World Migratory Bird Day 2023: శీతాకాలం విడిది కోసం వలస వెళ్తున్న పక్షులు, వేలకిలోమీటర్ల ప్రయాణం

14 Oct, 2023 16:57 IST|Sakshi

శీతాకాలం విడిది కోసం పక్షుల వలసలు మొదలయ్యాయి. దేశీయంగానూ ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు పక్షులు వలస వెళ్తాయి.ఎన్నో జాతుల పక్షులకు వలస వెళ్ళడం వాటి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ప్రపంచ పక్షి జాతుల్లో సుమారు 40శాతం దాకా వలస వెళ్తాయని అంచనా. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

శీతోష్ణస్థితిలో ఏర్పడిన అననుకూల పరిస్థితుల వల్ల, ఆహారం కోసం, గుడ్లను పెట్టి పొదిగి సంతానాభివృద్ధికి, వ్యాధుల నుంచి రక్షణకు పక్షులు వలస వెళ్తాయి. వలసలో భాగంగా పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.వాతావరణం అనుకూలంగా మారిన తరవాత మళ్ళీ వెనుదిరుగుతాయి. ముఖ్యంగా శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరి­యా, రష్యా, టర్కీ, యూరప్‌ దేశాల నుంచి పక్షులు భారత్‌లోకి వలస వస్తుంటాయి. అయితే శీతాకాల విడిది కోసం వలస వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది.


ఈ చిత్రంలో కనిపిస్తున్న పక్షి పేరు ఓనోన్‌ కుకూ. ఏప్రిల్‌29న ఆఫ్రికాలోని కెన్యాలో ఉన్న ఈ పక్షి ఈరోజు(శనివారం)మధ్యప్రదేశ్‌కి చేరుకుంది. అరేబియా సముద్రానికి  150 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఈ పక్షి ప్రయాణం సాగింది. మరో వారం రోజుల్లో ఇది 5వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు.దీనిలాగే ఇతర పక్షులు కూడా మార్గమధ్యంలో ఆహారం, విశ్రాంతి కోసం కొంతకాలం ఆగుతాయి. 


వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చే విభిన్న రకాల విదేశీ పక్షులను చూసేందుకు, కెమెరాలతో క్లిక్ మనిపించేందుకు బర్డ్ వాచర్లు క్యూ కడుతుంటారు. అయితే ఒకప్పుడు వందల సంఖ్యలో వచ్చే విదేశీ పక్షుల రాక క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ పక్షులు ఆవాసాలుగా చేసుకునే చెరువులు ఆక్రమణలకు గురవడం, చెరువుల చుట్టూ నిర్మాణాలు పెరిగిపోతుండటంతో వాటి రాక క్రమంగా తగ్గిపోతోంది.

ప్రస్తుతం ఈ సీజన్​లోనూ సిటీకి  విదేశీ పక్షులు వచ్చినప్పటికీ మునుపటితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువని బర్డ్​వాచర్లు పేర్కొంటున్నారు. ఇలాగే కొనసాగితే రాను రాను ఈ సంఖ్య మరింత పడిపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు