తండ్రీ నిన్ను దలంచి...

20 May, 2020 04:09 IST|Sakshi

భర్త ఆదరణ లేకపోతేనో తల్లిదండ్రులు చేరదీయకనో అన్నదమ్ములు చూడకుంటేనో ఒంటరి అవదు ఆడపిల్ల. చదువు లేకుంటే.. చేతిలో విద్య లేకుంటే.. ఎందరున్నా ఆమెకు తోడు లేనట్లే. ఈ మాట అన్నది షెకా ఉల్హక్‌. ఎవరాయన?! చదువు లేని.. ఒక తండ్రి.

ముహమ్మద్‌ షెకా ఉల్హక్‌ ఏ ప్రత్యేకతలూ లేని సగటు మనిషి. అయితే నలుగురు ఆడపిల్లల తండ్రిగా ఆయన ఆలోచనలు ప్రత్యేకమైనవి. ఆడపిల్లకు పెళ్లి ముఖ్యమే కానీ.. అంతకంటే ముఖ్యమైనవి విద్య, ఉపాధి అని నమ్ముతాడు. పశ్చిమ బెంగాల్‌లోని స్వగ్రామం నుంచి బతుకుతెరువు కోసం హర్యానాలోని గుర్‌గావ్‌కు 1997లో వచ్చాడు. అతడికి అది బంధువులు చూపిన దారి. చదువుంటే మన దారి మనం వెతుక్కుంటాం. లేదంటే ఎవరేది చూపితే అదే దారి. షెకా ఉల్హక్‌ ‘దస్వీ ఫెయిల్‌’. తొమ్మిది వరకు చదివాడు.

అతడు గుర్‌గావ్‌ వచ్చిన ఏడాదే మొదటి కూతురు షహనాజ్‌ పుట్టింది. అప్పటికి అతడి వయసు పద్దెనిమిదేళ్లు. పద్నాలుగేళ్లకే పెద్దవాళ్లు పెళ్లి చేసేశారు. గుర్‌గావ్‌ వచ్చాక అక్కడి పాలమ్‌ విహార్‌ను తన స్వగ్రామం చేసుకున్నాడు. వచ్చేటప్పుడు తను, తన భార్య బహ్రున్‌ బీబీ అంతే. పెద్ద కూతురికి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశాడు. రెండో కూతురి పెళ్లి లాక్‌డౌన్‌కి ముందు మొన్న ఫిబ్రవరిలోనే అయింది. మిగతా ఇద్దరు కూతుళ్లు నానమ్మతోపాటు పశ్చిమ బెంగాల్‌లో ఉంటున్నారు. ఇద్దరికీ ఏడాది ఎడం. అక్కడే ఈ ఏడాది పరీక్షలు రాశారు.

షెకా ఉల్హక్‌ ప్లంబర్‌ పని చేస్తాడు. పాలమ్‌ విహార్‌లో నీళ్ల పైపులు పాడైనప్పుడు, గచ్చుమీద మార్బుల్స్‌ వెయ్యడానికి, ఇంకా ఇతర ప్లంబింగ్‌ పనులకు షెకా ఉల్హక్‌నే పిలుస్తారు. ఇరవై రెండేళ్లుగా స్థానికులకు అతడు నమ్మకమైన పనిమంతుడు. నలభై ఏళ్ల మనిషి. చురుగ్గా, యువకుడిలా ఉంటాడు. ఈ వయసుకే తాత కూడా అయ్యాడు. (పెద్దమ్మాయికి కొడుకు). కూతుళ్లు నలుగుర్నీ ఊళ్లోనే చదివించాడు. వాళ్ల పోషణ, చదువుల కోసం ఇక్కడ సంపాదించి అక్కడికి పంపడం అతడికి అనువుగా ఉండేది. రోజంతా కష్టపడేవాడు. ఎప్పుడూ కూతుళ్లను ప్రయోజకుల్ని చేయాలన్న ధ్యాసే. పాలమ్‌ విహార్‌లో చదివిస్తే ఢిల్లీ దగ్గరగా ఉంటుందనీ, మంచి మంచి అవకాశాలు ఉంటాయనీ అనుకున్నాడు కానీ, ధైర్యం చేయలేకపోయాడు. వేల ఫీజులతో పని. 

షెకా ఉల్హక్‌ నలుగురు కూతుళ్లు, భార్య, బంధువుల అమ్మాయి (ఫైల్‌ ఫొటో)

కూతుళ్ల  చదువుల మీద ఈ తండ్రి అంతగా పట్టుపట్టి ఉండటానికి తగిన కారణాలే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని వాళ్ల ఇళ్లల్లో తరాలుగా ఆడవాళ్లెవరూ చదువుకున్నది లేదు. షెకా ఉల్హక్‌ తల్లి మర్జీనా బీబీ నిరక్షరాస్యురాలు. అతడి ఏకైక సోదరి ఇష్‌నా 8వ తరగతి వరకే చదువుకుంది. భార్య బహ్రున్‌ బీబీ 3వ తరగతి. వాళ్లందరి కన్నా తన కూతుళ్లను ఎక్కువ చదివించాలనుకున్నాడు షెకా ఉల్హక్‌. అయితే అది ఆ కుటుంబం లోని పెద్దవాళ్లకు నచ్చలేదు. ‘‘ముందు పెళ్లిసంగతి చూడు. నీ కూతుళ్లకు చదువు లేకపోతే నిన్ను ఎవరొచ్చి అడిగారు?’’ అన్నారు.

అలా పెద్దకూతురు షహనాజ్‌ 9వ తరగతిలో బడి మానేయవలసి వచ్చింది. రెండో కూతురు మసూమ్‌ ఇంటర్‌లో డిస్‌కంటిన్యూ అయింది. వాళ్లిద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మిగతా ఇద్దరి కూతుళ్ల చదువు, ఉపాధి గురించి ఆలోచిస్తున్నాడు షెకా ఉల్హక్‌. టెన్త్‌ అయ్యాక కాలేజ్‌లో చేరాలా లేక కంప్యూటర్స్‌తో ఏదైనా చిన్న కోర్సు చేయాలా అనేది మూడో కూతురు ముంతాజ్‌ ఇంకా తేల్చుకోలేదు. డ్యాన్స్‌ కోచింగ్‌కి వెళ్లాలని చిన్న కూతురు సోనమ్‌ నిర్ణయించుకుంది. ఫిబ్రవరిలో పెళ్లికి వచ్చిన నలుగురు కూతుళ్లు లాక్‌డౌన్‌తో ఇప్పుడు తండ్రితోనే ఉన్నారు. పెద్ద కూతుళ్లిద్దరికీ పట్టుపట్టి టైలరింగ్‌ కూడా నేర్పించాడు షెకా ఉల్హక్‌. అది వాళ్లకు జీవనోపాధిగా పనికొస్తోంది. ‘‘పెళ్లయ్యాక దాంపత్యంలో ఒడిదుడుకులు వస్తే చేతిలోని విద్యే కదా ఆడపిల్లకు తోడుగా ఉంటుంది’’ అంటాడు అతను.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా