చిలిపి కోతి

29 Dec, 2019 04:31 IST|Sakshi

వియోగి

అనగనగా ఒక గ్రామంలో ఒక చిల్లరి చిలిపి కోతి ఉండేది. దానికి ఉత్సాహం ఎక్కువ. పచ్చని చెట్ల మీద మంచి మంచి జామకాయలు, మామిడిపండ్లు.. ఇలా అన్నీ మేసి గర్వం పెంచుకుంది. కొత్త కోతులు వస్తే.. ‘ఈ తోట నాది. మీరెవరూ వీటిని తినకూడదు’ అని బెదిరించేది. కొన్ని పిరికి కోతులు భయపడి పారిపోయేవి. మరికొన్ని కోతులైతే.. అది చూడకుండా దొంగలించేవి. ఇదంతా జరిగింది తోటమాలికి ఆరోగ్యం బాలేనప్పుడు. తిరిగి అతడు పనిలోకి దిగినప్పుడు.. ఈ అల్లరి కోతి అల్లరిని గుర్తించాడు. తను తినడమే కాకుండా.. పిందెలను తెంచి, కొమ్ములను విరిచి అల్లరి చేసేది. అదంతా చూసి... ‘దీని ఆగడాలు ఎక్కువయ్యాయి’ అనుకున్నాడు తోటమాలి.

ఒకరోజు జంతువులను బంధించే పంజరాన్ని తెచ్చి ఒక చెట్టు కింద పెట్టాడు. ఆ పంజరంలో రకరకాల పండ్లు పెట్టి, పంజరం తలుపు తెరిచి ఉంచాడు. ఆ అల్లరి కోతి.. ఆ పంజరంలోని రంగురంగుల పండ్లను చూసింది. దానికి ఏం అర్థం కాలేదు. పండ్లు అయితే ఎర్రగా బుర్రగా ఉన్నాయనుకుంది. అటూ ఇటూ చూసి, నెమ్మదిగా చెట్టు దిగింది. ఎవరూ రావడం లేదని నిర్ధారించుకుని, ధైర్యం చేసి ఒక్క దూకు దూకి పంజరంలోకి ప్రవేశించి.. పండ్లు తినడం ఆరంభించింది.

ఇదే అదను అనుకుని తోటమాలి.. తన చేతిలో ఉన్న తాడుని వదిలిపెట్టాడు. అది పైనుంచి కిందకు పడి పంజరం తలుపు మూసుకుపోయింది. ఆ శబ్దానికి అదిరిపడిన కోతి బిత్తరపోయి.. తత్తరపాటుతో.. బయటకు పోదామని ప్రయత్నించింది. తన బలమంతా ఉపయోగించి ఇనుప చువ్వలను గుంజింది. కొరికింది. సాధ్యపడలేదు. కోతికి తను బంధించబడ్డానని అప్పటికే అర్థమైంది.
ఇంతలో చెట్టు చాటు నుంచి తోటమాలి నవ్వుతూ బయటకు వచ్చాడు. కోతిని చూసి వెక్కిరించాడు. ‘ఉండు నీ పని చెప్తాను. నా తోటని పాడుచేస్తావా? నిన్ను జంతు ప్రదర్శన వాళ్లకు అప్పగిస్తాను. నీ కాళ్లు చేతులు కట్టేసి, రోజు కొడుతూ ఆడిస్తారు’ అంటూ వాళ్లని తీసుకురావడానికి వెళ్తాడు. కోతికి ముచ్చెమటలు పట్టాయి. ‘ఒకసారి అది మనిషి ఆడిస్తున్న కోతిని చూసింది. అది బాగా చిక్కిపోయి, దెబ్బలు తింటూ.. అతను చెప్పినట్లు చేస్తూ ఉంది. ‘ఇదేం బానిస బతుకు?’ అని కూడా తిట్టుకుంది. ఇక తన బతుకు అంతేనా?’ అని విచారించింది. 

ఇంతలో కొన్ని కోతులు చెట్ల మీదకు వచ్చాయి. ఆనందంగా పండ్లు తినసాగాయి. ఆ చిలిపి కోతి పంజరంలోంచి వాటిని గుర్తించింది. అంతకు ముందు వాటిని తరిమికొట్టింది. ఇప్పుడు నిర్భయంగా తన చెట్ల పండ్లు తింటున్నాయి. ‘ఎంత కండ కావరం?’ అనుకుంటుంది మనసులో. దానికి బాగా కోపం వచ్చింది. పంజరం నుంచి అరిచి చెప్పింది. ‘అవి నా చెట్లు, పండ్లు.. మీకు తినడానికి హక్కు లేదు, మర్యాదగా పారిపొండి’ అంటుంది. ఆ చెట్టు మీద కోతులన్నీ కిందకి చూస్తాయి. అల్లరి కోతి పంజరంలో బంధించబడి చిందులు తొక్కుతోంది. చెట్టు పైనున్న ఓ పండు కోతి.. కోపంగా సమాధానం చెప్పింది. ‘ఏంటి ఈ చెట్లు నీవా? ఈ పండ్లు నీవా? మేము తినకూడదా? ఎట్లా? నువ్వు విత్తనం నాటి, నీరుపోసి చెట్లని పెంచావా? కాయలు కాయించావా? పండించావా? ఇవన్నీ దేవుడు సృష్టించినవి. అందరూ తినొచ్చు. వీటి మీద అందరికీ హక్కు ఉంది’ అంటుంది. దాంతో అల్లరి కోతికి మరింత కోపం వస్తుంది.

‘అది ఎట్లా? ఈ తోటకు ముందుగా వచ్చింది నేను కదా? కాబట్టి అవన్నీ నాకే చెందుతాయి’ అని అల్లరి కోతి అహంకారంతో అరుస్తుంది. ‘ముందు, వెనుకల గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఈ తోటలో సమృద్ధిగా పండ్లు ఉన్నాయి. మనమందరం కలిపి తిన్నా మిగులుతాయి కూడా. ఒక వేళ అన్నీ తినాలనుకున్నా.. నీ పొట్ట పగిలి చస్తావ్‌..! పైగా మనందరిదీ ఒకటే జాతి. మనలో మనకు ఎందుకు గొడవ? ఎందుకు నీకు ఈ అసూయ? గమ్మునుండు!’ అని ఇంకో ముసలి కోతి అల్లరి కోతికి చివాట్లు పెట్టింది. అయినా ఆ అల్లరి కోతి ఏమాత్రం తగ్గదు. ‘నా సంగతి మీకు తెలియదు. మీ అదృష్టం బాగుండి.. నేను ఈ పంజరంలో విశ్రాంతి తీసుకుంటున్నాను. మర్యాదగా వచ్చిన దారినే అంతా పొండి’ అని ఉత్తుత్తి ప్రగల్భాలు పలుకుతుంది.

‘అన్నా! ఎందుకు ఆవేశపెడతావు? ముందు నువ్వు ఆ పంజరం నుంచి బయటపడే మార్గం ఆలోచించుకో! తర్వాత తోటమాలి వస్తే.. నీకు ఇక బానిస బతికే’ అని ఒక కుర్ర కోతి సలహా ఇచ్చింది. దాంతో అల్లరి కోతి బుర్ర తిరిగిపోయింది. ‘నిజమే కదా ముందు నా బతుకు గురించి ఆలోచించకుండా.. చెట్ల గురించి, ఇతర కోతుల గురించి ఆలోచిస్తున్నాను’ అని తనలో తనే మథన పడింది. ‘తమ్ముడు! ఆలస్యం.. అమృతం.. విషం.. అంటారు. తొందరగా బయటపడు. సమయం మించిపోతోంది’ నడివయసు కోతి చెప్పింది. చిలిపి కోతికి బుద్ధి వచ్చింది. రెండు కళ్ళు జోడించి నమస్కరిస్తూ.. ఇలా పలికింది. ‘అయ్యలారా.. నన్ను క్షమించండి! దేవుడు ఇచ్చిన ఫలాలపైన పెత్తనం తగదని గ్రహించాను. నన్ను ఎలాగైనా బయటకు తీయండి’ అంటూ లెంపలు వేసుకుంటుంది.

దాంతో ముసలి కోతి జాలిపడి.. మిగతా కోతులను సాయం చేయడానికి ఒప్పించింది. అన్ని కలిసి పంజరం చుట్టూ తిరిగాయి. పంజరం తలుపును గుర్తించాయి. దానికి కట్టిన తాడును పట్టుకుని లాగమని సలహా ఇచ్చింది ముసలి కోతి. కోతులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రయత్నించి.. విఫలమయ్యాయి. చివరికి ముసలి కోతి ఇలా చెప్పింది. ‘ఒకరు చేయలేని పనిని.. అందరూ కలిసి చేస్తే అవుతుంది. అంతా కలిసి తాడుని లాగుదాం’ అంది. వెంటనే అన్ని కోతులు కలిసి.. తాడును లాక్కు పోయాయి. ఆ మూకుమ్మడి బలానికి ఇనుప తలుపు తెరుచుకుంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న అల్లరి కోతి.. ఒక్క ఉదుటన బయటపడి ‘బ్రతుకు జీవుడా’ అనుకుంది. వెంటనే ముసలి కోతి దగ్గరకు పోయి, కాళ్ళ మీద పడింది. 

దాంతో ముసలి కోతి దానికి నీతి బోధించింది. ‘ఎప్పుడూ ఒంటరితనం కోరుకోకూడదు. తానొక్కడే బాగుండాలని కోరుకోకూడదు. తనతో పాటు ఇతరులను కూడా బాగుండాలని కోరుకోవాలి. ఒంటరిగా ఉండేవారికి అన్నీ కష్టాలే వస్తాయి. అందరినీ కలుపుకుని, అందరితో మంచిగా ఉండేవారికి కష్టం తెలియదు. మందితో తిరిగినప్పుడే అనుభవం వస్తుంది. మంచితనం పెరుగుతుంది’ అని హితభోద చేసింది. దాంతో అల్లరి కోతి అప్పటినుంచి.. అల్లరి మానేసింది. చిల్లరి పనులు వదిలేసింది.

మరిన్ని వార్తలు