పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న పాఠమా

10 Apr, 2018 00:02 IST|Sakshi
‘మహాబోధి విద్యాలయ’ సిబ్బంది

ప్రతి పొద్దూ ఇలా ఉండాలి. కాంతిమంతంగా.అజ్ఞానాన్ని పారద్రోలేలా. ధనిక, పేద.. అందరికీ.. ‘వెన్నెల’ సమానం అనేలా!

సికింద్రాబాద్‌ ఆల్వాల్‌లోని వెంకటాపురంలో ఉంది ఆ పాఠశాల. పాఠశాల బయట బోర్డుపై బోధివృక్షం, దానికి పైగా అర్ధచంద్రాకారంలో ‘మహాబోధి విద్యాలయ’ అనే పేరు, దాని కింద స్కూల్‌ని స్థాపించిన సంవత్సరం (1992) ఉంటుంది.బోధివృక్షం ఆ పాఠశాల గుర్తు. అంబేడ్కర్‌ విద్యానికేతన్‌ ట్రస్ట్‌ ఆ పాఠశాలను నడుపుతోంది. సమాజంలో మహిళ స్థానం ఎలా ఉండాలని అంబేడ్కర్‌ ఆశించారో ఆ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్న ప్రయత్నం కనిపిస్తుంటుంది మహాబోధి విద్యాలయలో. అంబేడ్కర్‌ ఒక సందర్భంలో ‘ఒక సమాజాన్ని అంచనా వేయాలంటే ముందుగా ఆ సమాజంలో మహిళలు సాధించిన అభ్యున్నతిని చూడాలి. వారి పురోగమనం మీదనే సమాజం అభివృద్ధి ఆధారపడి ఉంటుంది’ అన్నారు. అందుకు అనుగుణంగానే ఇక్కడ బోధన జరుగుతోంది.  ఈ పాఠశాలలో బోధనా సిబ్బంది అంతా మహిళలే. మొత్తం 27 మందిలో ప్రిన్సిపాల్, పిఈటీ టీచర్, వాచ్‌మన్‌... ఈ ముగ్గురు మాత్రమే మగవాళ్లు. మిగిలిన 24 మంది మహిళలే. 

సహనమూర్తులు కనుకనే
ఈ పాఠశాలలోని విద్యార్థులలో ఎక్కువ మంది అల్పాదాయ వర్గాల వాళ్లే. ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన కుటుంబ స్థితి. వీరిలో సింగిల్‌ పేరెంట్‌ సంరక్షణలో పెరుగుతున్న పిల్లలు కూడా ఉన్నారు. తండ్రి వేరే మహిళను పెళ్లి చేసుకోవడంతో తల్లి కష్టపడి పని చేసుకుని పిల్లల్ని పెంచుకుంటూ ఉంటుంది. అలాంటి ఇళ్లల్లో పరిపూర్ణమైన కుటుంబంలో ఉండే భరోసాపూరిత వాతావరణం ఉండదు. ఆ ప్రభావం పెరిగే పిల్లల మీద తప్పకుండా ఉంటుంది. అంచేత ఆ పిల్లలకు వాళ్ల ఇంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చదువు చెప్పాలి. ఒకవేళ ఒక విద్యార్థి హోమ్‌వర్క్‌ చేయకపోతే కారణాన్ని కనుక్కోవాలి. తల్లితోపాటు పనికి వెళ్లడం, నీళ్లు పట్టుకోవడానికి వెళ్లి ఆ పని పూర్తయ్యే సరికి కాలనీలో కరెంట్‌ పోవడం.. ఇలాంటివెన్నో కారణాలు ఉంటాయి. అవేవీ కాకపోతే ఆ రోజు రాత్రి వాళ్ల నాన్న మద్యం తాగి వచ్చి తల్లిని కొట్టడం, పిల్లల్ని కొట్టినంత పని చేసి బెదరగొట్టడం వంటిది జరిగి ఉంటుంది. అలాంటి పిల్లల్ని హోమ్‌వర్క్‌ చేయలేదనే కారణంగా కఠినంగా శిక్షిస్తే ఇక స్కూలుకి కూడా దూరమై, వీధుల్లో తిరగడానికి వెళ్లడమే కాకుండా, వాళ్ల వంటి పిల్లల్నే వెతుక్కుని ఆకతాయితనానికి అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. అలాంటివారు స్కూలుకి వెళ్లమని ఎంత ఒత్తిడి చేసినా వెళ్లనని మొండికేస్తారు, పద్నాలుగు, పదిహేనేళ్లు వచ్చేసరికి తల్లికి ఎదురు తిరగడం కూడా అలవాటవుతుంది. ఇన్ని ఉంటాయి. ‘‘వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చదువు చెప్పాలంటే అంత సహనం ఉండేది మహిళలకే’’ అంటారు స్కూలు నిర్వాహకురాలు వెన్నెల. 

మూడవ బిడ్డకు సగమే ఫీజు
‘‘సింగిల్‌ పేరెంట్‌ సంరక్షణలో ఉండే పిల్లలతోపాటు అమ్మమ్మ, నాయనమ్మ సంరక్షణలో ఉండే పిల్లలు కూడా ఉంటారు. వాళ్లకు ఎదురయ్యే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఆ సంగతి కూడా టీచర్‌కు తెలిసి ఉంటే విద్యార్థి పట్ల చూపించే ఆదరణ వేరుగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే టీచర్‌ తల్లిలా పిల్లల్ని గుండెల్లో పెట్టుకుని చదువు చెప్పాలి’’ అంటున్నారు వెన్నెల. ‘‘అలాగే ఇద్దరు పిల్లలను పెంచి, పోషించి, చదివించడానికి ఈ రోజుల్లో తల్లిదండ్రులు తలకిందులవుతున్నారు. అలాంటిది మూడవ బిడ్డను చదివించడమంటే వాళ్లు తలకు మించిన భారంగానే ఉంటుంది. దాంతో ముగ్గురిలో ఒకరిని చదువు మాన్పించి పనుల్లో పెట్టేస్తుంటారు. ముగ్గురిలో ఎవరో ఒకరు చదువును నష్టపోతుంటారిలా. అందుకే మూడవ బిడ్డకు ఫీజులో సగం రాయితీ ఇవ్వాలనుకున్నాం. ఈ రాయితీ వర్తించాలంటే మొదటి ఇద్దరినీ చదివిస్తూ ఉండాలి. పెద్దవాళ్లను చదువు మాన్పించి పనికి పంపిస్తున్న వాళ్లకు ఈ రాయితీ వర్తించదనే కండిషన్‌ కూడా పెట్టాం. 

బాలికలకు ప్రాధ్యానం
‘‘ఈ పాతికేళ్లలో పది వేలకు పైగా విద్యార్థులు మా స్కూల్లో పదవ తరగతి పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్లారు. వారిలో దాదాపు ఐదు వేల మంది బాలికలు ఉండడం మాకు గర్వంగా అనిపించే విషయం. మా స్టూడెంట్స్‌ ఇళ్లలో అబ్బాయిని స్కూలుకి పంపించి, అమ్మాయిని ఇంట్లో పనులకు ఆపిన కుటుంబం ఒక్కటీ లేకుండా చూడగలిగామనేది మహిళగా నాకు పెద్ద సంతృప్తి. మా నాన్న (విప్లవ గాయకుడు గద్దర్‌) ఈ స్కూల్‌ స్థాపించిన ఉద్దేశం నెరవేరుస్తున్నాననే సంతోషం కూడా. మా స్కూల్‌ స్టాఫ్‌ అంతా అదే భావాలతో పని చేస్తుండడంతోనే ఇది సాధ్యమైంది’’ అని వివరించారు వెన్నెల. ఆదర్శాన్ని వల్లించడం కాకుండా ఆచరణలో చూపిస్తోంది మహాబోధి విద్యాలయ. 

ఇంట్లో పరిస్థితులు సరిగా లేని పిల్లల్ని హోమ్‌వర్క్‌ చేయలేదనే కారణంగా కఠినంగా శిక్షిస్తే ఇక స్కూలుకి కూడా దూరమై,  ఆకతాయితనానికి అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వారిని చక్కదిద్ది దారిలో పెట్టే సహనం మహిళా టీచర్లకు మాత్రమే ఉంటుంది. 
– వెన్నెల, స్కూలు  నిర్వాహకురాలు
– వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

మరిన్ని వార్తలు