ఆకాశమంత

21 Nov, 2018 00:00 IST|Sakshi

సగం చాలదు... పూర్తి ఆకాశం కావాలి.యుద్ధానికి సకల ఆయుధాలు కావాలి.వాదనకు అన్ని అవకాశాలు ఉండాలి.ప్రతిఘటనకు సమస్త శక్తియుక్తులు కావాలి. పాలనలో స్త్రీకి స్థానం కావాలి.అణచివేత నుంచి ఒక కంఠం పైకి లేవాలి. సుజాత లాంటి అభ్యర్థికి స్వాగతం పలకాలి.

‘‘మేము చరిత్రను రాసేవాళ్లం కాదు.. చరిత్ర కన్న బిడ్డలం’’ అంటాడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌. అలాంటి చరిత్ర కన్న ఆడబిడ్డే సూరేపల్లి సుజాత. కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. పోరాటంలో ఉన్న వాళ్లకు, పోరాటాలను చూస్తున్న వాళ్లకు ఆమె సుపరిచితురాలు. మరెందుకు ఇప్పుడు ఈ ప్రత్యేక పరిచయం? మార్పు కోసం.. పర్సనల్‌ ఈజ్‌ పొలిటికల్‌ నినాదంతో తెలంగాణ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంనుంచి పోటీ చేస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్న శక్తికి సవాలుగా! అందుకే  ప్రొఫెసర్, ఉద్యమనేత సూరేపల్లి సుజాత ప్రస్తావన, చిన్న పరిచయం ఇక్కడ.. ఉద్యోగధర్మాన్ని ఎక్కడా తప్పకుండానే ప్రజాసమస్యల మీద ఉద్యమిస్తూనే ఉన్నారు. బలమైన ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నారు. అయినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది?మూడు దళిత్‌ ఇష్యూస్‌లో నేను ఇన్‌వాల్వ్‌ అయినందుకు నామీద కేసులు పెట్టారు. కత్తి మహేష్‌ నిర్బంధం మీద నేను మాట్లాడ్డం, కరీంనగర్‌లో చనిపోయిన దళిత స్టూడెంట్‌కు  న్యాయం జరగాలని కోరడం, సిరిసిల్లలో తండ్రీ కొడులు చనిపోతే  వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించడం. మంతెన మధుకర్‌ విషయం.. అన్నీ కారణమే.  మంతెన మధుకర్‌ కేస్‌ ఇంకా కోర్ట్‌లోనే ఉంది. దళిత, ఆదీవాసీ ప్రభుత్వ హయాంలోనే న్యాయం జరుగుతుందని అంబేద్కర్‌ ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమవుతోంది. నేను రాజకీయాల్లోకి రావడానికి ఇవన్నీ ప్రేరేపించాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలి. మోర్‌దాన్‌ డికేడ్‌ యాక్టివిస్ట్‌గా పనిచేస్తూనే ఉన్నా. కుల సమస్యల మీద మాట్లాడ్డానికి చాలా ఆర్గనైజేషన్స్‌కి, మహిళా ఆర్గనైజేషన్స్‌కీ రిజర్వేషన్స్‌ ఉన్నాయి. అంతెందుకు కుల సమస్యల మీద స్పందించడానికి ప్రజాప్రతినిధులే ముందుకురారు. ఇవన్నీ చూశాకే రాజకీయాలలోకి రావాలని నిర్ణయించుకున్నాను. 
     
ప్రస్తుత రాజకీయాల్లో ఆడవాళ్ల పరిస్థితి...
ఆడవాళ్లు రాజకీయాల్లోకి రావడమే ఒక ఉద్యమం అనిపిస్తోంది. మహిళకూ డబ్బు.. బ్యాక్‌గ్రౌండ్‌ (సామాజిక వర్గం, రాజకీయ కుటుంబ నేపథ్యం) తప్పడం లేదు. న్యాయం, నిజాయితీతో టికెట్‌ వచ్చే ప్రసక్తే లేదు. నా విషయంలోనూ సామాజిక వర్గం.. కోట్లు లేకపోవడం.. అన్నీ నాకు సవాళ్లే. నాకున్న ఉద్యమ నేపథ్యం, అవగాహనతో ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా.  నిజానికి సవాళ్లు నాకు కొత్తకాదు. కాబట్టి భయపడేది లేదు. 
     
జనరల్‌లో, ఇండిపెండెంట్‌గా కాక ఒక పార్టీ నుంచి ఎందుకు పోటీ?
జనరల్‌లోనే వేయాలని నేనూ అనుకున్నా. కొన్ని  కారణాల వల్ల కుదరలేదు. మహిళా నేతృత్వం, బహుజన సిద్ధాంతం వల్ల బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) వైపు వచ్చా. నా ఆలోచనలు ఈ  సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నాయి. నా లక్ష్య సాధనకూ ఆ పార్టీలో అయితేనే స్పేస్, సపోర్ట్‌ ఉంటుందని అనుకున్నా. పార్టీ నన్ను ఎంకరేజ్‌ చేసింది. ఇక చెన్నూరే ఎందుకు ఎంచుకున్నానంటే.. ఈ ఊరితో నాకు అంతకుముందు నుంచే  అనుబంధం. ఇక్కడి ఇష్యూస్‌ మీద అవగాహన, పోరాడిన అనుభవం ఉంది. కులం, ఓపెన్‌ కాస్ట్‌ ఇక్కడున్న పెద్ద సమస్యలు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ల అవుతున్నా ఈ ఊళ్లో హాస్పిటల్‌ లేదు, కాలేజ్‌ లేదు. మహిళలు, విడోస్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతం. అన్నీ కోల్పోయినా కూడా ఈ ప్రాంతం ప్రజలు ఒక చైతన్యంతో ఉద్యమాలు నడిపించారు.  

లక్ష్యాలు...
పేదరికం, వెనకబాటు ఉన్న చోట విపరీతమైన దుష్ప్రభావం ఉంటుంది. మార్పు కోసమే రాజకీయపోరాటానికి దిగాను. ‘పర్సనల్‌ ఈజ్‌ పొలిటికల్‌’ నా నినాదం. ప్రధాన దృష్టి యువత ఉపాధి మీదనే. యువత అంటే మగపిల్లలే కాదు. ఆడ, మగపిల్లలు కలిపి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం. అందుకే స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ ఉపాధి కల్పన, విధ్వంసం లేని ఎన్విరాన్‌మెంట్‌ ఫ్రెండ్లీ అభివృద్ధి కావాలి. వెనకబాటు తనానికి ప్రధాన కారణం చదువులేకపోవడమే. సో.. అందరికీ విద్య.. ఒక్కమాటలో చెప్పాలంటే  ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించే ప్రయత్నం జరగాలి. ఆడవాళ్లు ప్రభుత్వ పథకాల్లో బెనిఫియరీస్‌గా కాదు.. ఈక్వల్‌ సిటిజన్స్‌గా గుర్తింపు పొందాలి. అన్నిరంగాల్లో వాళ్లకు సమానమైన ప్రాతినిధ్యం అందాలి. 

ఎన్నికల ప్రయాణం ఎలా సాగుతోంది?
స్త్రీలు.. అందునా ఒంటరి స్త్రీలు అంటే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? నా క్యాస్ట్, నేపథ్యం అన్నిటితో ఆల్రెడీ నా మీద దాడులు మొదలయ్యాయి. నేను నాన్‌లోకల్‌నని, డబ్బులు తీసుకుని తప్పుకున్నాననే ప్రచారమూ చేస్తున్నారు. మహిళా జాక్‌కు ఫౌండర్‌గా, తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమించినప్పుడు ఎందుకు ఈ డౌట్‌ రాలేదు? నా స్థానికతను అప్పుడెందుకు ప్రశ్నించలేదు? ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజాసమస్యల మీద పోరాడిన, పోరాడుతున్న స్త్రీలందరూ నాకు ఆదర్శం. వాళ్లముందు నేనెంత? అనిపిస్తుంటుంది.  వాళ్లే నాకు ప్రేరణ. దళిత జీవితాలు నాకు ఇన్సిపిరేషన్‌. ‘‘డ్రీమ్‌ ఈజ్‌ నాట్‌ దట్‌ విచ్‌ యు సీ వైల్‌ స్లీపింగ్‌ ఇట్‌ ఈజ్‌ సమ్‌థింగ్‌ దట్‌ డజ్‌ నాట్‌ లెట్‌ యూ స్లీప్‌’’ అన్న అబ్దుల్‌ కలామ్‌ మాట నా బాట.  

మద్దతు?
థాంక్స్‌ టు సోషల్‌ మీడియా పర్‌ ఎవ్రీ థింగ్‌. ట్రోల్‌ చేసింది. ట్రెమండస్‌ సపోర్ట్‌నూ ఇస్తోంది. నేను ఏ సమస్య మీద స్పందించినా ముందునుంచి సామాజిక మాధ్యమం చాలా మద్దతుగా నిలిచింది. ఇప్పుడైతే వలంటీర్స్‌ గ్రూప్స్‌గా ఏర్పడి ప్రచారం చేస్తున్నారు, స్లోగన్స్, బ్యానర్స్, పోస్టర్స్, వెహికిల్స్‌.. ఇలా ఎవరికి ఏది వీలైతే అది చేస్తున్నారు. డబ్బు రాజకీయాలతో పోటీ పడలేని నాకు.. ఈ సోషల్‌ మీడియానే మంచి ప్లాట్‌ఫామ్‌ అయింది. అలాగే నా ఫ్రెండ్స్‌ కాంట్రిబ్యూషన్‌ కూడా. మొదటి నుంచీ నా వెన్నంటి ఉన్న ఫాదర్‌ ఫిగర్‌ ఊసాగారు (యు.సాంబశివరావు) అందరూ నా విజయం కోసం కష్టపడుతున్నారు. గెలుపుని కాంక్షిస్తున్నారు. 
   
ఫ్యామిలీ...
స్వస్థలం సూర్యాపేట్‌. చదువుకుంది హైదరాబాద్‌లో. అమ్మ వరలక్ష్మి. హౌజ్‌వైఫ్‌. అమ్మ లేకపోతే ఈ రోజు నేను లేను. ధైర్యంగా ఉండడం ఆమె నుంచే నేర్చుకున్నాను. ఇద్దరు అన్నయ్యలు. నాన్న సూరేపల్లి కృష్ణయ్య .. ఎక్సైజ్‌ ఆఫీసర్‌గా పనిచేసేవారు. చనిపోయారు. అప్పటి నుంచి కష్టమంతా అమ్మదే. నేను పాలిటిక్స్‌లోకి వస్తుంటే వద్దనకపోవడమే వాళ్లు నాకిచ్చే సపోర్ట్‌(నవ్వుతూ). అన్నయ్యలు, అమ్మ అందరి సపోర్ట్‌ ఉంది. ఎక్కడైతే స్త్రీ, శిశు సంక్షేమానికి కూడా పురుషుడే మంత్రిగా ఉన్నాడో, ఎక్కడైతే కొత్తగా మహిళా కమిషన్‌నూ వేయలేదో.. స్త్రీలు  సాయుధ పోరాటం చేసిన నేల మీద పాలనలో స్త్రీలకు భాగస్వామ్యం లేదో.. నిర్బంధం ఉందో.. అక్కడ పాలనలో భాగం కావాలని స్టెప్‌ వేశాను. చూద్దాం.. గేర్‌ మార్చిన ఈ ప్రయాణం గమ్యం ఏంటో? ఫలితం ఏదైనా వెనక్కి తగ్గేది లేదు’’ అంటూ ముగించింది.

శబరిమలలో స్త్రీల ప్రవేశం?
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమలు కావడానికి ఇంత రభస జరుగుతోందంటే సమాజం ఇన్‌క్లూడింగ్‌ ఆల్‌ పార్టీస్‌లో   హిందూమత పితృస్వామ్య వ్యవస్థ భావజాలం ఎంత బలంగా నాటుకుపోయిందో అర్థమైంది కదా! అంతటా డబుల్‌ స్టాండర్డే. రిప్రొడక్టివ్‌ సిస్టమ్‌ మీద కనీస అవగాహన లేనితనానికి నిదర్శనం. 

మీ టూ మీద?
తమ పట్ల జరిగిన హింసను ఇన్నాళ్లకైనా బయటకు వచ్చి చెప్పడం మంచి పరిణామమే. దీన్ని బట్టి దేర్‌ ఈజ్‌ నో సేఫ్‌ స్పేస్‌ ఫర్‌ ఉమన్‌ అని తేలింది. ఏ మహిళకు ఎలాంటి అవమానం జరిగినా సాలిడారిటీ ఉంటుంది. అయితే మీ టూ మీద మీడియా  చేసినంత ఫోకస్‌ సామాన్య స్త్రీలకు సంబంధించిన సమస్యల మీద ఎందుకు చేయదు? మహిళల మీద జరుగుతున్న అన్నిరకాల హింసా ఆగాలి. మహిళలను పక్కన పెట్టే ఎన్ని పథకాలు వచ్చినా అవి పనికిమాలినవే. ఆకాశంలో సగం అంటారు.. ముందు అసలు నేలమీదే సగం లేము. నేను మహిళను కాబట్టి మహిళ గురించి ఆలోచించాలి అని కాకుండా.. అందరూ ఆలోచించి సమభాగస్వామ్యం ఇచ్చినప్పుడే సాధికారత సాధ్యమవుతుంది. 

స్టార్‌ క్యాంపెయిన్‌
నిజంగా ప్రజాసమస్యల మీద అవగాహన ఉండి ప్రచారానికి వస్తే మంచిదే. కాని కేవలం జనాల అటెన్షన్‌ కోసమే అయితే.. మార్కెట్‌ కల్చర్‌లో భాగంగా చూస్తా. 

దళిత్‌మూవ్‌మెంట్‌ స్వాతంత్య్రానికి ముందు.. ఇప్పుడు?
దీన్ని టైమ్‌ అండ్‌ స్పేస్‌ కాంటెక్స్‌›్టలో చూడాలి. అంబేద్కర్‌ ఉన్నంతవరకు చాలా క్లిష్టమైన రాజకీయ అవగాహన జరిగిందని నా అభిప్రాయం. ఇప్పడు దళిత మూవ్‌మెంటే కాదు అన్ని మూవ్‌మెంట్స్‌ హైలీ పొలిటిసైజ్‌ అయిపోయాయి. అప్పటిలా ఒక్కనేతే దేశమంతా నడిపే అవకాశంలేదు. దళిత ఉద్యమానికి సంబంధించీ అంతే. ఫ్రాగ్‌మెంటేషన్‌ ఎంత ఉందో.. అంతే కాన్షస్‌నెస్‌ ఉంది. ఫీనిక్స్‌లా పడి లేస్తూనే ఉంది. 

ఒక స్వతంత్ర శక్తి
ఈ ఎన్నికల్లో ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ఆ శక్తిపేరు మెర్సీ మార్గరెట్‌. పొయెట్‌గా అందరికీ తెలుసు. కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత కూడా. స్వస్థలం ముషీరాబాద్‌లోని రంగానగర్‌. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం..ఆ ప్రాంత పరిస్థితులే అంటుంది మెర్సీ. ‘నా చిన్నప్పుడు  ఎలా ఉందో ఇప్పటికీ ఆ ప్రాంతం అలాగే ఉంది. ఎలాంటి మార్పు లేదు. అయిదేళ్లకు ఒక్కసారి మాత్రమే కనిపించే నేతలు, అబద్ధపు హామీలతో విసిగి పోయున్నారు జనాలు. ఈ సిట్యుయేషన్‌ మారాలనే ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చా. చిన్నప్పుడు మా తాతయ్య, నాన్న దగ్గర రాజకీయాల గురించి వినేదాన్ని. రైటర్‌గా మారాక ఇంకొంత అవగాహన వచ్చింది.ఎన్‌జీవోలో పనిచేసినప్పుడూ కొన్ని విషయాలను నేర్చుకున్నా. ఆలోచనలు చేతల్లో ఉంటేనే మార్పు సాధ్యం. దానికి అధికారం ఉండాలి. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. విద్య, ఆరోగ్యం, ఉపాధి నా లక్ష్యాలు. గెలుపు ఓటముల కన్నా.. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం ఉండాలి. ఆ ధ్యేయంతోనే ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధపడ్డా’’ అంటుంది మెర్సీమార్గరేట్‌. ప్రస్తుతం ఆమె భారత్‌ పీజీ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. 
– సరస్వతి రమ
 

మరిన్ని వార్తలు