ఇప్పుడు మా వంతు...

22 Apr, 2014 23:02 IST|Sakshi
ఇప్పుడు మా వంతు...

 చైతన్యం

పశ్చిమ బెంగాల్‌లోని సెక్స్ వర్కర్లు కొన్నేళ్లుగా నాయకులకు మూడంటే మూడు విన్నపాలు వినిపించుకుంటున్నారు.
ఒకటి: అయ్యా, అక్రమ రవాణా నిరోధక చట్టంలోని 3, 4, 18, 20 సెక్షన్లను రద్దు చేయండి. వాటిని అడ్డం పెట్టుకుని, మా జీవితాలను నరకప్రాయం చేస్తున్నవారి నుండి మాకు రక్షణ కల్పించండి.

రెండు: మా వృత్తిని కూడా కార్మిక శాఖ పరిధిలోకి తెచ్చి, చట్ట ప్రకారం మాకు లభించవలసిన హక్కులు, సదుపాయాల విషయమై మాకు భరోసా ఇవ్వండి.

మూడు: ‘దర్బార్’ ఏర్పాటు చేసిన స్వయం నియంత్రణ మండలికి ప్రభుత్వ ఆమోదం లభించేలా చూడండి.

దర్బార్ అంటే ‘దర్బార్ మహిళా సమన్వయ కమిటీ’. ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్న స్వయం నియంత్రణ మండలికి ఆమోదం లభించినట్లయితే చిన్న పిల్లల్ని పడుపువృత్తిలోకి రాకుండా నిరోధించడానికి సాధ్యం అవుతుంది.అలాగే బలవంతంగా ఈ విషవలయంలోకి తోసివేయబడిన వారికి విముక్తి కల్పించడానికి వీలవుతుంది. అయితే ఈ మూడు విన్నపాలూ ఇంతవరకూ పట్టించుకున్నవారే లేదు. ‘‘నోట్లు రాని పనులు నాయకులు చేయరనీ, ఓట్లు పోగొట్టుకునే పనిని పార్టీలు చేయవనీ అంటారు. బహుశా సెక్స్‌వర్కర్ల అభ్యర్థనల మన్నింపు తమకు లాభం కన్నా, నష్టమే ఎక్కువ తెచ్చిపెడతాయనుకున్నారేమో ఎవరూ మా సంక్షేమం గురించి పట్టించుకోలేదు’’ అని ‘దర్బార్ మహిళా సమన్వయ కమిటీ’ కార్యదర్శి భార తీ దేవ్ వ్యాఖ్యానించారు.
 
పడువువృత్తికి కేంద్రంగా పేరుమోస్తున్న సోనాగచీ సహా, పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలలో సుమారు 65 వేల మంది వరకు సెక్స్ వర్కర్లు, వారి కుటుంబాల వారు ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వీరు చేసే అభ్యర్థనలు ఈ మూడే. అందుకే ఈసారి ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ ఓటు వేయకూడదని వీరంతా గట్టిగా నిర్ణయించుకున్నారు. అంటే ‘నోటా’ మీట నొక్కబోతున్నారు! ‘‘మాకెవరూ ఏమీ చేయట్లేదు. మేమెందుకు వారికి ఓటేయాలి?’’ అని కాస్త ఆవేదనతో కూడిన ఆగ్రహంతో అంటున్నారు భార తీ దేవ్.
 
పశ్చిమబెంగాల్‌లో తొలి విడతగా ఏప్రిల్ 17న నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా 38 స్థానాలకు నాలుగు విడతలుగా మే 12 వరకు ఎన్నికలు జరుగుతాయి. వీటిల్లో ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీ అభ్యర్థికీ ఓటు వేయకూడదని, నోటా (నన్ ఆఫ్ ది అబౌవ్) మీటను నొక్కాలని ‘దర్బార్’ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సుమన్ మైత్రా అనే బెంగాలీ దర్శకుడు సోనాగచీ సెక్స్‌వర్కర్ల దయనీయ స్థితిగతులపై ‘ది బెస్ట్ సెల్లర్’ అనే హిందీ చిత్రం తీశారు.
 
 ఈ ఏడాది జరగబోయే గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించాక, మిగతా ప్రాంతాలలోనూ ఆ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ‘‘ఇదొక చీకటి సినిమా. వాస్తవాలతో అల్లిన కథనం. సోనాగచీలో పుట్టిపెరిగిన అను, ఆయేషా అనే ఇద్దరు అక్కచెల్లెళ్ల చుట్టూ స్క్రీన్‌ప్లే అంతా నడుస్తుంది’’ అంటున్నారు మైత్రా. నాయకులు, ప్రభుత్వాలు పట్టించుకోని సామాజిక అంశాలను ఏ దేశంలోనైనా కళాకారులే కదా మీద వేసుకునేది.

మరిన్ని వార్తలు