మా అమ్మాయికి ఫిట్స్‌ అదుపులోకి వచ్చేదెలా? 

2 May, 2018 11:49 IST|Sakshi

నా కూతురి వయసు 18 ఏళ్లు. ఆమెకు గత మూడేళ్లుగా ఫిట్స్‌ వస్తున్నాయి. క్రమం తప్పకుండా ఆమెకు వాల్‌ప్రోయేట్‌ 300 ఎంజీ టాబ్లెట్లు రోజుకు రెండు ఇస్తున్నాం. అయినప్పటికీ ప్రతినెలా 1, 2 సార్లు ఫిట్స్‌ వస్తున్నాయి. ఆమెకు శాశ్వతంగా ఫిట్స్‌ రాకుండా ఉండటానికి ఏదైనా మార్గం ఉందా?  – శాంతబాయ్, మెదక్‌ 

ఫిట్స్‌ కోసం మనం వాడే మందులు కేవలం ఫిట్స్‌ను నియంత్రిస్తాయంతే. ఫిట్స్‌ను పూర్తిగా నయం చేసే మందులు అంటూ లేవు. ఫిట్స్‌ రావడం అన్నది చాలా కారణాలతో జరుగుతుంది. ఎమ్మారై, పెట్‌–స్కాన్, వీడియో ఈఈజీ వంటి అనేక పరీక్షల సహాయంతో మెదడులోని ఏ నిర్ణీత భాగం నుంచి ఈ ఫిట్స్‌ వస్తున్నాయో తెలిస్తే, అలాంటి సందర్భాల్లో శస్త్రచికిత్స సహాయంతో ‘ఫిట్స్‌కు సెంటర్‌’ అయిన ఆ భాగాన్ని తొలగించడం ద్వారా, ఆ రోగులకు మాత్రం అసలెప్పుడూ ఫిట్స్‌ రాకుండా చేయవచ్చు. అయితే క్రమం తప్పకుండా చాలా మందులు వాడుతున్నప్పటికీ నెలలో ఒకటిరెండుసార్లు తప్పక ఫిట్స్‌ వస్తున్న పేషెంట్స్‌కే ఇలాంటి శస్త్రచికిత్స సిఫార్సు చేస్తారు. 

ఇక మీరు ప్రస్తావించిన వాల్‌ప్రోయేట్‌ విషయానికి వస్తే... అది యువకులకు మంచిదే అయితే యువతులు / మహిళల విషయంలో (ప్రధానంగా యుక్తవయస్కులైనవారిలో)  ప్రభావపూర్వకంగా పనిచేయదు. పైగా స్థూలకాయం, రుతుక్రమంలో మార్పులు, జుట్టు రాలిపోవడం వంటి దుష్ప్రభావాలు చూపడంతో పాటు... ఒకవేళ వారికి గర్భం వస్తే పుట్టబోయే పిల్లల్లో అనేక లోపాలకు కూడా కారణమవుతుంది. కాబట్టి యువతులకూ, మహిళలకు దీన్ని వాడకూడదంటూ కొన్ని దేశాల్లో దీన్ని నిషేధం కూడా విధించారు. కాబట్టి మీరు మరోసారి మీ అమ్మాయికి చికిత్స చేస్తున్న న్యూరాలజిస్ట్‌ను కలిసి ఈ విషయాన్ని చర్చించండి. దాంతో ఆయన మీ అమ్మాయి మందును మారుస్తారు. ఇటీవల యువతులకు, మహిళలకు చాలా సురక్షితమైనవి, మంచివి అయిన లామోట్రైజీన్, లెవిటెరెసిలాన్, బ్రైవరాసెటమ్‌ వంటి కొత్త మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఏదైనా ఒక మందు వాడటం ద్వారానే ఫిట్స్‌పై 60 నుంచి 90 శాతం వరకు అదుపు సాధించవచ్చు. అయితే ఈ మందులు క్రమం తప్పకుండా, రోజూ అదే సమయానికి తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మీ డాక్టర్‌ను సంప్రదించండి. మీ అమ్మాయి విషయంలో మంచి మార్పు తప్పక కనిపిస్తుంది.

డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌ రెడ్డి, 
చీఫ్‌ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, 
రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు