అప్పు లేనివాడు అధిక సంపన్నుడు

30 Aug, 2017 00:49 IST|Sakshi
అప్పు లేనివాడు అధిక సంపన్నుడు

ఇది పెద్దలు అనుభవంతో చెప్పిన మాట. అయితే, ఇప్పుడు అప్పు చేయడం ఒక ఫ్యాషన్‌. ఒక అలవాటు. అప్పు చేయనిదే పొద్దు పోదు కొందరికి. రకరకాల కారణాలు చెప్పి, అవతలి వాళ్లని బురిడీలు కొట్టించి మరీ అప్పు చేసి, జల్సాలు చేయడం ఇంకొందరి నిత్యకృత్యం. కావాలంటే వడ్డీ ఎంతయినా తీసుకోండి కానీ, అప్పు లేదని మాత్రం అనకండి అంటూ ముందే ముందరి కాళ్లకు బంధాలు వేస్తారు. ఒకటి రెండుసార్లు మాట నిలబెట్టుకుని నమ్మకం కలిగిస్తారు, ఆ తర్వాత నట్టేట ముంచుతారు. నిజానికి అప్పు చేయడం తప్పేమీ కాదు. అవసరానికి సరిపడా డబ్బు లేకపోతేనో, సమయానికి సర్దుబాటు కాకపోతేనో చేబదులు తీసుకోవచ్చు.

అయితే, అప్పు చేయడాన్ని అలవాటుగా మార్చుకోవడమే తప్పు. అవసరానికి అప్పు ఇచ్చి ఆదుకున్న వాళ్లకు ముఖం చాటేయడం ఇంకా తప్పు. గట్టిగా అడిగితే ‘మీ డబ్బు తీసుకుని మేమేమీ ఊరొదిలి పారిపోములే’ అంటూ ఈసడింపుగా మాట్లాడటం ఇంకా పెద్ద తప్పు. ఇరుగు పొరుగు దగ్గరో, తెలిసిన వాళ్ల దగ్గరో చేబదుళ్లు తీసుకోవడం నామోషీగా మారిపోయి, క్రెడిట్‌ కార్డులు తీసుకోవడం, కార్డు చేతిలో ఉంది కదా అని దానిని ఎడాపెడా వాడేయటం, ఆ తర్వాత ఆ అప్పులు తీర్చలేక తల వేలాడేయడం... ఇదంతా ఊహించే పెద్దలు ‘అప్పు లేనివాడు అధిక సంపన్నుడు’ అన్నారు. అందుకే, అవసరానికి అప్పు చేయడం తప్పు కాదు. అవసరం లేకున్నా అప్పు చేసి మరీ ‘మా దగ్గర ఆ వస్తువులున్నాయి, ఈ వస్తువులున్నాయి’ అని గప్పాలు కొట్టుకోవడం, విందు వినోదాలతో జల్సా చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే. అందుకే ‘అప్పు చేసి పప్పు కూడు’ తినేకన్నా, ఉన్నదానిని జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ హుందాగా జీవించడమే ఆనందం.

మరిన్ని వార్తలు