సెలవుకు సెలవు

21 Jul, 2017 23:22 IST|Sakshi
సెలవుకు సెలవు

అతడు టీచర్‌... గవర్నమెంట్‌ ఉద్యోగం. అతడికి పెళ్లి కుదిరింది. ‘పెళ్లికి ఓకే... అయితే... పెళ్లి కోసం సెలవు పెట్టనన్నాడు. సెలవుల్లోనే ముహూర్తం పెట్టమన్నాడు. పెళ్లి కూతురు కూడా సంతోషంగా ఒప్పుకుంది. వాళ్లకు కొడుకు పుట్టాడు... బిడ్డను చూడడానికి సెలవు పెట్టి
పరుగులు తీస్తాడనుకున్నారంతా. స్కూలుకు సెలవు వచ్చిన రోజే వెళ్లాడు.


తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి జెడ్‌పి హైస్కూల్‌లో సైన్స్‌ టీచర్‌ వేణుగోపాల్‌. అతడు 2012 నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. పెళ్లికి సెలవు పెట్టలేదు, బిడ్డ పుట్టాక సెలవు పెట్టలేదు... సరే... తనకు కడుపు నొప్పో కాలు నొప్పో వస్తే ఏం చేస్తాడు? అని వెటకారం చేసిన వాళ్లూ ఉన్నారు. అయితే వేణుగోపాల్‌ మాత్రం తనకు కడుపు నొప్పి వచ్చిన రోజూ సెలవు పెట్టలేదు. వాంతులైన రోజు కూడా మధ్యలో వచ్చి తన క్లాసు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాడు. అసలే సెలవు పెట్టకుండా ఉద్యోగం చేయడం కష్టం కదా అని ఎవరైనా అడిగితే కొన్నిసార్లు కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు.

మనిషి తలుచుకుంటే సాధ్యమేనంటాడు. ఇప్పుడు అతడి బాటలో మరికొందరు నడుస్తున్నారు. వేణుగోపాల్‌ సొంతూరు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల. పాఠశాల విద్య అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో భౌతికశాస్త్రంలో పీజీ చేసి బీఈడీ భువనగిరిలో చేశాడు. 2012 డీఎస్సీలో ఎంపికై గర్జనపల్లి పాఠశాలకు టీచరుగా వచ్చాడు.

శుద్ధజలం..
వేణుగోపాల్‌ సెలవు పెట్టని ఉపాధ్యాయుడు మాత్రమేకాదు. మనసున్న మనిషి కూడా. గర్జనపల్లి మారుమూల అటవీ గ్రామం. వైద్యసేవలు అంతంత మాత్రమే. ఇక్కడ ఎక్కువగా వచ్చే వ్యాధులు అపరిశుభ్రమైన నీళ్లతోనే అని గుర్తించిన వేణుగోపాల్‌ బడికి వచ్చే పిల్లలను శుద్ధ జలం అందించాలనుకున్నారు. కానీ ఊరిలో శుద్ధ జల కేంద్రం లేదు. దాంతో తన సొంతూరు మరిమడ్ల నుంచి విద్యార్థుల కోసం ప్రతి రోజూ రెండు క్యానుల్లో నీటిని తెస్తాడు.

విద్యార్థులకు స్ఫూర్తి..
విద్యార్థుల పట్ల టీచర్‌ అంత ఆదరం చూపిస్తే పిల్లలు టీచర్‌ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. టీచర్‌లో రోల్‌మోడల్‌ను వెతుక్కుంటారు. వేణుగోపాల్‌ను చూసి చాలా మంది పిల్లలు క్రమం తప్పకుండా బడికి వస్తున్నారు. దీనితో ఆ ఊరిలో డ్రాప్‌ అవుట్స్‌ చాలా తగ్గింది.  వేణుగోపాల్‌ స్ఫూర్తితో జి.శ్వేత ఆరవ తరగతి నుంచి 10వ తరగతి వరకు నాలుగేళ్లు ఒక్క రోజు కూడా బడికి ఆబ్సెంట్‌ కాలేదు. భానోతు శిరీష మూడేళ్ల నుంచి క్రమం తప్పకుండా బడికి వస్తోంది. ఇలాగే వేణుగోపాల్‌ను ఆదర్శంగా తీసుకుని ఏళ్లకు ఏళ్లకు ఒక్క రోజు కూడా బడి మానని పిల్లలు ఆ బడిలో ఎందరో ఉన్నారు.

ఆదర్శ బోధన..
రోజూ బడికి రావడమే కాదు. చదువు చెప్పడంలోనూ అంతే చిత్తశుద్ధి కనిపిస్తుందతడిలో. పదవ తరగతి పిల్లలకు ప్రయోగాలకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసి ప్రయోగాలు చేయిస్తున్నాడు. భౌతికశాస్త్రం అంటేనే భయపడే పిల్లలు ఈ సారు బోధనతో ఆ విషయంపై అమితమైన ప్రేమను ఏర్పరచుకున్నారు. ప్రతి విషయాన్ని వివరించి, సూక్ష్మంగా బోధించే ఈ ఉపాధ్యాయుడు పాఠశాలలోని పిల్లలందరినీ ప్రభావింతం చేస్తున్నాడు. ఆ బడిలో చదివే 86 మంది విద్యార్థులకు ఇప్పుడు వాళ్ల సైన్స్‌ టీచరే స్ఫూర్తి. వేణుగోపాల్‌ సేవలను ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారితోపాటు పాఠశాలను సందర్శించిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

పేద పిల్లలకు న్యాయం
ప్రతి మనిషికి ఏదో ఒక్క ప్రత్యేకత ఉండాలి. ఉపాధ్యాయుడిని కాబట్టి విద్యాబోధనతోనే ఓ ప్రత్యేక గుర్తింపును పొందాలనుకొని ఎవరూ చేయని ఈ పనిని చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం రాక ముందు ఓ కార్పోరేట్‌ కాలేజిలో ఉద్యోగం చేశాను. కార్పోరేట్‌ కళాశాలలో చేసిన పనితో పోలిస్తే... ఇది చాలా తేలిక. అక్కడ పడిన కష్టంలో కనీసం సగమైనా ఇక్కడ కష్టపడితే పేద పిల్లలకు న్యాయం జరుగుతుంది. నా సంకల్పానికి మా అమ్మ అమృత, నాన్న మురళి, భార్య దివ్య సహకరిస్తున్నారు. వారి వల్లే నాకిది సాధ్యమవుతోంది.
– వేణుగోపాల్, సైన్స్‌ టీచర్‌

ఉద్యోగాన్ని అంకిత భావంతో...
గర్జనపల్లి స్కూల్‌కు మంచి పేరు తెస్తున్నారు. వేణుగోపాల్‌ అంకితభావంతో పని చేస్తారు. ప్రయోగాలు చేయిస్తూ.. పిల్లలకు బోధిస్తారు. ఐదేళ్లుగా ఏనాడు సెలవు పెట్టకుండా పని చేస్తున్నారు. ఎన్ని పనులు ఉన్నా.. సెలవుల్లోనే చేసుకుంటూ.. విధులకు రాకుండా ఉండడం లేదు. వేణుగోపాల్‌ ఆదర్శ ప్రాయుడు.
– పి.లక్ష్మణ్‌రావు, ప్రధానోపాధ్యాయులు

మూడేళ్లుగా ఒక్కరోజూ బడి మానలేదు..
నేను బడి ఉంటే చాలు తప్పకుండా వస్తాను. మూడేళ్లుగా ఒక్క రోజూ బడికి మానేయలేదు. మా అమ్మ రేణ, నాన్న బన్నాజి. వ్యవసాయం చేస్తారు. వేణుసార్‌ రోజూ బడికి రావడం చూసి మేమూ వస్తున్నాం. మా బడిలో చాలా మంది సారు లాగే వస్తున్నారు.
– భానోతు శిరీష, 10వ తరగతి విద్యార్థిని.
– వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ రాజన్న సిరిసిల్ల

మరిన్ని వార్తలు