ఓ మంచి సంకల్పానికి ఆది!

19 Mar, 2015 23:12 IST|Sakshi
ఓ మంచి సంకల్పానికి ఆది!

కొంత నిర్దుష్టమైన కాలం, శక్తులను కలిపి మనం జీవితం అంటాం. ఇందులో కాలం మన ప్రమేయం లేకుండానే గడిచిపోతుంది. సూర్యచంద్రుల పరంగా భూమి ఉండే స్థానం మన వ్యవస్థపై చాలా ప్రభావం చూపుతుంది. మన శరీరం, మనసులపై ఈ సూర్యచంద్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

భూమి ముఖ్యంగా సూర్యశక్తి వల్లే నడుస్తున్నది, మీ శరీరం కూడా ఈ భూమిలో ఒక అంశమే. సూర్యశక్తిని మీరెంత గ్రహించగలరన్న దానిని బట్టే మీకెంత శక్తి ఉన్నదనేది నిర్ణయించబడుతుంది. అందువల్ల సూర్యుని చుట్టూ జరిగే భూ పరిభ్రమణం కాలాన్నే కాక,  శక్తిని కూడా నిర్దేశిస్తుంది. అంటే జీవానికి ప్రధాన అంశాలైన కాలమూ, శక్తి అనే ఈ రెండూ కూడా సూర్యుని వల్లనే నిర్దేశింపబడుతున్నాయి.
 అందువల్ల భూమిపై సూర్యుని ప్రభావం అత్యంత అధికంగా ఉంటుంది. సూర్యునిలాగా చంద్రుడు శక్తిని ప్రసరింప లేకపోయినా, భూమికి అతి సమీపంలో ఉండడంవల్ల మనపై చంద్రుడి ప్రభావం కూడా ఎక్కువే.

అసలు మన పుట్టుకే చంద్రగమనంపై ఆధారపడి ఉన్నది. ఎందుకంటే స్త్రీ శరీరంలోని ఋతుక్రమానికీ, చంద్రుని గమనానికి నూటికి నూరు శాతం సంబంధం ఉంది. చంద్రుని ప్రభావం కాంతి, శక్తి, ఉష్ణాలకు సంబంధించినది కాదు,  అయస్కాంత పరమైనది. ఈ రోజు ఏదో ఒకదాని భ్రమణ, పరిభ్రమణాల వల్లనే విద్యుత్తు తయారవుతున్నది. వేరే మార్గం లేదు. అదేవిధంగా చంద్రుడు తన భ్రమణ, పరిభ్రమణాల ద్వారా ఒక శక్తిక్షేత్రాన్ని ఏర్పరుస్తున్నాడు. అందువల్ల బయట నుంచి మన జీవితాన్ని ప్రభావితం చేసే వాటిని అర్థం చేసుకోవాలంటే సూర్యడిని పరిగణనలోకి తీసుకోవాలి. అంతరంగంలో జరిగే దానిని అర్థం చేసుకోవాలంటే చంద్రుడిని పరిగణనలోకి తీసుకోవాలి.
 
ఇప్పడు భూమి సూర్యునికి అతి సమీపంలో ఉన్నది. ఎదగటానికి వేసవి అత్యంత అనుకూలమైనది. వృక్షజాతి అంతా వేసవిలోనే బాగా పెరుగుతుంది. ఎరుకతో ఉంటే ఈ సమయమే మానవులకు కూడా ఎంతో మంచిది. మీ చుట్టూ ఉన్న జీవనం ఉరకలేస్తూ ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు మీకు కావలసిన విధంగా మలచుకోవడానికి కూడా ఇదే ఉత్తమమైన సమయం. ఇది ఉత్తరాయణ కాలం కూడా. అంటే భూమి పరంగా చూస్తే సూర్యగమనం ఉత్తరం వైపు ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో ఉన్న మనకు ఈ సమయం ఎంతో ముఖ్యమైనది. ఆత్మ సాక్షాత్కారానికి, ఆశయాలను సాధించుకోవడానికి అనువైన సమయం ఇదే.

మానవుని అంతరంగంలో జరిగే దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే సంస్కృతులు సహజంగానే చాంద్రమాన క్యాలండర్‌ను లేక నూటికి నూరుశాతం చాంద్రమానం కాకపోయినా ఎక్కువ చాంద్రమాన ప్రభావం ఉన్న సౌర చాంద్రమాన క్యాలండర్‌ను అనుసరించాయి. భారతీయ సాంప్రదాయ క్యాలండర్‌ని పంచాంగం అంటారు. ప్రపంచంలో అతి పురాతనమైన క్యాలండర్లలో ఇది ఒకటి. ఈ క్యాలండర్ పరంగా ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్నాము.

నిజానికి ఈ అనంతవిశ్వంలో పాత సంవత్సరం, కొత్తసంవత్సరం అంటూ ఏమీలేవు. ఈ ఎల్లలన్నీ మనం మన జీవితం ఎలా సాగుతుందో చూసుకోవడానికి మనం ఏర్పరచుకున్నవే. మనం ముందుకు పోతున్నామో, లేదా వెనక్కు పోతున్నామో తెలుసుకోవడానికి ఏర్పరచుకున్నవే. అందువల్ల క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే మానవునిగా మనం పురోగమించామా లేదా గమనించాలి. మానవునిగా క్రితం సంవత్సరం కన్నా కొద్దిగానైనా మెరుగయ్యామా, లేదా అన్నది చూసుకోవాలి. అలాగే వచ్చే సంవత్సరం కల్లా మీరు ఇప్పటికన్నా చాలా మెరుగైన మానవులు కావాలి. ఇంకా సంతోషంగా, శాంతంగా, ప్రేమగా ఉండే అంటే అన్నిరకాలుగా ఉత్తమమైన మానవులుగా తయారవ్వాలి. దానికి మీరేం చేయాలో మీరే నిర్ణయించుకోవాలి.

 మీరు ఆ విధంగా అడుగులు వేస్తే, మీలో మానవత్వం పొంగిపొర్లుతుంది. అప్పుడు దివ్యత్వం మీకు దానంతటదే సంభవిస్తుంది. అలా మీకు సంభవించు గాక!
 ప్రేమాశీస్సులతో... సద్గురు

మరిన్ని వార్తలు