‘గండరగండ’భేరుండం

13 Nov, 2017 00:00 IST|Sakshi

ఎలాంటి భారీ జంతువునైనా ఒక్క ఉదుటున తన్నుకుపోయే గండభేరుండ పక్షి గురించి జానపద కథల్లో చాలామంది చదువుకునే ఉంటారు. అప్పట్లో అలాంటి భారీ పక్షులు ఉంటే ఉండొచ్చని నమ్మేవారు కొందరైతే, అలాంటివన్నీ అభూత కల్పనలని కొట్టిపారేస్తారు మరికొందరు. గండభేరుండ పక్షి అభూత కల్పనేమీ కాదు, సుదూర భూతకాలంలో అలాంటి పక్షిజాతి ఒకటి నిజంగానే జీవించి ఉండేదనేందుకు ఇటీవలే ఆధారాలు బయటపడ్డాయి.

మంగోలియాలోని గోబీ ఎడారి ప్రాంతంలో దీని అవశేషాలు బయటపడ్డాయి. వాటిని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ పక్షి దాదాపు ఒక విమానం సైజులో ఉండేదని చెబుతున్నారు. దీని రెక్కల పొడవు ఏకంగా 36 అడుగుల వరకు ఉండేది. ఇది నేలపై నిలుచుంటే దీని ఎత్తు జిరాఫీని మించి ఉండేదని, అప్పట్లో ఇది డైనోసార్‌ పిల్లలు సహా భారీ జంతువులను వేటాడి బతికి ఉండవచ్చని అంటున్నారు.

గోబీ ఎడారిలో దొరికిన దీని వెన్నుపూస ముక్కల శిలాజాలు ఒక్కొక్కటి ఎనిమిది అంగుళాల పొడవు ఉన్నట్లు చెబుతున్నారు. జపాన్‌లోని టోక్యో వర్సిటీ శాస్త్రవేత్తలు, బ్రిటన్‌లోని పోర్ట్స్‌మౌత్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పక్షి శిలాజాలపై పరిశోధనలు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు