అద్దండి... రుద్దండి...

12 May, 2015 23:54 IST|Sakshi
అద్దండి... రుద్దండి...

చక్కెరతో చెక్
కాఫీలో చక్కెర తక్కువైతే చుక్క కూడా తాగలేం. చక్కెరతో నోరు తీపి చేయనిదే ఏ శుభవార్తనీ చెప్పలేం. అయితే చక్కెర రుచినిచ్చేదీ, సంతోషాన్ని రెట్టింపు చేసేది మాత్రమే కాదు... ఓ మంచి క్లీనింగ్ ఏజెంట్ కూడా. చేతికి నూనె, గ్రీజు లాంటివి అంటుకుని జిడ్డు వదలడం లేదనుకోండి. అప్పుడు కాసింత చక్కెరను, కొన్ని చుక్కల నీటిని చేతుల్లో వేసుకుని బాగా రుద్దుకోవాలి. తర్వాత నీటితో కడిగేసుకుంటే జిడ్డు మాయమైపోతుంది; వెనిగర్‌లో పంచదార వేసి, కరిగిన తర్వాత ఆ మిశ్రమంతో తుడిస్తే, మొజైక్ నేలమీద ఉన్న మరకలు తొలగిపోతాయి; దుస్తుల మీద మొండి మరకలు ఉంటే... టొమాటో రసంలో చక్కెర కలిపి దాన్ని మరకమీద వేసి కాసేపు నాననివ్వాలి.

ఆ తర్వాత బాగా రుద్దితే మరకలు వదిలిపోతాయి; రోజ్‌వాటర్‌లో చక్కెర వేసి, కరిగిన తర్వాత దానితో వెండి వస్తువులను తోమితే తళతళలాడతాయి; బేకింగ్ సోడా, చక్కెర కలిపి మెత్తని పొడిలా చేసుకుని, దాన్ని నీటిలో కలిపి చిక్కని ద్రావకంలా చేసుకోవాలి. దీనితో కనుక గిన్నెలు కడిగితే... జిడ్డు, మసి పోయి పాత్రలు మెరిసిపోతాయి; నిమ్మరసంలో చక్కెర వేసి కరగనివ్వాలి. ఓ స్పాంజిని ఈ ద్రావకంలో ముంచి తుడిస్తే వస్తువులు, గిన్నెలు, బట్టలు... దేనిమీద పడిన తుప్పు మరకలైనా వదిలిపోతాయి. అలాగే దీనితో కిచెన్లో బండలు తుడిస్తే మురికిపోయి బండలు శుభ్రపడతాయి.

మరిన్ని వార్తలు