కొండపైన దర్శనం...లోయల్లో సేవా సాఫల్యం...

27 Oct, 2019 04:08 IST|Sakshi

సువార్త

యేసుప్రభువు గలిలయ సముద్ర తీరంలోని ఒక కొండ పైన  చేసిన ప్రసంగంలో మానవాళికి ‘పరలోక ధన్యత’ను ప్రకటించాడు. పేదరికం, శ్రమలు, లేమి, ఆకలిదప్పుల వంటి ఎలాంటి సామాజిక అపశ్రుతులకు, ప్రతికూలతలకూ తావులేని ‘దేవుని రాజ్యాన్ని ‘తన కొండ మీది ప్రసంగం’ ద్వారా ఆవిష్కరించాడు. అక్కడినుండి ఆరంభమై, మరో కొండయైన గొల్గొతాపై జరుగనున్న తన సిలువ యాగం దాకా సాగనున్న‘మానవాళి రక్షణ మార్గ ప్రయాణం’లో మజిలీగా శిష్యుల్లో పేతురు, యాకోబు, యోహాను అనే ముగ్గురిని వెంటతీసుకొని రూపాంతర కొండగా పిలిచే మరో కొండకు యేసుప్రభువు వెళ్ళాడు. అక్కడ యేసుప్రభువు ఆ ముగ్గురికీ తన పరలోక మహిమ రూపాన్ని చూపించాడు. పాత నిబంధన నాటి మోషే, ఏలీయా కూడా కొండ మీదికి దిగి రాగా అక్కడ యేసుప్రభువుతో వారి ‘శిఖరాగ్ర సమావేశం’ జరిగింది.

అయితే యేసుప్రభువు, మోషే, ఏలీయాలు పాల్గొన్న అత్యంత ప్రాముఖ్యమైన ఆ ఆధ్యాత్మిక శిఖరాగ్ర సమావేశానికి దేవుడు పేతురు, యాకోబు, యోహానులనే అల్ప మానవులను కూడా పిలవడమే ఆశ్చర్యం కలిగించే అంశం. యేసు దేవస్వరూపుడు, మోషే ధర్మశాస్త్ర యుగానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి కాగా, మరి పేతురు, యాకోబు, యోహాను ఎవరికి ప్రతినిధులు? యేసుప్రభువు తన సిలువ యాగం ద్వారా ఆవిష్కరించబోతున్న సరికొత్త దేవుని రాజ్యంలో సభ్యులుగా చేరబోతున్న విశ్వాసులందరికీ ఆనాడు వాళ్ళు ప్రతినిధులు. ఆ శిఖరాగ్ర సమావేశంలో ‘ఇక్కడే ఉండిపోవడానికి పర్ణశాలలు కడతానంటూ’ పేతురు చేసిన వ్యాఖ్యను, ‘ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి’ అంటూ ఈ సమావేశాన్ని నిర్వహించిన పరిశుద్ధాత్ముడు వారినుద్దేశించి ఇచ్చిన ఆజ్ఞను  సువార్త భాగాలు ప్రస్తావించాయి.

లోక మలినానికి దూరంగా ఉన్నహిమాలయాలతో సహా మహా పర్వతాల్ని ఆధ్యాత్మిక స్థావరాలుగా అన్ని మతాల్లాగే యూదు మతం కూడా పరిగణించేది. గొప్ప ఆధ్యాత్మిక దర్శనాలను దేవుడు తన ప్రజలకు కొండ పైన ఇస్తాడు. కానీ ఆ దర్శనాల నెరవేర్పు కోసం‘సేవా క్షేత్రాలను’ మాత్రం కొండ కింది లోయల్లోని సామాన్య ప్రజల సమక్షంలో చూపిస్తాడు. ’కొండ మీదే ఉండిపోదాం’ అని ఎవరికి, మాత్రం ఉండదు? పేతురుకు కూడా అలాగే అనిపించింది, కానీ ‘దర్శన సాఫల్యం’ మాత్రం లోయల్లోని పాపులు, కరడు గట్టిన నేరగాళ్లు, దుర్మార్గులకు దేవుని ప్రేమను ప్రకటించడంలో ఉందని, అందుకు యేసు మాట వినండని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. దేవుని పక్షంగా మాట్లాడటం అంటే ప్రసంగించడం అందరికీ ఇష్టమే, కానీ దేవుని మాటలు వినడమే చాలా కష్టం.

కానీ యేసు తన తండ్రి మాటలు విని, లోబడి లోయల్లోకి దిగి వెళ్లి వారిని ప్రేమించి ప్రాణత్యాగం చేశాడు. పేతురు, యాకోబు, యోహాను కూడా భూదిగంతాలకు వెళ్లి దేవుని ప్రేమను ప్రకటించి హత సాక్షులై తమ దర్శనసాఫల్యం పొందారు. అలా లోయల్లోని గొంగళిపురుగులను తమ అద్భుతమైన పరిచర్యతో విశ్వాస పరివర్తన చెందిన సీతాకోక చిలుకలుగా మార్చడానికి ఆనాటి రూపాంతర పర్వత శిఖరాగ్ర సమావేశం దిశానిర్దేశం చేసింది. కేవలం యూదులకే అంతవరకూ పరిమితమైన విశ్వాస జీవితం, నాటి రూపాంతరానుభవపు సార్వత్రిక దర్శనంతో, సర్వలోకానికి వర్తించే అపూర్వ ప్రేమమార్గమైంది. స్వనీతి, తామే జ్ఞానులం, తామే అధికులమన్న అహంకారానికి ప్రతీకగా మారిన యూదులు అనే గొంగళిపురుగు నుండే, సాత్వికత్వం, ప్రేమ, క్షమా అనే ఆత్మీయ సౌందర్యానికి ప్రతీకగా ‘క్రైస్తవం’ ఆవిర్భవించింది.
– రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్‌
సంపాదకులు, ఆకాశధాన్యం

ఇ–మెయిల్‌: prabhukirant.@gmail.com

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా