపై పోరాటం చేస్తున్నాం’ అంటుందామె. గృహిణిగా ఇల్లు, పిల్లలను చూసుకుంటూనే ఆమె తన విధులను నాగా లేకుండా నిర్వర్తిస్తోంది. లండన్‌ కూడలిలో ఏర్పాటైన తన భారీ హోర్డింగ్‌ ముందు ఫర్జానా నిలబడి చూసుకునే ఫోటో చాలామందికి నచ్చింది. మంచి పనులు చేసే వారికి గుర్తింపు వచ్చే తీరుతుందని ఈ ఉదంతం తెలియచేస్తోంది. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా