ముక్తి కోసం అన్నీ విడిచి..

29 May, 2019 14:48 IST|Sakshi

అహ్మదాబాద్‌ : సూరత్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక భౌతిక ప్రపంచానికి దూరంగా జైన సన్యాసినిగా మారాలని నిర్ణయం తీసుకుంది. బాలిక నిర్ణయాన్ని ఆమె కుటుంబం స్వాగతిస్తూ తమ కుమార్తె నిర్ణయం తమకు సంతోషం కలిగిస్తోందని చెప్పారు. ఈ ప్రపంచం తాత్కాలికమని, ఇక్కడ మనం అనుభవించే సుఖాలన్నీ అశాశ్వతమని, నిరాడంబర జీవనంతోనే శాంతి, ముక్తి సాధ్యమని బాలిక ఖుషీ షా చెబుతున్నారు.

తన కుటుంబం నుంచి తాను ఒక్కరినే ఈ నిర్ణయం తీసుకోలేదని, శాంతియుత జీవనం కోసం గతంలో తమ కుటుంబంలో నలుగురు సన్యసించారని తెలిపారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రతిఒక్కరూ ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాలని సిమంధర్‌ స్వామీజీ చెబుతారని, తాను 12 ఏళ్ల వయసులో సత్వరమే దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నానని అన్నారు.

చిన్న వయసులోనే తమ కుమార్తె ఖుషీ తీసుకున్న నిర్ణయం అసాధారణమని, దీనికి తాము గర్వపడుతున్నామని బాలిక తండ్రి, ప్రభుత్వోద్యోగి వినీత్‌ షా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె సన్యాసినిగా మారిన తర్వాత లక్షలాది మంది జీవితాల్లో వెలుగునింపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరవ తరగతిలో 97 శాతం మార్కులు సాధించిన ఖుషీ గత ఏడాది నవంబర్‌లో నిరాడంబర జీవనం గడిపేందుకు పాఠశాల విద్యకు దూరమైందని చెప్పారు.

తమ కుమార్తె ఇప్పటికే కాలినడకన వేల కిలోమీటర్లు నడిచిందని, దీక్షానంతర జీవితంపై అవగాహన పెంచుకుందని తెలిపారు. ఖుషీని డాక్టర్‌గా చూడాలని తాను కోరుకున్నా ఆమె ఆకాంక్షలు ఫలించాలని తన దీక్షకు తల్లితండ్రులుగా తామిద్దరం అంగీకరించామని చెప్పారు.

మరిన్ని వార్తలు