మోక్ష జ్ఞాన దీపాలు

27 Oct, 2019 03:58 IST|Sakshi

నేడు దీపావళి

ఆ రోజు ఆశ్వీయుజ బహుళ చతుర్దశి, నరకచతుర్దశి అని అమ్మ పార్వతీదేవి త్వరత్వరగా కుమారులిద్దరిని లేపి ఇద్దరికి తైలాభ్యంగన స్నానం చేయించడానికి సన్నద్ధమైంది. వాళ్ళిద్దరి శిరస్సులమీద తైలం పెట్టి విభూతితో నలుగు పెట్టి స్నానం చేయించి గణేశునికి ధవళవర్ణపు వస్త్రాలు, స్కందునికి ఎరుపురంగు వస్త్రాలు తొడిగింది. నంది, భృంగి ఇత్యాది గణాలన్ని రేపు దీపావళి అమావాస్య పండగకి కైలాస శిఖరాన్ని దీపాలతో ఎలా అలంకరించాలా అని తర్కించుకుంటున్నారు. ఇదిలా ఉండగా వైకుంఠంలో శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మి తో ‘‘కృష్ణావతారంలో నువ్వు నరకుడిని సంహరించిన రోజు గుర్తుందా సత్య! అని అడిగాడు. ‘సత్య’ అన్న ఆ పిలుపు వినగానే ఆనంద పరవశురాలైన మహాలక్ష్మి ‘‘అవును స్వామీ! మీరు నన్ను కదనరంగంలోకి పంపిన రోజు కదా! వనితలు దేనిలోను తీసిపోరని చూపడానికే అలా చేశాను’’ అంటూ అలనాటి జ్ఞాపకాలతో మైమరపులోకి వెళ్లింది. ఆనందంగా నారాయణుడు ఆమెని దగ్గరకి తీసుకుంటుండగా ‘‘స్వామీ! మర్చేపోయాను, మనం వైకుంఠమంతా దీపాలు వెలిగించాలి’’ అని ఆమె పతిదేవునితో అంటుండగా ఆ మాటలు చెవిన పడిన క్షణంలోనే వైనతేయుడు ఆ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమయ్యాడు.

భూలోకంలో మానవులు చక్కగా రకరకాలుగా దీపావళి జరుపుకుంటారని తెలిసిన దేవతలు వాళ్ళ అదృష్టానికి సంబరపడుతూ మన ఇంద్ర లోకంలో కూడా దీపావళిని జరుపుకోవాలని మహేంద్రుణ్ణి కలిసి విన్నవించుకున్నారు. ఆ ప్రతిపాదనకి దేవేంద్రుడు సమ్మతించి, మనం కూడా ఈ పండుగ జరుపుకుందామని అష్టదిక్పాలకులని, కిన్నెర, కింపురుషాదులని సమావేశ పరిచి ఐలాపురమంతా దీపాలు వెలిగించమని ఆనతిచ్చాడు. అలాగే నలమహారాజు చేత మధురమైన భక్ష్య భోజ్యాలు వండించి అమ్మ లక్ష్మీదేవికి పూజ చేసి, దీపాలు పెద్ద ఎత్తున వెలిగించడానికి తన పరివారాన్ని సిద్ధం చేసుకున్నాడు.
అమావాస్య చీకట్లు ముసురుకుంటున్నాయి. అటు ఇంద్రలోకంలో దేవతలు, ఇటు భూలోకంలో మానవులు తారతమ్యాలు లే కుండా అమ్మ మహాలక్ష్మిని పూజించి ధూప దీపాలు వెలిగించి చక్కని మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు.

కైలాసంలో పార్వతీదేవి వైశ్వానరుడు, స్వాహాదేవి సాయంతో తన ఇంటిలో అందరికి సరిపడా వండించిన భక్ష్య భోజ్య నైవేద్యాలన్ని శ్రీ మహాలక్ష్మి నారాయణులకి నైవేద్యంగా సమర్పించిందిట. ముసురుకుంటున్న చీకటిని పారద్రోలడానికి దీపాలు వెలిగించడం మొదలు పెట్టడానికి ముందుగా పిల్లలిద్దరిచేత పార్వతీ పరమేశ్వరులిద్దరు, గోగుకాడలకి తైలపు వస్త్రాలని కట్టి ‘దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి‘ అని దివిటీ కొట్టించారు. నాగుల చవితి అనగానే శివుని మెడలోని మహా సర్పం వాసుకి, మిగిలిన ఆభరణాలైన నాగులన్ని ఆనందంగా తలలూపాయి. ఆ క్షణం సుబ్రహ్మణ్యుని మోము తేజోమయమైంది. ‘‘నీ పుట్టినరోజు వచ్చే షష్ఠికే కదూ! ’’ అని గణపతి గుర్తు చేయడంతోటే స్కందుడు ఆనందంగా ‘‘అవును అగ్రజా!’’ అని ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆదిదంపతులు ఆ అన్నదమ్ముల ప్రేమకి ఆనంద పడ్డారు.

ఈలోగా అమ్మ పార్వతీమాత ప్రమిదలనిండా తైలం పోసి వర్తులు వేసి మహాలక్ష్మిని ప్రార్థించగానే ఆ తైలంలోకి లక్ష్మీదేవి ప్రవేశించింది. ‘దీపం జ్యోతి పరఃబ్రహ్మ దీపం సర్వ తమోపహం! దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే’ అనగానే కైలాసమంతా కోటిదీపాలకాంతితో ప్రకాశమానమైంది. వెండికొండ స్వర్ణమయమైంది. పరమశివుడు, గణనాథుడు, స్కందుడు, నంది, శృంగి, భృంగి, మిగిలిన పరివార గణాలు అందరూ కూడా తలో దీపం వెలిగించి నమస్కరించారు. గంగమ్మ మటుకు పరంజ్యోతి లోనే జ్యోతి దర్శనం చేసుకుంది.  వైకుంఠం, అలకాపురి, సత్యలోకం దీపాల కాంతులతో మెరిసిపోయింది. భువిపై వెలిగించిన దీపాలకాంతి దివి అంతా పరచుకుని చీకటిని పారద్రోలింది. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, చతుర్ముఖుడు, సరస్వతి దంపతులు దివ్యసందేశమిచ్చారు.

‘మానవులైనా, దేవతలైనా సాయం సంధ్యా సమయంలో నువ్వులనూనెతో ఇల్లంతా దీపాలు వెలిగించిన వారికి దీపాన్ని లక్ష్మీస్వరూపంగా భావించి పూజలు చేసినవారికి దీపపు వెలుగుతో దారిద్య్రం, దుఃఖాలు, కష్టాలు వంటివి దూరంగా తొలగిపోతాయి అని వివరించగానే ముల్లోకాలు ఆనందంగా దీపావళి పండుగ జరుపుకున్నారు.
– చాగంటి ప్రసాద్‌

దీపావళి నాడు ఆచరించవలసినవి...
ఈ రోజున తెల్లవారు జామున్నే పెద్దల చేత తలకి నువ్వుల నూనె పెట్టించుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల ఆకులను లేదా మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈరోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం.  దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీ పూజ చేయాలి. కాగా కొన్ని ప్రాంతాల్లో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళ ఉంచిపోతుందట. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రంగా చేసి, లక్ష్మీదేవి రావాలని కోరుతూ ఇంటిని అలంకరించాలి.

శాస్త్రీయ కారణం 
దీపావళినాడు టపాసులు పేల్చడం వెనుక కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు భూమి నుంచి పుట్టే వివిధ రకాలైన క్రిమికీటకాలు రోగాలను కలిస్తాయి. దీపావళి నాటి రాత్రి కాల్చే మందుగుండు సామగ్రి నుంచి వెలువడే పొగ, వాసన ఈ కాలంలో వ్యాపించే దోమలను, క్రిములను హరింపజే స్తాయి. అలాగని మరీ ఎక్కువగా కాలిస్తే, ఆ పొగ మనకూ హాని చేస్తుంది, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది.

దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? 
దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో, తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ఆకాశదీపం (దేవాలయాల్లో అయితే ధ్వజస్తంభానికి వెలిగిస్తారు, మనం ఇళ్ళ పైకప్పు మీద పెట్టాలి), నదుల్లోనూ, చెరువుల్లోనూ దీపాలను వదలాలి. ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం.  చీకటిపడే సమయంలో దీపదానం చేసి, మండుతున్న గోగు కాడలని తిప్పాలి.

ఇలా తిప్పడం చేత పీడ పొతుందని చెప్తారు. నిజానికి దీపావళి కొంత వరకు పితృదేవతలకు సంబంధించిన పండుగ. దీపావళినాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతసిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం. తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీపూజ చేయాలి. ఆకులతో దొన్నెలు కుట్టి, దీపాలు వెలిగించి, నదుల్లోనూ, చెరువుల్లోనూ, సరోవరాల్లోనూ, బావుల్లోనూ వదలాలి. దీపావళిఅర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతోకొడుతూ, తప్పెట్ల చప్పుళ్లతోనూ, డిండిమం అనే వాయిద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠాలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని శాస్త్రవచనం.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు